logo

చిన్నారుల కోసం.. బడి గ్రంథాలయం

ప్రాథమిక స్థాయి నుంచే పిల్లల్లో పఠనాసక్తిని పెంపొందించేందుకు ప్రాథమిక పాఠశాలల్లో గ్రంథాలయాలు (రీడింగ్‌ కార్నర్‌్్స) ఏర్పాటు చేయనున్నారు.

Published : 01 Feb 2023 04:11 IST

దండేపల్లి, న్యూస్‌టుడే

ఇది దండేపల్లి ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన గ్రంథాలయం. ఇప్పటి వరకు ఎక్కువగా ఉన్నత పాఠశాలల్లో గ్రంథాలయాలు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం అందించే పుస్తకాలతో పాటు ఎన్‌ఎంఎంఎస్‌ ఉపకార వేతనాలు పొందిన విద్యార్థులకు ‘బ్రెడ్‌’  సంస్థ పలు పుస్తకాలతో పాటు బీరువాలు అందజేసింది. ప్రస్తుతం ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో  గ్రంథాలయాలు ఏర్పాటు చేయడం వల్ల చిన్నారులకు ప్రయోజనం చేకూరనుంది.

ప్రాథమిక స్థాయి నుంచే పిల్లల్లో పఠనాసక్తిని పెంపొందించేందుకు ప్రాథమిక పాఠశాలల్లో గ్రంథాలయాలు (రీడింగ్‌ కార్నర్‌్్స) ఏర్పాటు చేయనున్నారు. ప్రాథమిక స్థాయిలో అభ్యసన ప్రక్రియలు పెంపొందించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ‘తొలిమెట్టు’ కార్యక్రమంలో భాగంగా కృత్యాధార బోధన సాగుతోంది. దీంతో పాటు మన ఊరు-మన బడి కింద పాఠశాలల్లో తరగతి గదులు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న నేపథ్యంలో ప్రత్యేక గ్రంథాలయాలు ఏర్పాటు చేయనున్నారు. గ్రంథాలయాల నిర్వహణపై ఇప్పటికే ప్రతీ జిల్లా నుంచి ఒక జిల్లా స్థాయి సెక్టోరియల్‌ అధికారి, ఇద్దరు ఉపాధ్యాయులకు హైదరాబాద్‌లో శిక్షణ ఇచ్చారు. రోజు ఒక గంట పాటు ప్రత్యేకంగా పుస్తక పఠనంపై కార్యాచరణ రూపొందించనున్నారు. మన ఊరు -మన బడి కింద ఎంపికైన పాఠశాలల్లో  ప్రస్తుతం వీటిని ఏర్పాటు చేస్తుండగా తర్వాత మిగతా బడుల్లో వీటిని అందుబాటులోకి తేనున్నారు.


ఆకట్టుకునే చిత్రాలు..

ప్రతీ గ్రంథాలయంలో ఆకట్టుకునే బొమ్మలు, కథలతో కూడిన 240 పుస్తకాలను అందుబాటులో ఉంచనున్నారు. బాలసాహిత్యం, పఠనాసక్తిని పెంపొందించే ఈ పుస్తకాలను రోజూ ఉపాధ్యాయులు చదివిస్తారు. వీటి నిర్వహణకు పాఠశాలలో ప్రత్యేక రిజిష్టరు నిర్వహిస్తారు. నేషనల్‌ బుక్‌ట్రస్టు ద్వారా 120 పుస్తకాలు, స్వచ్చంద సంస్థ రూం టు రీడ్‌ నుంచి మరో 120 పుస్తకాలు పాఠశాలలకు అందజేయనున్నారు.


రంగురంగులతో... ఆరు స్థాయిలలో...

విద్యార్థులను ఆరు స్థాయిలుగా గుర్తించి ఒక్కోస్థాయికి ఒక్కో రంగు పుస్తకాలు కేటాయించారు. మొదటి స్థాయి (ఆకు పచ్చ) ఇందులో సరళ అక్షరాలు, సులువుగా పలికే వీలున్న రెండక్షరాల పదాలు ఉంటాయి. రెండో స్థాయి (ఎరుపు)లో సరళ పదాలు, రెండు మూడింటితో సరళ వాక్యాలు, మూడో స్థాయి (నారింజ)లో ద్విత్వాక్షరాలు స్వల్ప ఒత్తులు కలిగిన పదాలున్న వాక్యాలు, నాలుగో స్థాయి (తెలుపు)లో చిన్నచిన్న పేరాలుగా ఉండే కథలు, ఐదో స్థాయిలో (నీలి-బ్లూ)లో మరింత ఆసక్తి కరంగా ఉండే రెండు మూడు పేరాలున్న కథలు, ఆరోస్థాయిలో (పసుపు) విద్యార్థి సొంతంగా ఎవరి సాయం లేకుండా చదివేలా ఆసక్తికరంగా ఉండే చిత్రాలతో కూడిన కథలుంటాయి.  


విద్యార్థుల్లో పఠనాసక్తి పెరుగుతుంది

కర్నె నరేందర్‌, తెలుగు భాషోపాధ్యాయుడు, యూపీఎస్‌ లింగాపూర్‌

ప్రాథమిక స్థాయి నుంచే చిన్నారులను పుస్తకాలు చదివించడం వల్ల పఠనాసక్తి పెరుగుతుంది. భాషపై పట్టు పెరగడమే కాకుండా తేలికగా సబ్జెక్టును అర్థం చేసుకుంటారు. ప్రస్తుతం పుస్తకాల చదవడం తగ్గిపోవడం మాతృభాషకు దూరమై ఇతర భాషల్లోనూ ప్రావీణ్యం సాధించ లేకపోతున్నారు. మాతృభాషపై పట్టు ఉంటే ఇతర భాషలో రాణించే అవకాశముంది.


చిన్నారులకు ప్రయోజనకరం

ఎస్‌.వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాధికారి, మంచిర్యాల

ప్రాథమిక స్థాయిలో గ్రంథాలయాలు ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. బాల్యం నుంచే చదవడం అలవాటు కావడం వల్ల భాషపై పట్టు పెరుగుతుంది. తద్వార అన్ని సబ్జెక్టులను అర్థం చేసుకునే అవకాశముంటుంది. ఇవి సద్వినియోగం అయ్యేలా ఉపాధ్యాయులు కృషి చేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని