logo

అవును.. అన్నీ సాధ్యమే.!

దైనందిన జీవితంలో సాధ్యం, అసాధ్యం అనే పదాలు నిత్యం వినిపిస్తుంటాయి. కొందరు ప్రతిదీ అమ్మో, అసాధ్యమే అని ఆది నిష్ఠూరం ప్రదర్శిస్తుంటారు.

Published : 01 Feb 2023 04:11 IST

వీరందరి జీవితాలే నిదర్శనం
నిర్మల్‌ పట్టణం/మామడ, న్యూస్‌టుడే

దైనందిన జీవితంలో సాధ్యం, అసాధ్యం అనే పదాలు నిత్యం వినిపిస్తుంటాయి. కొందరు ప్రతిదీ అమ్మో, అసాధ్యమే అని ఆది నిష్ఠూరం ప్రదర్శిస్తుంటారు. మరికొందరు ఎంత కష్టమైనా పర్వాలేదంటూ బలాన్ని కూడగట్టుకొని ముందుకెళ్తుంటారు. వైకల్యం, పేదరికం, ప్రతికూలతలు.. తదితర కారణాలతో తమను తాము తగ్గించుకొని ఎలాంటి ప్రయత్నం చేయకుండా మిన్నకుండిపోతారు. ఓసారి మనచుట్టూ ఉన్న పరిసరాలను గమనిస్తే ఎంతోమంది కష్టాలను జయించి విజయతీరాలకు చేరినవారు కనిపిస్తుంటారు. అలాంటివారిని స్ఫూర్తిగా తీసుకుంటే మనలోని లోటుపాట్లు- ఆటుపోట్లు, వైఫల్యాలు బలాదూర్‌ అవుతాయి.


మాటలే.. మాత్రలుగా..

తాజాగా మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాలోని మల్లారెడ్డి విశ్వవిద్యాలయంలో ‘ఆటిట్యూడ్‌ ఈజ్‌ ఎవ్రీథింగ్‌’ అనే అంశంపై విద్యార్థులతో సదస్సు నిర్వహించారు. ఇందులో అంతర్జాతీయ ప్రఖ్యాత ప్రేరణ కర్త, రచయిత నిక్‌ వుజిసిక్‌ వక్తగా పాల్గొని ప్రసంగించారు. ‘కాళ్లు, చేతులు లేకుండా పుట్టాను. వివాహమవుతుందని, పిల్లలు కలుగుతారని ఎప్పుడూ అనుకోలేదు. కానీ, నలుగురు పిల్లలకు తండ్రినయ్యా. ఏది కావాలన్నా సొంతంగా సాధించుకోవాలనే దృక్పథాన్ని నా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి అలవాటు చేశారు. ఆ కారణంగానే ప్రతికూలతలు అధిగమించే సానుకూల దృక్పథం అలవర్చుకున్నా’నంటూ.. తన జీవితాన్నే ఓ స్ఫూర్తిపాఠంగా బోధించారు. విద్యార్థులను ఉత్తేజితులను చేశారు. ఆయన చెప్పిన అంశాలు సామాజిక మాధ్యమాల్లో విని, పత్రికల్లో చదివి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మనకెదురయ్యే పరిస్థితులను మార్చడం అసాధ్యం. వాటిని ఎలా అధిగమించాలో ఆలోచించాలి. ఆ దిశగా ఉత్తమ ప్రయత్నాలు చేయాలి. అప్పుడు అసాధ్యమనే దానికి తావులేేదని పలువురు అనుకోవడం వినిపించింది.


కళ్లు లేకపోయినా.. ఎంతో ముందుచూపు

తాను నిర్వహిస్తున్న దుకాణంలో మహేశ్‌

రాత్రివేళల్లో కొద్దిసేపు విద్యుత్తు సరఫరా లేకపోతేనే అమ్మో! చీకటంటూ ఆందోళన చెందుతుంటాం. అలాంటిది పుట్టుకతోనే వెలుతురు చూడని జీవితాలెందరివో. అయినా వారు దిగాలు చెందటం లేదు. ఆత్మస్థైర్యం ప్రోది చేసుకొని ప్రత్యామ్నాయంతో తమ జీవితాలను కొనసాగిస్తుంటారు. భైంసాకు చెందిన పంచగుడి మహేశ్‌.. ఈ విషయంలో ఆదర్శంగా చెప్పుకోవచ్చు. కళ్లు లేవని ఇంటికే పరిమితం కాకుండా తన కాళ్లపై తాను నిలబడటమే కాకుండా తనలాంటి దివ్యాంగులకు చేయూతనిస్తుంటాడు. చిన్నాచితకా వ్యాపారాలు చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాడు. ప్రస్తుతం భైంసాలో దివ్యాంగ్‌శక్తి పేరిట క్లీనింగ్‌ ఉత్పత్తులు, మోదుగ ఆకులతో తయారైన విస్తరాకులు, పర్యావరణానికి మేలుచేసే సంచులను మార్కెటింగ్‌ చేస్తుంటారు. త్వరలోనే రూ.25 లక్షల బ్యాంకు రుణంతో తమ వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు కసరత్తు చేస్తున్నారు. దీంతో మరో 10 మందికి ఉపాధిని కల్పించొచ్చని ధీమాగా చెబుతున్నాడు.


నీరూ లేదు.. చదునైన భూమీ కాదు

వ్యవసాయం చేయాలంటూ పుష్కలంగా నీరుండాలి. నేల సారవంతమైనదై ఉండాలి. అయితేనే పంటలు పండుతాయని, నాలుగురాళ్లు సంపాదిస్తామని భావిస్తుంటారు. కానీ, అందరికీ మెరుగైన సాగు వడ్డించిన విస్తరేం కాదు. మామడ మండలం వాస్తాపూర్‌లోని పలువురు రైతుల పంట చేలను చూస్తే వారి ఆత్మవిశ్వాసానికి చెయ్యెత్తి దండం పెట్టాల్సిందే. రాళ్లురప్పల్లో కేవలం వర్షాధారంగానే పంటలు పండిస్తుంటారు. ఒకే పంటతో సంతృప్తి చెందుతారు. అందులోనూ చాలాసార్లు అనావృష్టితో నష్టపోతుంటారు. అయినా ధైర్యం వీడక ఏటా రెట్టించిన ఉత్సాహంతో తమ నాగళ్లను ముందుకు సాగిస్తారు.


నడవలేక పోయినా..

భైంసా మండలం తిమ్మాపూర్‌కు చెందిన కట్కం వినాయక్‌రాజ్‌కు 2009లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం కారణంగా.. రెండు కాళ్లు తొలగించారు. ఉన్నట్టుండి పనిచేసుకునే వ్యక్తి అచేతనుడిగా మారడంతో ఆ కుటుంబంలో అంధకారం నెలకొన్నట్లయింది. అనుకోని సంఘటనతో కొద్దిరోజులు ఇంటిల్లిపాది మానసికంగా కుంగిపోయారు. ఎలా బతుకుతామోనన్న బెంగ బాధపెట్టింది. జీవించాలంటే కష్టపడక తప్పదని, ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనాల్సిందేనన్న మొండిధైర్యం కొద్దికొద్దిగా బలపడింది. దీంతో ఇంటిపక్కనే చిన్న కిరాణం పెట్టుకున్నారు. భార్య నందిని వెన్నుదన్నుగా నిలవడంతో కాళ్లు లేకపోయినా బతుకుబండిని ఆశావాద దృక్పథంతో కొనసాగిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు