logo

ఐదేళ్లుగా.. అదేకథ..

పట్టణంలోని ద్వారకానగర్‌ కాలనీలో పైప్‌లైన్‌ లీకేజీ కారణంగా ఇలా గుంత తవ్వి వదిలేశారు. నెలన్నర రోజులుగా గుంతను పూడ్చకపోవడంతో ప్రమాదకరంగా మారింది. ప్రజలు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Updated : 24 Jan 2023 05:44 IST

బల్దియాలో ‘భగీరథ’ పనుల దుస్థితి..
ఆదిలాబాద్‌ పట్టణం, న్యూస్‌టుడే

పట్టణంలోని ద్వారకానగర్‌ కాలనీలో పైప్‌లైన్‌ లీకేజీ కారణంగా ఇలా గుంత తవ్వి వదిలేశారు. నెలన్నర రోజులుగా గుంతను పూడ్చకపోవడంతో ప్రమాదకరంగా మారింది. ప్రజలు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


పట్టణంలోని విద్యానగర్‌ కాలనీలో వేసిన పైప్‌లైన్‌

జిల్లా కేంద్రంలో మిషన్‌ భగీరథ పనులతో ప్రజలు అష్టకష్టాలు పడుతూనే ఉన్నారు. పట్టణంలో గ్రామాలు విలీనం కాకముందు నుంచి మొదలైన ఈ పనుల్లో నాణ్యత లోపించడంతోపాటు నత్తతో పోటీపడడం విమర్శలకు తావిస్తోంది. చాలాచోట్ల ఇప్పటికీ పాత పైప్‌లతోనే నీరు అందిస్తుండగా.. అడపాదడపా తమకు ఇష్టమున్న చోట అధికారులు కొత్తగా పైప్‌లైన్‌ తవ్వుతూ పనులు చేపడుతున్నారు. అయిదేళ్లయినా ఈ పనులు పూర్తికాకపోవడం, తరచూ లీకేజీలతో ప్రజలు నరకయాతన పడుతున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో భగీరథ పనుల బాధ్యత గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులకు అప్పగించగా.. పట్టణంలో మాత్రం ప్రజారోగ్య విభాగం (పబ్లిక్‌ హెల్త్‌) పర్యవేక్షిస్తోంది. గతంలో పట్టణ జనాభా 1.17 లక్షల వరకు ఉండగా ప్రతి ఒక్కరికి నిర్మల్‌లోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి శుద్ధిచేసిన జలాన్ని అందించేందుకు పనులు మొదలెట్టారు. ఐదేళ్ల కిందట ఎల్‌అండ్‌టీ సంస్థ పనులు దక్కించుకుంది. అప్పటినుంచి పనులు సాగుతూనే వచ్చాయి.

శాఖల సమన్వయం లేక..

పట్టణంలో పలుచోట్ల ఆర్‌అండ్‌బీ శాఖకు చెందిన రహదారులు ఉండటంతో వారితో సమన్వయం లేకుండానే పనులు చేపట్టారు. ఇలా తెలంగాణ కూడలి నుంచి వినాయక్‌చౌక్‌ వరకు వేసిన పైప్‌లైన్‌ను ఇటీవల విస్తరణలో మళ్లీ తీసి పక్కకు జరపాల్సి వచ్చింది. దీనికోసం ఆర్‌అండ్‌బీకి రూ.10 లక్షల అదనపు ఖర్చు రాగా నెలపాటు వివిధ కాలనీలకు నీటి సరఫరా కాక ఇబ్బందులు పడ్డారు.

లీకేజీలపై ఫిర్యాదులు..

దాదాపు ప్రతి కాలనీలో లీకేజీలు ఏర్పడ్డాయి. దీంతో నీరు వృథా అవుతుండటంతోపాటు చాలాచోట్ల నీరు కలుషితమవుతోంది. ద్వారకానగర్‌లో నీటి కలుషితంతో సదరు వార్డు కౌన్సిలర్‌ పుర అధికారులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. దాదాపు రెండు వందలకుపైగా లీకేజీలపై ఫిర్యాదు రావడంతో.. అధికారులు తమకు సంబంధంలేదని పనులు పర్యవేక్షిస్తున్న ప్రజారోగ్య అధికారులకు చెప్పడం, వారు మరమ్మతులు చేయడంలో జాప్యం చేయడం పరిపాటిగా మారింది.

తక్కువ లోతులో తవ్వకాలు

వాస్తవానికి పెద్ద పైప్‌లైన్‌ ఉంటే మీటరున్నర, అంతర్గత పైప్‌లైన్‌ వేస్తే మీటరు లోతు వరకు గుంత తవ్వాలి. ఇక్కడ మాత్రం అర మీటర్‌ వరకు తవ్వేసి చేతులు దులుపేసుకున్నారు. పట్టణంలోని దాదాపు 20కిపైగా కాలనీల్లో అంతర్గత పైప్‌లైన్లు అసలు వేయనలేదు. పాత పైప్‌లైన్లకే కనెక్షన్‌ ఇచ్చి నీరు అందిస్తుండటం గమనార్హం.

కొత్త గుత్తేదారు వచ్చినా..

తొలుత ఎల్‌అండ్‌టీ సంస్థ పనులు దక్కించుకుంది. దాదాపు 90శాతం వరకు పనులు చేపట్టిన ఆ సంస్థ ఆ తరువాత నిర్లక్ష్యం చేయడంతో.. పనులు ముందుకు సాగలేదు. అడపాదడపా పనులు చేపట్టడం విమర్శలకు తావిచ్చింది. దీంతో సదరు సంస్థను తొలగించి కొత్త గుత్తేదారుకు ఎనిమిది నెలల కిందట బాధ్యతలు అప్పగించారు. అయితే ఆ గుత్తేదారు వచ్చినా.. అదే పరిస్థితి నెలకొనడం ప్రజలకు శాపంగా మారింది.

అధికారి ఏమన్నారంటే..

ఈ విషయమై ప్రజారోగ్య విభాగం ఏఈ హరి భువన్‌ ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ.. త్వరితగతిన పనులు పూర్తిచేస్తామన్నారు. నిర్మల్‌ సబ్‌డివిజన్‌ పరిధిలోని నిర్మల్‌, ఆదిలాబాద్‌, భైంసా, ఖానాపూర్‌ బల్దియాల్లోని పనుల పర్యవేక్షణకు ముగ్గురు ఏఈలు ఉండాల్సి ఉండగా ఒక్కరే ఉండడంతోనే కొంత వరకు జాప్యమవుతోందని వివరించారు.

Read latest Adilabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని