logo

అడ్డంకి తొలగింది.. అభివృద్ధే మిగిలింది

ఎక్కడికైతే మెరుగైన రవాణా సౌకర్యాలు ఉంటాయో ఆ ప్రాంతాలు త్వరితగతిన అభివృద్ధి చెందుతాయి. నేటికీ ఉమ్మడి జిల్లాలో ఇంకా కనీస రహదారి సౌకర్యాలు లేని గ్రామాలు అనేకం ఉన్నాయి.

Published : 23 Jan 2023 04:33 IST

ఖానాపూర్‌, న్యూస్‌టుడే

పుల్గంపాండ్రి అటవీ ప్రాంతం నుంచి సిరిచెల్మ వైపు వెళ్తున్న వాహనదారుడు

క్కడికైతే మెరుగైన రవాణా సౌకర్యాలు ఉంటాయో ఆ ప్రాంతాలు త్వరితగతిన అభివృద్ధి చెందుతాయి. నేటికీ ఉమ్మడి జిల్లాలో ఇంకా కనీస రహదారి సౌకర్యాలు లేని గ్రామాలు అనేకం ఉన్నాయి. గతంలో ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన పథకంలో రహదారుల నిర్మాణాలకు నిధులు కేటాయించినా.. చాలా మార్గాలు అటవీ అనుమతులు లేక ఆగిపోయాయి. ఈక్రమంలో గతేడాది కేంద్ర ప్రభుత్వం రిజర్వ్‌ అటవీ ప్రాంతంలో గతంలో ప్రతిపాదనలు చేసిన రహదారులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు తీసుకొచ్చిన ఫారెస్ట్‌ కన్జర్వేషన్‌ రూల్స్‌-2022 వెసులుబాటు కల్పిస్తోంది. ఫలితంగా దశాబ్దాలుగా నిర్మాణానికి నోచుకోని రహదారులకు మహర్దశ రానుంది. అధికారులు, ప్రజాప్రతినిధులు వీటిని గుర్తించి, ఇక నిధులు మంజూరు చేయిస్తే.. పనులు చేపట్టడమే తరువాయిగా మారింది.

రహదారి నిర్మాణానికి నోచుకోని అల్లంపల్లి రహదారి

అటవీ అనుమతులు లేక ఆగిన దారులివీ..

ఆదిలాబాద్‌ జిల్లా సిరికొండ మండలం నుంచి వాయిపేట్‌ వెళ్లేందుకు 14 కి.మీ. రహదారి దశాబ్దాలుగా ప్రతిపాదన దశలోనే ఉంది. వాయిపేట్‌, ధర్మసాగర్‌ల మధ్య 2 కి.మీ. రహదారి, ధర్మసాగర్‌ నుంచి లక్ష్మీపూర్‌-బి వరకు 4 కి.మీ., లక్ష్మీపూర్‌ నుంచి రిమ్మకు 3 కి.మీ. నిర్మాణానికి ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌యోజన పథకంలో.. గతంలో రూ.10 కోట్లు మంజూరయ్యాయి. అటవీ అనుమతులు లేకపోవడంతో పనులు ముందుకు సాగలేదు.

నిర్మల్‌ జిల్లా కడెం మండలంలోని ఉట్నూరు ప్రధాన రహదారి నుంచి 14 కి.మీ. దూరంలో ఉన్న అల్లంపల్లి గ్రామానికి పక్కా రహదారి నిర్మాణం నోచుకోలేదు. మంచిర్యాల ప్రధాన రహదారి నుంచి కడెం నది మీదుగా గంగాపూర్‌కు 15 కి.మీ. రహదారి నిర్మించేందుకు కొన్నేళ్ల కిందట రూ.8 కోట్లతో ప్రతిపాదనలు చేశారు. అనుమతులు రాకపోవడంతో పనులు ముందుకు సాగలేదు. పాండ్వాపూర్‌ నుంచి డ్యాంగూడ వరకు రహదారి నిర్మాణం ప్రతిపాదన దశలోనే నిలిచిపోయింది.

నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలంలోని సోమార్‌పేట్‌ గ్రామం(ఎర్వచింతల్‌) నుంచి దత్తోజిపేట్‌ వరకు రోడ్డు నిర్మించేందుకు అవకాశముంది.  

నిర్మల్‌ జిల్లా మామడ మండలంలోని తాండ్ర-వాస్తాపూర్‌, జన్నారం నుంచి కొలాంగూడ వరకు..

కుమురంభీం జిల్లా తిర్యాణి, గాదిగూడ, కెరిమెరిలలో దాదాపు రూ.5 కోట్లతో ప్రతిపాదించిన రహదారులు నిలిచిపోయాయి. ఉట్నూర్‌, సిర్పూర్‌, జైనూర్‌లలో రూ.6 కోట్లతో ప్రతిపాదించిన పనులు నిలిచిపోయాయి.

ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌లోని గోండుగూడ, నర్సాపూర్‌ గ్రామాలకు 3కి.మీ. రహదారికి రూ.2 కోట్ల నిధులు వెచ్చించినా.. అటవీ అడ్డంకులతో నిలిచిపోయాయి.

నిర్మల్‌ జిల్లా పెంబి మండలం పుల్గంపాండ్రి నుంచి సిరిచెల్మ వరకు ప్రస్తుతం కాలిబాట ఉంది. సుమారు 10 కి.మీ. ఉన్న ఈ దారిని నిర్మించేందుకు 2008లో నిధులు మంజూరు చేశారు. అటవీ అనుమతులు లేకపోవడంతో.. పుల్గంపాండ్రి వరకు బీటీ నిర్మించి వదిలేశారు. తాజా ఉత్తర్వులతో అడ్డంకులు తొలగినట్లయింది.


పాతవాటికి మాత్రమే సడలింపులు

కోటేశ్వర్‌రావు, ఎఫ్‌డీవో, ఖానాపూర్‌

తాజా నిబంధనల ప్రకారం గతంలో ప్రతిపాదించి, పనులు చేపట్టేందుకు అనుమతులు లేక నిలిచిపోయిన పలు రహదారుల నిర్మాణానికి కొంత వెసులుబాటు కల్పించింది. కొత్తగా ప్రతిపాదించే వాటికి ఇది వర్తించదు. ఖానాపూర్‌ అటవీ డివిజన్‌ పరిధిలో 8 గ్రామాల రహదారులకు గతంలో ప్రతిపాదనలు పంపించారు. వీటి నిర్మాణానికి అవకాశముంది.

Read latest Adilabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని