logo

కొత్త ఎత్తులతో చిత్తు చేస్తున్నారు..

మంచిర్యాల పట్టణానికి చెందిన ఓ బాధితుడికి సైబర్‌ నేరగాడు ఫోను చేసి ఓ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ మేనేజర్‌గా పరిచయం చేసుకున్నాడు. రూ. 20 వేల రుణం మంజూరైందని, ప్రాసెసింగ్‌ ఫీజు రూ. 3వేలు పంపాలని బాధితుడి నుంచి వసూలు చేశాడు.

Published : 09 Dec 2022 03:22 IST

జిల్లాలోనూ పెరుగుతున్న సైబర్‌ నేరాలు

మంచిర్యాల నేరవిభాగం, న్యూస్‌టుడే

మంచిర్యాల పట్టణానికి చెందిన ఓ బాధితుడికి సైబర్‌ నేరగాడు ఫోను చేసి ఓ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ మేనేజర్‌గా పరిచయం చేసుకున్నాడు. రూ. 20 వేల రుణం మంజూరైందని, ప్రాసెసింగ్‌ ఫీజు రూ. 3వేలు పంపాలని బాధితుడి నుంచి వసూలు చేశాడు.

సీసీసీకి చెందిన ఓ బాధితుడికి పాన్‌కార్డు లింక్‌ చేయాలి లేకపోతే మీ బ్యాంక్‌ ఖాతా బ్లాక్‌ అవుతుందని సందేశం వచ్చింది. బాధితుడు ఆ సందేశంలో ఉన్న లింకుని క్లిక్‌ చేసి తన వివరాలతో పాటు ఏటీఎం కార్డు నంబరు, రిసీవ్‌ చేసుకున్న ఓటీపీలు నమోదు చేశాడు. వెంటనే బాధితుడి ఖాతా నుంచి రూ.7 వేలు సైబర్‌ నేరగాడి ఖాతాలోకి వెళ్లిపోయాయి.

బెల్లంపల్లికి చెందిన ఓ బాధితుడు గూగుల్‌లో ఓ ప్రముఖ ఆన్‌లైన్‌ షాపింగ్‌ కస్టమర్‌ కేర్‌ నంబర్‌ కోసం సెర్చ్‌ చేసి కాల్‌ చేయగా అది సైబర్‌ నేరగాడికి కనెక్ట్‌ అయింది. ఈ సైబర్‌ నేరగాడు మీ వస్తువు మీకు డెలివరీ అవ్వాలంటే లింక్‌కు వివరాలు పంపాలని కోరాడు. లింక్‌ క్లిక్‌ చేయగానే బాధితుడి ఖాతాలోని రూ. 20వేలు సైబర్‌ ఖాతాలోకి జారుకున్నాయి.

దేశం మొత్తమ్మీద సైబర్‌ నేరాలు మన రాష్ట్రంలోనే అధికంగా నమోదవుతున్నట్లు ఎన్‌సీఆర్‌బీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2021లో దేశవ్యాప్తంగా 14,007 కేసులు నమోదుకాగా ఒక్క తెలంగాణలోనే 7,003 రిజిస్టర్‌ అయినట్లు బుధవారం లోక్‌సభలో కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌చంద్రశేఖర్‌ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రోజుకి సగటున 27 కేసులు ఉంటున్నాయి. మన జిల్లాలోనూ నెలకు పదికిపైగా ఇవి వెలుగు చూస్తున్నాయి. ఇందులో సగం వరకే కేసులు నమోదైతే మిగతా వాటిపై బాధితులు ఫిర్యాదు చేయడం లేదు.

తప్పిదాలతోనే..

చాలామంది అనవసర లింకులకు స్పందిస్తున్నారు. ప్రధానంగా చరవాణి వినియోగంపై అవగాహన లేనివారు, ఎక్కువగా చదువుకోని వారు సందేశాల రూపంలో వచ్చే లింకులను నొక్కి సైబర్‌ నేరగాళ్లకు చిక్కుతున్నారు. 2021లో రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 618 ఆన్‌లైన్‌ ద్వారా 1930కు ఫిర్యాదు చేయగా పోలీసులు 32 కేసులు మాత్రమే చేధించారు.

* సైబర్‌ నేరగాళ్లు సృష్టించిన వైబ్‌సైట్లు, యాప్‌లను నమ్మి మోసపోతున్నవారు ఎక్కువ. వాటిల్లో చదువుకున్న వారే బాధితులు కావడం ఆందోళన కలిగించే విషయం. ప్రముఖ కంపెనీల డీలర్‌ షిప్‌లు, బహుమతుల పేరిట ఈ మెయిల్స్‌ పంపుతున్నారు. ఈకామర్స్‌ సంస్థల పేరిట ఇంటి చిరునామాకు లక్కీడ్రా కూపన్లు పంపించి నమ్మిస్తున్నారు. వీటి ద్వారా మోసపోతున్న బాధితులు ఎక్కువగా ఉంటున్నారు.


ఆలోచించాలి.. అప్రమత్తంగా ఉండాలి
చంద్రశేఖర్‌రెడ్డి, రామగుండం పోలీస్‌ కమిషనర్‌

ఆన్‌లైన్‌ షాపింగ్‌ పార్సిల్స్‌ వచ్చినట్లు ఇంటికి వచ్చి వాటిని ఇవ్వడానికి యత్నం చేస్తారు. మీరు ఆర్డర్‌ చేయలేదని చెప్పగా వెంటనే ఓటీపీ వస్తుందని ఆ వివరాలు తెలపాలని కోరుతారు. ఇలాంటి వాటిని నమ్మి ఓటీపీ చెప్పారో బ్యాంకు ఖాతాలోని డబ్బు మొత్తం వారి ఖాతాలోకి వెళ్తుంది. ఉద్యోగాల పేరిట మోసాలు జరుగుతున్నాయి. మీ ప్రమేయం లేకుండా మీకు ఓటీపీ వస్తే దాన్ని ఎవరికి చెప్పవద్దు. అది సైబర్‌ నేరగాళ్ల ఎత్తుగడగా గుర్తించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని