logo

రూ. 2000 కోట్లు అవసరం

ఉమ్మడి జిల్లాలో కొత్తగా ప్రకటించిన ప్రాజెక్టులతోపాటు నిర్మాణంలో ఉన్న, అసంపూర్తిగా ఉన్న వాటిని పూర్తి చేసి సాగు నీటిని అందించేందుకు వీలుగా అవసరమయ్యే నిధులను జలవనరుల శాఖ అంచనా వేసింది.

Published : 01 Feb 2023 04:11 IST

సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుపై ఆశలు..
ఆదిలాబాద్‌ వ్యవసాయం, న్యూస్‌టుడే

మ్మడి జిల్లాలో కొత్తగా ప్రకటించిన ప్రాజెక్టులతోపాటు నిర్మాణంలో ఉన్న, అసంపూర్తిగా ఉన్న వాటిని పూర్తి చేసి సాగు నీటిని అందించేందుకు వీలుగా అవసరమయ్యే నిధులను జలవనరుల శాఖ అంచనా వేసింది. ప్రభుత్వం ప్రకటించనున్న బడ్జెట్‌లో నిధుల అవసరంపై ప్రతిపాదనలు పంపించింది. జిల్లాలో 15 ప్రాజెక్టులు ఉండగా మరికొన్ని ప్రతిపాదనలో ఉన్నాయి. గతేడాది బడ్జెట్‌లో రూ.473 కోట్లు మంజూరు చేయగా.. వాటిలో కొన్ని పూర్తి కాగా, మరికొన్ని అసంపూర్తిగానే ఉన్నాయి. అయితే నిర్మాణ పనుల్లో జాప్యం కారణంగా అంచనా వ్యయం పెరుగుతోంది. ఈ బడ్జెట్‌లోనైనా.. కొత్త ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తారని రైతులు ఆశతో ఉన్నారు.  

ప్రాజెక్టులకు బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తున్నా.. సకాలంలో పనులు చేయకపోవడం, అవసరం మేరకు విడుదల కాకపోవడంతో అసంపూర్తిగానే ఉంటున్నాయి. రెండేళ్లుగా కుప్టి, చెన్నూర్‌ ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభించేందుకు ప్రతిపాదనలు పంపిస్తున్నా.. నిధులు కేటాయించలేదు. ఈ ఏడాది అధిక వర్షాలతో కడెం, సదర్మాట్‌ ప్రాజెక్టులు చాలా చోట్ల దెబ్బతిన్నాయి. వాటి మరమ్మతులకు నిధులు అవసరం. ఈ ఏడాది ఎస్సారెస్పీ పరిధిలోని సరస్వతి కాలువ, సదర్మాట్‌, తదితర పనుల పూర్తికి రూ.476 కోట్లు అవసరం.

ప్రతిపాదనలో కుప్టి ప్రాజెక్టు

ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల్లో నిర్మాణంలో ఉన్న లోయర్‌ పెన్‌గంగ ప్రాజెక్టును (చనాఖా-కొరాట) పూర్తి చేయాలంటే రూ.289.62 కోట్లు అవసరం. పనుల జాప్యంతో అంచనా వ్యయం పెరిగింది. ఇప్పటికే రూ.వంద కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. కాలువల నిర్మాణం, వాటికి సంబంధించి 1200 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. జైనథ్‌, బేల మండలాల్లో డి-14 నుంచి డి-19 వరకు నిర్మాణాలు జరగాల్సి ఉంది. అరకొర కేటాయింపులతో మరో ఏడాది వరకు పనులు కొనసాగేలా ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సాత్నాల, మత్తడివాగు ప్రాజెక్టుల పరిధిలో కొన్ని కాలువలు, ఇతర మరమ్మతులకు రూ.12 కోట్లకు పైగా అవసరమని అంచనా వేశారు.

ఆసిఫాబాద్‌ మండలం అడ సమీపంలో కుమురంభీం ప్రాజెక్టుకు గతేడాది రూ.26 కోట్లు కేటాయించారు. ప్రాజెక్టు పరిధిలో 46 డిస్ట్రిబ్యూటర్లు నిర్మించాల్సి ఉండగా.. 23 పూర్తి చేశారు. భూసేకరణ అడ్డంకిగా ఉంది. ఇప్పటి వరకు నిధులు విడుదల కాలేదు. కాగజ్‌నగర్‌ మండలంలోని పెద్దవాగుపై నిర్మించిన జగన్నాథ్‌పూర్‌ ప్రాజెక్టుకు గతేడాది బడ్జెట్‌లో రూ.6 కోట్లు కేటాయించారు. పనులు చేయకపోవడంతో నిధులు విడుదల చేయలేదు. మరో 101 ఎకరాలు భూసేకరణ చేయాలి. డి-15తోపాటు పిల్ల కాలువలు, వంతెనలు  పూర్తి చేయాల్సి ఉంది. ఈ ఏడాది రూ.12 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపించారు.

మంచిర్యాల జిల్లా పరిధిలో ప్రాణహిత, చెన్నూర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు అవసరం. నీల్వాయి, ర్యాలీవాగు, గొల్లవాగు తదితర ప్రాజెక్టుల్లో చిన్నచిన్న పనులు, కాలువలకు లైనింగ్‌ చేయాల్సి ఉంది. డ్రిప్‌ తదితర సౌకర్యం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన పథకం కింద ఆయకట్టు అభివృద్ధికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

నిర్మల్‌ జిల్లాలోని కడెం, స్వర్ణ, గడ్డెన్న వాగు తదితర ప్రాజెక్టుల్లో కాలువల మరమ్మతులు చేయాల్సి ఉంది. కడెం ప్రాజెక్టు కింద  కాలువలు శిథిలం కావడంతో సరిగా నీరందడం లేదు. వాటి మరమ్మతులతోపాటు ప్రధాన డ్యాం పనులకు నిధుల అవసరంపై ప్రతిపాదనలు పంపించారు.

నిర్మాణంలో ఉన్న చనాఖా కోరాట..


కొత్త ప్రాజెక్టులపై ఆశలు

మ్మడి జిల్లాలో కుప్టి, చెన్నూర్‌ ఎత్తిపోతల పథకాలు మంజూరు కావడంతో నిధులు కేటాయిస్తారని రైతులు ఆశిస్తున్నారు. కుప్టి సమీపంలో ప్రాజెక్టు నిర్మిస్తే సాగు, తాగునీటితో పాటు విద్యుత్తు అవసరాలను తీర్చుకోవచ్చు. ఈ ప్రాజెక్టును నిర్మించి, ఎత్తిపోతల ద్వారా ఇచ్చోడ, బోథ్‌, నేరడిగొండ మండలాల్లో 68వేల ఎకరాలకు సాగు నీరందించే వీలుంది. కడెం జలాశయానికి ఎప్పుడు అవసరం పడితే అప్పుడు నీరు సరఫరా చేయడానికి వీలుందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణానికి రూ.1,020 కోట్లు, భూ సేకరణకు రూ.302.90 కోట్లు అవసరం. సదర్మాట్‌ ప్రాజెక్టు పూర్తిగా దెబ్బతినడంతో నిర్మాణం పనులకు రూ.231.25 కోట్లు అవసరమని ప్రతిపాదించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని