logo

పెళ్లి చేసుకుంటానంటూ రూ. లక్షలు దోచుకున్నాడు

భర్త మరణించిన ఓ ఒంటరి మహిళను పెళ్లిచేసుకుంటానని నమ్మించి రూ.లక్షలు కొల్లగొట్టిన ఓ సైబర్‌ నేరగాడిని రాచకొండ పోలీసులు అరెస్టుచేసి రిమాండుకు తరలించారు.

Published : 24 Jan 2023 05:38 IST

నిందితుడు కార్తిక్‌

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: భర్త మరణించిన ఓ ఒంటరి మహిళను పెళ్లిచేసుకుంటానని నమ్మించి రూ.లక్షలు కొల్లగొట్టిన ఓ సైబర్‌ నేరగాడిని రాచకొండ పోలీసులు అరెస్టుచేసి రిమాండుకు తరలించారు. సైబర్‌ క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాము కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా నస్పూర్‌ మండల కేంద్రానికి చెందిన కర్ల కార్తిక్‌(34) ప్రైవేటు ఉద్యోగి. ఉద్యోగాలిప్పిస్తానంటూ మోసం చేసిన ఘటనల్లో సిద్ధిపేట, ఎస్‌ఆర్‌నగర్‌, ఎల్బీనగర్‌ ఠాణాల్లో అతనిపై కేసులున్నాయి. భార్యాపిల్లలను సొంతూళ్లోనే ఉంచి.. తాను మంచిర్యాలలో ఉంటూ సిమ్‌కార్డులను మార్చుతూ తప్పించుకు తిరుగుతూ.. నగరానికి చెందిన ఓ మహిళను పెళ్లి పేరిట మోసం చేశాడు. భర్త మరణించడంతో పలు మ్యాట్రిమోనీ సైట్లలో ఆమె తన వివరాలను ఉంచింది. గతేడాది జులైలో కార్తిక్‌ ఆమెను వాట్సప్‌ ద్వారా పరిచయం చేసుకున్నాడు. ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌లో పనిచేస్తున్నట్లు ఫోజిచ్చాడు. తన భార్యా మరణించిందనీ.. ఆమెను రెండో పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. హఠాత్తుగా ఓ రోజు తన అక్క కొడుక్కి ఆరోగ్యం బాగాలేకపోతే ఆస్పత్రిలో చేర్చేందుకు డబ్బు కావాలని అడిగాడు. ఆమె రూ.50వేలు ఆన్‌లైన్‌లో పంపింది. మెరుగైన చికిత్స చేయించాలని చెబితే రెండు దఫాల్లో రూ.7లక్షలు పంపించింది. ఇలా మొత్తంగా రూ.9.32 లక్షలు ముట్టజెప్పింది. ఆపై డబ్బు అడిగితే వాయిదా వేయసాగాడు. నిలదీయడంతో తనకు ఎమ్మెల్యేలు, ఎంపీలు తెలుసని దబాయించాడు. దీంతో బాధితురాలు రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. సాంకేతిక ఆధారాలు సేకరించి సదరు నిందితున్ని సోమవారం అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని