logo

Mini Theatre: నట్టింట్లో నవలోకం..!

సినిమా అంటే పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టమైన వ్యాపకం. కొత్త సినిమా వస్తే ఉదయమే లేచి టికెట్లకు వరుసలో నిలబడి కుస్తీలు పట్టేవారు.

Updated : 15 Dec 2022 11:30 IST

మినీ థియేటర్లపై పెరుగుతున్న ఆసక్తి
నిర్మల్‌ పట్టణం/మామడ, న్యూస్‌టుడే

సినిమా అంటే పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టమైన వ్యాపకం. కొత్త సినిమా వస్తే ఉదయమే లేచి టికెట్లకు వరుసలో నిలబడి కుస్తీలు పట్టేవారు. అధిక ధర చెల్లించైనా సొంతం చేసుకునేందుకు ప్రయత్నించేవారు. విడుదలైన రోజే చూడాలన్న తపనతో పల్లెనుంచి పట్టణాలకు వెళ్లేవారు. మీ దగ్గరెన్ని థియేటర్లున్నాయంటూ దూరప్రాంతాల వారు సందర్భం వచ్చినపుడు ప్రత్యేకంగా అడిగేవారు. అంతర్జాల వినియోగం పెరిగాక ఇంటిదగ్గర నుంచే మనకు కావాల్సిన షో చూసేందుకు టికెట్లు రిజర్వ్‌ చేసుకునే వెసులుబాటు ఏర్పడింది. ఇక ఇప్పుడు ఇవన్నీ ‘తెర’మరుగై పోతున్నాయి. కళ్లు చెదిరే సినిమా థియేటర్లు ‘మినీ’గా మారి ఇంట్లోకే వచ్చేస్తున్నాయి. మహా నగరాల్లోనే కాదు మన పట్టణాలు, గ్రామాలకు సైతం ఈ అనుభూతి చేరువవుతోంది.

తమ ఇంట్లో సినిమా చూస్తున్న నిర్మల్‌ వైద్యుడు ప్రమోద్‌చంద్రారెడ్డి

మన ఇంట్లో.. మన థియేటర్‌లో..

థియేటర్‌లో సినిమా చూడాలంటే ఇంటిల్లిపాది ఎక్కడికో వెళ్లాల్సిన పరిస్థితి లేదు. ఎవరింట్లో వారికి సొంత హాల్లో కోరుకున్నది భారీ తెర మీద కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ‘హోం థియేటర్ల’ సంస్కృతి పెరిగిపోతోంది. ఇప్పటివరకు నాలుగు జిల్లాల్లో 150కి పైగా ఇంటి సినిమా హాళ్లు ముస్తాబయ్యాయి. అత్యాధునిక సౌండ్‌ సిస్టం, నవీకరించిన తెర, మిరుమిట్లు గొలిపే లైట్లు, మల్టీప్లెక్స్‌లకు ఏమాత్రం తీసిపోని రీతిలో సీట్లతో సినిమా హాల్‌ నట్టింట్లోనే ఆనందం, ఆహ్లాదాన్ని పంచుతోంది.

కరోనా.. తీసుకొచ్చిన సినిమా హాళ్లు..

కొవిడ్‌ సమాజంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చింది. కొన్ని విషయాల్లోనైతే కరోనాకు ముందు కరోనా తర్వాత అన్న పరిస్థితి ఉంది. సినిమారంగాన్ని ఈ వైరస్‌ బాగా ప్రభావితం చేసింది. సినీప్రియులను కొన్నాళ్లపాటు థియేటర్లకు దూరం చేసేసింది. సినిమాహాళ్లనే ఇంటికి చేర్చింది. ఈ హోం థియేటర్ల సంస్కృతికి ప్రధాన కారణం కరోనానే అని చెప్పుకోవచ్చు. కుటుంబంతో కలిసి సినిమా చూడాలన్న ఆసక్తి తీర్చుకునేందుకు, కొవిడ్‌ కల్గించిన భయాన్ని అధిగమించేందుకు మినీ థియేటర్లు అన్ని ప్రాంతాలకు చేరుకున్నాయి.

మినీ థియేటర్‌లో నిర్మల్‌కు చెందిన గృహిణి స్వప్న

స్థాయికి అనుగుణంగా..

ఈ మధ్య కొత్త నివాసాలు కడుతున్నవారిలో చాలామంది ప్రత్యేకంగా హోం థియేటర్‌ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక గదినే చిన్నపాటి సినిమాహాలుగా తీర్చిదిద్దుతున్నారు. ప్రొజెక్టర్‌, స్క్రీన్‌, 5.1 (5.2.2) ఆడియో సిస్టం ఏర్పాటు చేస్తున్నారు. నిర్మిస్తున్న ఇల్లు, అందుబాటులో ఉండే స్థలానికి అనుగుణంగా మినీ థియేటర్‌ను సిద్ధం చేసుకుంటున్నారు. స్థలంకొరత ఉన్నవారు ఒకే గదిలో హోం థియేటర్‌, లైబ్రరీ, మెడిటేషన్‌, డైనింగ్‌హాల్‌.. ఇలా ఎన్నో అవసరాలను సర్దుబాటు చేసుకోవచ్చు.

ఇంటిల్లిపాదికీ ఆనందం..

ఉరుకుల పరుగుల జీవితంలో పనిఒత్తిడి సర్వసాధారణంగా మారింది. అందరూ కలిసి సరదాగా బయటకు వెళ్లొద్దామంటే చాలామందికి సమయం చిక్కట్లేదు. ఇలాంటి వారికి ఇంట్లోని మినీ థియేటర్‌ ఓ చక్కని అవకాశంగా వచ్చింది. పెద్ద తెర కావడంతో కళ్లకు పెద్దగా ఇబ్బంది లేకుండానే సినిమాలతో పాటు పిల్లలకు ఆన్‌లైన్‌ పాఠాలు, యూట్యూబ్‌ వీడియోలు, తమవారి పెళ్లిళ్లు- శుభకార్యాల వీడియోలు, నచ్చిన సీరియళ్లు.. ఇలా ఇంటిల్లిపాదీ కలిసి ఏదైనా చూసేయొచ్చు. బంధువులొచ్చినా ఇంట్లోనే కొత్త సినిమా వీక్షించొచ్చు.


అద్దెకు ఈ థియేటర్లు..

మినీ థియేటర్‌లో కాలనీవాసులు..

చిన్న పార్టీలు, సమావేశాలు, పుట్టినరోజు వేడుకల్లాంటివి కొత్త కోణంలో చేసుకునేందుకు హోం థియేటర్లను అద్దెకిస్తున్నారు. నిర్మల్‌లో రెండేళ్లుగా ఈ విధానం అందుబాటులో ఉంది. ఎక్కడికో దూరతీరాలకు వెళ్లి ఆర్థికంగా ఇబ్బంది పడే బదులు తక్కువ ఖర్చుతో బయటిలోకాన్ని మర్చిపోయేలా ఇక్కడే ఆనందించొచ్చని నిర్మల్‌కు చెందిన నంగె శ్రీనివాస్‌, రమణ, తిరుమలేశ్‌, ప్రవీణ్‌ తదితరులు తమ అనుభవాన్ని వెలిబుచ్చారు.


నిర్వహణభారం ఉండదు

వివేక్‌, హోం థియేటర్‌ నిపుణుడు, నిర్మల్‌

ఆసక్తి ఉన్నవారి స్థాయిని బట్టి ఇంట్లోనే థియేటర్‌ ఏర్పాటు చేసుకోవచ్చు. కనీసం రూ.3 లక్షల నుంచి రూ. కోటి వరకు ఎంతైనా ఖర్చు చేయొచ్చు. గది, మన అవసరాలు, వినియోగితమయ్యే కేబుల్స్‌, స్పీకర్లు, ఇతరత్రా పరికరాలను బట్టి ధరలు పెరుగుతుంటాయి. మొదట్లో పెట్టుబడి కాస్త ఎక్కువైనా నిర్వహణకు ఎలాంటి ఖర్చుండదు. ప్రస్తుతం ప్రతీ ఇంట్లో అంతర్జాలం వినియోగిస్తున్నందున ఓటీటీకి సంబంధించిన చిత్రాలు, సీరియళ్లు ఏవైనా ఇందులో చూడొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని