logo

సరికొత్త అనుభూతితో ప్రయాణం

ఉమ్మడి ఆదిలాబాద్‌ ఆర్టీసీ డిపోలకు అధునాతన హంగులతో నూతన సూపర్‌ లగ్జరీ బస్సులు వచ్చేశాయి. పాతవి ఇప్పటికే 10 లక్షల కిలోమీటర్లు తిరిగేయడంతో వాటి స్థానంలో ఇవి వచ్చేశాయి.

Published : 01 Feb 2023 04:11 IST

ఉమ్మడి జిల్లాకు 65 నూతన సూపర్‌ లగ్జరీ బస్సులు
న్యూస్‌టుడే, శాంతినగర్‌(ఆదిలాబాద్‌)

మ్మడి ఆదిలాబాద్‌ ఆర్టీసీ డిపోలకు అధునాతన హంగులతో నూతన సూపర్‌ లగ్జరీ బస్సులు వచ్చేశాయి. పాతవి ఇప్పటికే 10 లక్షల కిలోమీటర్లు తిరిగేయడంతో వాటి స్థానంలో ఇవి వచ్చేశాయి. మొత్తం 65 బస్సులు రావాల్సి ఉండగా.. ఇప్పటికే రీజియన్‌కు 33 చేరుకున్నాయి. ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని కలిగించనున్నాయి.

ఉమ్మడి జిల్లాలో 73 పాత సూపర్‌ లగ్జరీ బస్సులు ఉన్నాయి. ఇందులో 65 బస్సులు 10 లక్షల కిలోమీటర్లు తిరగడంతో వీటి స్థానంలో నూతన బస్సులు వస్తున్నాయి. పాత బస్సులు 160 హెచ్‌పీ సామర్థ్యం కలిగి ఉండగా కొత్తవి 200 హెచ్‌పీతో ఉన్నాయి. అయినా వీటి వేగ పరిమితి 80 కిలోమీటర్లకే పరిమితం చేశారు. 2017 నుంచి ప్రయాణికుల వాహనాలకు సంబంధించి వేగ నియంత్రణ నిబంధనలు అమల్లో ఉన్నట్లు ఆర్టీసీ అధికారలు పేర్కొన్నారు. 2016 కంటే ముందున్న బస్సులు వీటి కంటే వేగంగా వెళ్లనున్నాయి.


కెమెరాలు

స్సుకు ముందు, వెనుక, లోపల సైతం సీసీ కెమెరాలను అమర్చారు. మధ్యలో ఉన్న కెమెరా ప్రయాణికులు డ్రైవర్‌కు కనిపించేలా అమర్చారు. బస్సులో ఏదైనా సాంకేతిక లోపం తలెత్తితే దీని పక్కన ఉన్న ఎర్రలైటు వెలిగి సైరన్‌ ఇస్తుంది. ఈ కెమెరాలతో డ్రైవర్‌ తెరలో చూసుకోవడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.


ట్యాబ్‌

పాత బస్సులో 14 సెన్సర్లు ఉండేవి. కొత్త వాటిలో 35 సెన్సర్లు ఏర్పాటు చేశారు.  వైరింగ్‌లో ఎక్కడ లోపం ఉందో ఈ ట్యాబ్‌లో వెంటనే తెలుస్తుంది. దీంతో సాంకేతిక లోపాలను ఇట్టే గుర్తించవచ్చు.


డోర్‌ ఎమర్జెన్సీ స్వీచ్‌

స్సు తలుపు తీయాలంటే కండక్టర్‌ అవసరం ఉండేది. ఇప్పుడు బస్సు లోపల బయట ఎమర్జెన్సీ స్వీచ్‌లను ఏర్పాటు చేశారు.  


నూతన బస్సుల్లో ఇవి ప్రత్యేకతలు..

పాత బస్సులతో పోలిస్తే వీటిలో ఎన్నో కొత్త సౌకర్యాలు ఉన్నాయి. సురక్షిత ప్రయాణానికి పెద్ద పీట వేస్తూ వీటిని సిద్ధం చేశారు.


డిజిటల్‌ తెర

డ్రైవర్‌ సీటుకు ముందు పూర్తిగా డిజిటల్‌ తెర ఉంటుంది. బస్సు ఇంజిన్‌ స్టార్ట్‌ చేయగానే సంకేతాలు వెలిగి ఆరిపోతాయి. ఒక వేళ ఏదైనా ఆరిపోకుంటే సాంకేతిక లోపం ఉన్నట్టు డైవర్‌కు తెలుస్తుంది. ప్రమాదాలను అరికట్టేలా నూతనంగా ఏర్పాటు చేశారు.


వెంటనే సమాచారం

ప్రస్తుతం గమ్యస్థానం రాగానే మైక్‌ ద్వారా ప్రయాణికులను అప్రమత్తం చేస్తారు. ఎప్పటికప్పుడు డ్రైవర్‌ ప్రయాణికులకు చెబుతూ ఉంటారు.


యూఎస్‌బీ ఛార్జర్‌ పాయింట్లు

పాత వాహనాల్లో 4 నుంచి 5 ఛార్జింగ్‌ పాయింట్లు ఉండేవి. వీటిలో మాత్రం ప్రతి సీటుకు ఒకటి చొప్పున అమర్చారు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఇకపై ఛార్జింగ్‌ కష్టాలు తీరనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని