logo

అమ్ముదామా.. ఆగుదామా!

ఈవానాకాలం సీజన్‌ జిల్లాలో ఓ వైపు భారీ వర్షాలు.. మరోవైపు తెగుళ్ల బెడదతో సతమతమైన పత్తి రైతులకు వచ్చిన అరకొర దిగుబడులకు గిట్టుబాటు ధర లేకపోవడంతో.. పెరుగుతుందనే ఆశతో పత్తిని ఇళ్లల్లోనే నిల్వ చేసుకుంటున్నారు.

Published : 27 Jan 2023 05:45 IST

పత్తి రైతుల అయోమయం.. ఇళ్లల్లోనే నిల్వ..
లింగాపూర్‌, జైనూర్‌, న్యూస్‌టుడే

లింగాపూర్‌లో ఇంట్లో నిల్వ చేసిన పత్తి

వానాకాలం సీజన్‌ జిల్లాలో ఓ వైపు భారీ వర్షాలు.. మరోవైపు తెగుళ్ల బెడదతో సతమతమైన పత్తి రైతులకు వచ్చిన అరకొర దిగుబడులకు గిట్టుబాటు ధర లేకపోవడంతో.. పెరుగుతుందనే ఆశతో పత్తిని ఇళ్లల్లోనే నిల్వ చేసుకుంటున్నారు. అయితే గత రెండు వారాలుగా మార్కెట్‌లో పత్తి ధర రూ.8 వేల వద్ద స్థిరంగా కొనసాగుతుండటంతో.. అయోమయ స్థితిలో ఉన్నారు.

దిగుబడులూ.. ధరా అంతమాత్రమే!

జిల్లావ్యాప్తంగా రైతులు పత్తిని ఎక్కువగా సాగు చేస్తుంటారు. ఈ ఏడాది దాదాపు 3.55 లక్షల ఎకరాల్లో ఈ పంటను వేశారు. అయితే ఈ వానాకాలం సీజన్‌ ప్రారంభంలో విత్తనాలు వేసినప్పటినుంచి కురిసిన భారీ వర్షాలతో చేన్లన్ని దెబ్బతిన్నాయి. పూత, కాయ దశలో రాలిపోయాయి. ప్రతికూల వాతావరణంతో పంటపై తెగుళ్ల దాడి ఎక్కువైంది. నివారించే ప్రయత్నంలో రైతులకు పెట్టుబడి ఖర్చులు పెరిగాయి. దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న రైతులు పండించిన కాస్త పత్తి పంటకు మంచి గిట్టుబాటు ధరలు ఆదుకుంటుందనుకుంటుదని ఆశించారు. అయితే భారత పత్తి సంస్థ (సీసీఐ) ఇప్పటి వరకు రూ.6380 వరకు మించి ధరలు లేకపోవడంతో వారంతా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రైవేటులోనూ అంతంత మాత్రంగానే ఉంది. దిగుబడి సైతం అంతంత మాత్రమే రావడంతోపాటు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో పెట్టుబడులు రాని పరిస్థితి ఉందని సాగుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో రైతు ఇంట్లో సుమారు 15 క్వింటాళ్ల నుంచి 40 క్వింటాళ్లకు పైగా నిల్వ ఉన్నట్లు సమాచారం.


ధరలు పెరుగుతాయనే ఆశతో..

ఆత్రం పరమేశ్వర్‌, రైతు, జామ్ని

ఎనిమిదెకరాలు రూ.15 వేలతో కౌలుకు తీసుకుని ఆరు ఎకరాల్లో పత్తి పంట సాగు చేశాను. ఈ సీజన్‌లో వర్షాలకు పంట నాశనమైంది. మూడు క్వింటాళ్లకు మించి దిగుబడి రావడం లేదు. ఆరెకరాల్లోని పత్తిని ఏరితే 15 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. ప్రస్తుత ధరలకు పత్తి అమ్ముకుంటే నష్టపోయే పరిస్థితి ఉంది. పత్తి ధరలు పెరుగుతాయనే ఆశతో 15 క్వింటాళ్ల ఇంట్లోనే నిల్వ చేసుకున్నా.


పెట్టుబడులు కూడా రావు

జాదవ్‌ కైలాష్‌, రైతు, లింగాపూర్‌

నాకున్న మూడెకరాలతోపాటు మరో పది ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాను. కౌలు చెల్లింపులు, పెట్టుబడులు కలిపి రూ.2.80 లక్షలు ఖర్చయింది. 30 క్వింటాళ్లు పత్తి దిగుబడి వచ్చింది. సీసీఐ మాత్రం రూ.7 వేలు మించి ధర పెట్టడం లేదు. బయట క్వింటాలుకు రూ.8 వేలు పలుకుతోంది. ఆ ధరలు చూస్తే పెట్టుబడులు రాని పరిస్థితి ఉంది. పత్తికి ఇంకా ధర పెరుగుతుందనే ఆశతో ఇళ్లల్లో పత్తి నిల్వ చేశాను.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని