logo

భారత్‌ యూరియా వచ్చేసింది

పంట సాగులో అవసరమైన రసాయనిక ఎరువుల కొనుగోలుకు కేంద్రప్రభుత్వం పెద్ద ఎత్తున రాయితీలు ఇస్తోంది. దిగుబడి ఎక్కువ వస్తుందనే ఆశతో రైతులు అవసరానికి మించి ఎరువులు వినియోగిస్తున్నారు.

Published : 27 Jan 2023 05:45 IST

దండేపల్లిలోని ఓ ఎరువుల దుకాణంలో అమ్మకానికి ఉన్న యూరియా ఎరువులు

దండేపల్లి, న్యూస్‌టుడే: పంట సాగులో అవసరమైన రసాయనిక ఎరువుల కొనుగోలుకు కేంద్రప్రభుత్వం పెద్ద ఎత్తున రాయితీలు ఇస్తోంది. దిగుబడి ఎక్కువ వస్తుందనే ఆశతో రైతులు అవసరానికి మించి ఎరువులు వినియోగిస్తున్నారు. ప్రభుత్వం రాయితీలు ఇస్తోంటే.. కంపెనీలు తమ పేరుతో ఎరువులు విక్రయిస్తూ లాభాలు పొందుతున్నాయి. వీటన్నింటికి అడ్డుకట్ట వేసేందుకు అన్ని ఎరువులు భారత్‌ పేరుతో ఉండాలనే నిబంధనతో గతేడాది అక్టోబరు 2న ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ఈవిధానాన్ని ప్రారంభించారు. ‘భారతీయ జన్‌ ఊర్వరక్‌ పరియోజన’ పేరుతో యూరియాతో ఇతర ఎరువులు తయారు చేస్తున్నారు. అయితే ఈ ప్రతిపాదనకు పూర్వమే  పలు కంపెనీలు తమ పేరు మీద సంచులు ముద్రించుకోవడం... ఎరువులు సైతం నిల్వ ఉండటంతో ఇవి అమ్ముడయ్యే వరకు ఆయా కంపెనీల పేరుతోనే వివిధ ఎరువులను సరఫరా చేశారు. వానాకాలం సీజన్‌ పూర్తవడంతో అపుడు కంపెనీ పేరు మీద ఉన్న ఎరువుల అమ్మకాలు పూర్తి కావడంతో ప్రస్తుత యాసంగికి అవసరమైన ఎరువులు ‘భారత్‌ యూరియా’ పేరుతో కంపెనీలు ముద్రించి సరఫరా చేస్తున్నారు. సంచి పైన భారత్‌ యూరియా, పథకానికి సంబందించిన పేరు పెద్ద అక్షరాల్లో ఉండగా.. బస్తా కింది భాగంలో ఎరువులు తయారు చేసిన కంపెనీ పేరు చిన్నగా ఉంటుంది. ఇప్పటికే యూరియా మార్కెట్లోకి రాగా...త్వరలోనే భారత్‌ డీఏపీ, కాంప్లెక్స్‌, పొటాష్‌ తదితర ఎరువులు రానున్నాయి.

రాయితీపై అవగాహన కలిగించేలా..

కేంద్రం ఎరువులపై పెద్ద ఎత్తున రాయితీ ఇస్తుంటే కొన్ని కంపెనీలు తమ గురించి గొప్పగా చెప్పుకుంటూ అధిక విక్రయాలు జరిగేలా చేస్తూ రైతులపై అధిక భారం మోపుతుండటంతో దీనికి అడ్డుకట్ట వేసేందుకు దేశమంతా ఒకే పేరుతో ఎరువులను అమ్మాలని నిర్ణయం తీసుకుంది. రూ. లక్షల కోట్ల మేర ప్రభుత్వం రాయితీ ఇస్తుంటే..కంపెనీలు తమ పేర అమ్మకాలు చేపట్టం సమంజసం కాదని ఈవిధానం తీసుకొచ్చింది. అంతేకాకుండా సంచులపై ప్రభుత్వం ఇచ్చే రాయితీలు ముద్రించడం వల్ల వీటిని అవసరం ఉన్నంత వరకే వినియోగించేలా అవగాహన కలుగుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని