logo

అక్రమాల జోరు.. పేర్లు తారుమారు

జిల్లా ఉన్నతాధికారుల ప్రేక్షక పాత్ర కిందిస్థాయి అధికార, సిబ్బందికి కలిసొస్తోంది. పట్టా భూములతోపాటు ప్రభుత్వ, అసైన్డ్‌, లావుణి భూముల క్రయవిక్రయాల్లో కొంతమంది అధికారులు కాసులకు కక్కుర్తిపడి దళారులతో చేతులు కలపడం అర్హులైన లబ్ధిదారులకు ఇబ్బందులను తెచ్చిపెడుతోంది.

Published : 01 Feb 2023 04:11 IST

భూముల రిజిస్ట్రేషన్లలో రెవెన్యూ అధికారుల ఇష్టారాజ్యం
ఈటీవీ - ఆదిలాబాద్‌

జిల్లా ఉన్నతాధికారుల ప్రేక్షక పాత్ర కిందిస్థాయి అధికార, సిబ్బందికి కలిసొస్తోంది. పట్టా భూములతోపాటు ప్రభుత్వ, అసైన్డ్‌, లావుణి భూముల క్రయవిక్రయాల్లో కొంతమంది అధికారులు కాసులకు కక్కుర్తిపడి దళారులతో చేతులు కలపడం అర్హులైన లబ్ధిదారులకు ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. ఆదిలాబాద్‌, మావల, బట్టిసావర్గాం, రాంనగర్‌, బెల్లూరి, భీంసరి శివారుతోపాటు తలమడుగు, బజార్‌హత్నూర్‌, ఇచ్చోడ, నేరడిగొండ, బోథ్‌, ఇంద్రవెల్లి, సిరికొండ మండలాల్లో బినామీ పత్రాలతో భూములను రిజిస్ట్రేషన్ల చేసే దందా హద్దు మీరుతోంది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ భూముల లెక్కతీయడంలో ఉన్నతాధికారులు చొరవ చూపడం లేదు. ఆదిలాబాద్‌ మున్సిపాల్టీ పరిధిలోనే రూ.కోట్ల విలువ చేసే 52 లీజు స్థలాలుంటే, మావల, బట్టిసావర్గాం, కేఆర్కేకాలనీని ఆనుకొని వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి ఉండేది. ఇప్పుడు వాటి లెక్కలపై సమగ్రత కొరవడింది. స్థిరాస్తి వ్యాపారుల భూకబ్జాల దందా శాంతిభద్రతలకు సైతం విఘాతం కలిగిస్తోంది. జిల్లా ఉన్నతాధికారులు చొరవచూపితే తప్ప అక్రమాలు ఆగేలా లేవు.

ప్రైవేటు సైన్యం

ఆదిలాబాద్‌లో కొత్త తరహా సంస్కృతి పురుడు పోసుకుంటోంది. సిండికేట్‌గా మారిన కొంతమంది స్థిరాస్తి వ్యాపారులు తమకు అడ్డొచ్చిన వారిని భయభ్రాంతులకు గురి చేయడం కోసం ప్రైవేటు సైన్యం ఏర్పాటు చేసుకుంటున్నారు. గతంలో ఆర్టీసీ బస్టాండ్‌ ఎదుట ఓ స్థిరాస్తి వ్యాపారిని హత్యచేయడం, ప్రస్తుతం మావల పరిధిలో ఉండే ఓ కౌన్సిలర్‌ రౌడీ ముఠాతో ఓ వ్యక్తిని కిడ్నాప్‌ చేయడం, విధి నిర్వహణలో ఉన్న పోలీసులపైనే చేయిచేసుకోవడం అప్పట్లో సంచలనాలకు దారితీశాయి. అప్రమత్తమైన అప్పటి ఎస్పీ ఆ కౌన్సిలర్‌ సహా స్థిరాస్తి వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవడంతో తిరిగి ప్రశాంతత నెలకొంది. తాజాగా మళ్లీ అలాంటి దందానే తెరపైకి రావడం కలకలం సృష్టిస్తోంది. స్థిరాస్తి వ్యాపారులకు రాజకీయ నాయకుల తోడ్పాటు ఉండటంతో దాడుల ఘటనలు పోలీసు రికార్డులకు ఎక్కడం లేదు. మావల, బట్టిసావర్గాం, నేరడిగొండ, ఇచ్చోడ ప్రాంతాల్లో జరుగుతున్న ఈ దందా జోరుగా సాగుతోంది. ఇటీవల 346 ప్రభుత్వ సర్వే నెంబరులో జరిగిన దాడి ఇలాంటి కోవకు చెందినదే.


సమ్మతి లేకుండానే సర్దేశారు

ది బజార్‌హత్నూర్‌ రెవెన్యూ అధికారులు జారీ చేసిన కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం. మండలంలోని టెంబికి చెందిన సంత్యా పేరిట అదే శివారులో 25 ఎకరాల లావుణి భూమి ఉంది. సంత్యా సహా ఆయన ముగ్గురు సంతానం ఏళ్ల కిందటే చనిపోయారు. ఆ ముగ్గురు కొడుకులకు మొత్తం 16 మంది సంతానం. వారందరికీ భూమిపై హక్కు ఉంటుంది. కానీ అందులో ఒక వారసుడి పేరుపైనే 6.17 ఎకరాలు రిజిస్ట్రేషన్‌ చేసేశారు. భూమి ఒకరి పేరిట మార్పిడి చేయాలంటే మిగిలిన అందరి సమ్మతి తప్పనిసరి. రెవెన్యూ అధికారులు అలా చేయలేదు. ఒక్కరే బతికి ఉన్నట్లు వెల్లడించేలా గతేడాది జులై 29న కుటుంబ సభ్యుల ధ్రువపత్రం జారీ చేశారు. అంటే ఇప్పటికీ బతికున్న 16 మందిని అధికారిక రాతల్లో చంపేశారన్నమాట.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు