logo

అందాల జలపాతం.. అసౌకర్యాల రాజ్యం

రాష్ట్రంలోనే ఎత్తయిన కుంటాల జలపాతం వద్ద పర్యాటకులకు సౌకర్యాలు లేక అవస్థలు తప్పడం లేదు. ఇక్కడికి తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర నుంచి సెలవు రోజులు, శని, ఆదివారాల్లో జలపాత అందాలను వీక్షించేందుకు భారీగా పర్యాటకులు తరలివస్తుంటారు.

Published : 23 Jan 2023 04:33 IST

న్యూస్‌టుడే, నేరడిగొండ

కుంటాల జలపాతం

రాష్ట్రంలోనే ఎత్తయిన కుంటాల జలపాతం వద్ద పర్యాటకులకు సౌకర్యాలు లేక అవస్థలు తప్పడం లేదు. ఇక్కడికి తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర నుంచి సెలవు రోజులు, శని, ఆదివారాల్లో జలపాత అందాలను వీక్షించేందుకు భారీగా పర్యాటకులు తరలివస్తుంటారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు జలపాత అందాల గురించి గొప్పగా చెప్పడం తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదు.  

పర్యాటకుల ఇబ్బందులను గుర్తించిన సంబంధిత శాఖ అధికారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదికలు పంపారు. కేంద్ర గిరిజన సంక్షేమ నిధుల ద్వారా 2020లో హోటల్‌ నిర్మాణం కోసం రూ.3.81 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో పర్యాటకులు సేద తీరేందుకు విశ్రాంత గదులు, భోజన గదులు, గిరిజన నివాసాల రూపంలో అందమైన కాటేజ్‌ నిర్మాణం, పచ్చదనం ఉట్టిపడేలా పార్కు, విశాలమైన రోడ్డు నిర్మిస్తారు. వాహనాలు నిలిపేందుకు స్థలం కేటాయించాలి. వీటితో పాటు మరిన్ని సౌకర్యాలు ప్రణాళికలో ఉన్నాయి. కానీ ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదు.


నిర్మాణం పూర్తి చేస్తే..

జలపాతం సమీపంలో అనువైన స్థలం కేటాయిస్తే హోటల్‌ నిర్మాణానికి సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. కుంటాల గ్రామస్థులంతా సమావేశమయ్యారు. జలపాత సమీపంలో రూ.3 లక్షలతో, 3 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. భూమికి సంబంధించిన పత్రాలను అధికారులకు అందజేశారు. హరిత హోటల్‌ నిర్మాణం పూర్తయితే గ్రామంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందని గ్రామస్థులు పేర్కొంటున్నారు.


మహిళలకు అవస్థలు..

సుదూర ప్రాంతాల నుంచి జలపాతం అందాలను వీక్షించేందుకు వచ్చిన మహిళలు మూత్రశాలలు లేక ఇబ్బంది పడుతున్నారు. అక్కడి సిబ్బంది, సమీపంలో మరుగుదొడ్లు నిర్మించేందుకు ఎంపిక చేసి పునాది నిర్మించిన స్థలంలో పాలిథీన్‌ కవర్లతో తాత్కాలిక మూత్రశాలలు ఏర్పాటు చేశారు. జలపాతం వద్ద పర్యాటకుల సందడి ఉండటంతో వారు వాటిని సైతం వినియోగించుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు.


అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తాం

రవికుమార్‌, జిల్లా పర్యాటక అధికారి

ప్రైవేటు కన్సల్టెంట్ సంస్థ నిర్మాణ పనుల ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. డిజైనింగ్‌ పూర్తయిన తరువాత టెండరు ప్రక్రియ పూర్తి చేస్తాం. పనులు ప్రారంభించమని ప్రభుత్వం నుంచి నివేదికలు రాగానే హోటల్‌, ఇతర అభివృద్ధి పనులను ప్రారంభిస్తాం.

Read latest Adilabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు