logo

ఆమెకు ఆటే ప్రాణం!

బంతితో ఆడుతున్న ఆరో తరగతి విద్యార్థిని వ్యాయామ ఉపాధ్యాయుడి దృష్టిలో పడ్డారు. ఆయన క్షణం ఆలస్యం చేయకుండా వాలీబాల్‌ ఆటలో శిక్షణ ఇచ్చారు.

Published : 01 Feb 2023 04:11 IST

జాతీయస్థాయి వాలీబాల్‌ పోటీలకు ఎంపిక
న్యూస్‌టుడే, గుడిహత్నూర్‌, ఆదిలాబాద్‌ క్రీడావిభాగం

బంతితో ఆడుతున్న ఆరో తరగతి విద్యార్థిని వ్యాయామ ఉపాధ్యాయుడి దృష్టిలో పడ్డారు. ఆయన క్షణం ఆలస్యం చేయకుండా వాలీబాల్‌ ఆటలో శిక్షణ ఇచ్చారు. అనతి కాలంలోనే ఆమె మంచి స్పైకర్‌(అటాకర్‌)గా పేరొందారు. అదే స్ఫూర్తితో ఆటలో రాణిస్తూ పిన్న వయసులోనే రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో చక్కని ప్రతిభ కనబరిచారు. తాజాగా సీనియర్‌ జాతీయస్థాయి వాలీబాల్‌ పోటీలకు ఉమ్మడి జిల్లా నుంచి తొలిసారి ఎంపికైన ఏకైక మహిళగా  ఆ ఘనతను సొంతం చేసుకున్నారు ముండే లావణ్య.  

సాధనలో లావణ్య

కుటుంబ నేపథ్యం..

లావణ్య గుడిహత్నూర్‌ మండలం మన్నూర్‌కు చెందిన ముండే రాజేందర్‌-రేణుక దంపతుల కుమార్తె. వీరిది వ్యవసాయ కుటుంబం. ప్రస్తుతం ఆమె ఆదిలాబాద్‌లోని విద్యార్థి డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. ఆటల్లో అభిరుచి ఉండటంతో తల్లిదండ్రులు దూర ప్రాంతాల్లో జరిగే పోటీలకు పంపించి ప్రోత్సహిస్తున్నారు.

క్రీడల్లో ఇలా..

ఎస్‌జీఎఫ్‌, అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగే అండర్‌-14, 17, 19, సబ్‌-జూనియర్‌ విభాగాల్లో ఇప్పటి వరకు ఆరుసార్లు జాతీయస్థాయి పోటీల్లో తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.

పదుల సంఖ్యలో రాష్ట్రస్థాయి పోటీల్లో ఆడారు. మూడుసార్లు ఉత్తమ క్రీడాకారిణిగా ఎంపికయ్యారు.


తొలి మహిళగా ఘనత..

త పది రోజులుగా వేములవాడలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడా ప్రాంగణంలో సీనియర్‌ మహిళల వాలీబాల్‌ శిక్షణ శిబిరం నిర్వహించారు. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి 18 మంది శిక్షణ పొందారు. అందులో అత్యుత్తమంగా ప్రతిభ కనబరిచిన ముండే లావణ్యను తుది జట్టుకు ఎంపిక చేశారు. ఇలా ఆమె ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నుంచి తొలి మహిళగా ఎంపికై ఘనతను సాధించారు. ఫిబ్రవరి 2 నుంచి గువాహటిలో జరిగే జాతీయస్థాయి వాలీబాల్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. దేశానికి ప్రాతినిధ్యం వహించడమే తన ముందున్న లక్ష్యమంటున్నారు. ఆమెకు ఉమ్మడి జిల్లా వాలీబాల్‌ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నల్ల శంకర్‌, మైలారం శ్రీనివాస్‌, మన్నూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు వెంకట రమణ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని