logo

ఐటీడీఏ కొత్త పీవో ఎవరో?

రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఐఏఎస్‌ల బదిలీలలో ఉట్నూరు ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డికి కేవలం ఎనిమిది నెలల్లోనే ప్రభుత్వం స్థానచలనం  కలిగించింది.

Published : 01 Feb 2023 04:11 IST

8 నెలల్లోనే వరుణ్‌రెడ్డికి స్థానచలనం..
స్వల్ప వ్యవధిలోనే తనదైన ముద్ర

గిరిజన దివ్యాంగురాలి సమస్యలను అడిగి తెలుసుకుంటున్న పీవో వరుణ్‌రెడ్డి  

ఉట్నూరు, న్యూస్‌టుడే : రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఐఏఎస్‌ల బదిలీలలో ఉట్నూరు ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డికి కేవలం ఎనిమిది నెలల్లోనే ప్రభుత్వం స్థానచలనం  కలిగించింది. నిర్మల్‌ జిల్లా పాలనాధికారిగా బదిలీ చేసింది. ఆయన స్థానంలో ఇంకా ఎవరినీ నియమించలేదు. కొత్తగా ఎవరికీ పోస్టింగ్‌ ఇస్తారో ఇంకా తెలియలేదు. ఆయన ఇక్కడ పీవోగా పని చేసింది తక్కువ కాలమైనా.. పాలనలో తనదైన ముద్ర వేశారు. తన కిందిస్థాయి ఉద్యోగులు, సిబ్బంది మధ్య సమన్వయం చేసుకుంటూ.. సమష్టిగా గిరిజనాభివృద్ధికి కృషి చేశారు.

గిరిజన విద్యకు అధిక ప్రాధాన్యం..

గతేడాది జూన్‌-12న ఉట్నూరు ఐటీడీఏలో పీవోగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఆయన ఎక్కువగా క్షేత్రపర్యటనకు ప్రాధాన్యం ఇచ్చారు. ఆదివాసీ గిరిజనులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల విభాగంలో అర్జీదారులకు ఊరట కలిగించేలా వారి సమస్యలను ఆలకించేవారు. గిరిజన విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. అక్షరజ్యోతి కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేశారు. కనీస స్థాయిని పెంచేందుకు చర్యలు చేపట్టారు. పాఠశాలల్లో వసతుల కల్పనకు మార్పులు చేయడానికి కృషి చేశారు. విద్యార్థుల్లో సృజనను పెంపొందించేందుకు డివిజన్‌ స్థాయి నుంచి మొదలు కొని జిల్లా స్థాయి వరకు విద్యా, విజ్ఞాన ప్రదర్శన నిర్వహించారు. మండల, డివిజన్‌, జిల్లా స్థాయి క్రీడా పోటీలను ఏర్పాటు చేశారు. జిల్లాలోని గిరిజన ఉద్యానవనాల మహర్దశ కోసం గట్టిగా ప్రయత్నం చేశారు. గ్రామాలలో నెలకొన్న మౌలిక సమస్యల పరిష్కారానికి ఆదివాసీ గిరిజనులతో మమేకమై తనవంతు కృషి చేశారు. గిరిజన విద్యాభివృద్ధికి సమష్టిగా కృషి చేయడం తనకెంతో సంతృప్తిని ఇచ్చిందని ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి ‘న్యూస్‌టుడే’తో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

కొత్త పీవోను నియమించే వరకు వరుణ్‌రెడ్డి ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని