logo

ఏజెన్సీలో ఇంకా అందని రేషన్‌

జిల్లాలో సంకేతాల సమస్యలతో ఆన్‌లైన్‌లో కాకుండా పాతవిధానంలో కొనసాగుతున్న చౌకధరల దుకాణాల్లో ఇంకా బియ్యం పంపిణీ మొదలు కాలేదు.

Published : 25 Jan 2023 06:20 IST

కొన్ని దుకాణాల్లో  మొదలుకాని పంపిణీ
ఆసిఫాబాద్‌, తిర్యాణి, న్యూస్‌టుడే

జిల్లాలో సంకేతాల సమస్యలతో ఆన్‌లైన్‌లో కాకుండా పాతవిధానంలో కొనసాగుతున్న చౌకధరల దుకాణాల్లో ఇంకా బియ్యం పంపిణీ మొదలు కాలేదు. నెలాఖరు సమీపిస్తున్నా బియ్యం అందక లబ్ధిదారులు నిత్యం దుకాణాలకు వచ్చిపోతున్నారు. ఈ-పోస్‌ ఆన్‌లైన్‌ విధానంలో కొనసాగుతున్న దుకాణాల్లో దాదాపు ఇప్పటికే బియ్యం పంపిణీ పూర్తయ్యింది. మరి తమకు ఎప్పుడిస్తారంటూ ఎదురుచూస్తున్నారు.

ప్రతినెలా ఒకటో తేదీ నుంచి 15 వరకు రేషన్‌ బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది. జిల్లాలో రెండు మూడు నెలలుగా పంపిణీ సక్రమంగా జరగడం లేదు. కేంద్రం ఉచిత బియ్యాన్ని మరో ఏడాదికి పెంచింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తాము అందించే కోటాపై తర్జనభర్జనల అనంతరం వారం క్రితం ఒక్కో యూనిట్‌కు అయిదు కేజీల చొప్పున పంపిణీకి ఆదేశించింది. దీంతో ఆలస్యంగా పంపిణీ మొదలైంది. ఈ-పోస్‌ విధానంలో కొనసాగుతున్న 269 దుకాణాల్లో దాదాపుగా ఇప్పటికే బియ్యం పంపిణీ పూర్తి చేశారు. కానీ మాన్యువల్‌గా పాతవిధానంలో పంపిణీ చేస్తున్న 31 దుకాణాలకు ఇంకా పూర్తి స్థాయిలో బియ్యం సరఫరా కాలేదు. దీంతో ప్రధానంగా ఏజెన్సీ మండలాల్లోని లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు.

బియ్యం సరఫరా కాక తెరచుకోని గుండాల రేషన్‌ దుకాణం

సంకేతాల సమస్యతో ఇబ్బంది..

జిల్లాలో తొమ్మిది మండలాల్లోని కొన్ని మారుమూల గ్రామాల్లో ఇప్పటికీ సంకేతాలు రావడంలేదు. దీంతో వీటి పరిధిలోని 31 రేషన్‌ దుకాణాల్లో డీలర్లు మాన్యువల్‌గా లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఈ దుకాణాల పరిధిలో 8594 రేషన్‌ కార్డులు ఉన్నాయి. వాటిలో 29,912 మంది లబ్ధిదారులున్నారు. వీరి కోసం నెల కోటా 1698.25 క్వింటాళ్ల బియ్యం అవసరం అవుతాయి. ఈ దుకాణాలకు బియ్యం కేటాయింపునకు సంబంధించి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ నుంచి ఆర్‌వోలు సకాలంలో జిల్లా కార్యాలయానికి రాకపోవడంతో బియ్యం సరఫరా కాలేదు. రెండు రోజులుగా సరఫరా మొదలు పెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం ఇంకా దుకాణాలు తెరవలేదు. దీంతో లబ్ధిదారులు నిత్యం దుకాణాల చుట్టూ తిరుగుతూ నిరాశపడుతున్నారు. ఈ నెల 30 వరకే పంపిణీకి గడువు ఉంది.


డీలర్లకు సూచనలు చేశాం..

- తారామణి, జిల్లా పౌరసరఫరాల అధికారిణి

జిల్లాలో 31 రేషన్‌ దుకాణాల్లో మాన్యువల్‌గా బియ్యం పంపిణీ చేస్తున్నాం. ఈ నెల ఆ రేషన్‌ దుకాణాలకు బియ్యం సరఫరాలో ఆర్‌వోలు రావడంలో కాస్త ఆలస్యం జరిగింది. రెండు రోజులుగా సరఫరా మొదలైంది. డీలర్లు వెంటనే బియ్యం పంపిణీ చేయాలని సూచించాం.


బియ్యం ఇంకా రాలేదు

- సిడాం రాజేశ్వర్‌, రోంపల్లి

మాది తిర్యాణి మండలం రోంపల్లి. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. ఈ నెల రేషన్‌ బియ్యం ఇప్పటి వరకు మాకు అందలేదు. నిత్యం డీఆర్‌ డిపో వద్దకు వెళ్లి తిరిగి వస్తున్నా. ఎప్పుడు వస్తాయో ఎవరూ చెప్పడంలేదు. ప్రతినెలా మాకు ఇదే పరిస్థితి. ఎప్పుడు బియ్యం వస్తున్నాయో తెలియడంలేదు. బయట బియ్యం ధరలు ఎక్కువగా ఉన్నాయి. అధికారులు స్పందించి త్వరగా ఇప్పించేలా చూడాలి.

Read latest Adilabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని