logo

పడకేసిన పప్పు యంత్రాలు..!

మహిళా సంఘాలను వ్యాపార పరంగా ప్రోత్సహించి ఆర్థికంగా అభివృద్ధి బాట పట్టించాలనే లక్ష్యంతో గతంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో రెండు మండలాల్లో మినీ పప్పు మిల్లులు ఏర్పాటు చేశారు.

Published : 01 Feb 2023 04:11 IST

పాతవి పక్కనపెట్టి కొత్తచోట ప్రారంభం
ఆసిఫాబాద్‌, వాంకిడి, న్యూస్‌టుడే

వాంకిడిలోని దాల్‌ మిల్లులో నిరుపయోగంగా యంత్రాలు

హిళా సంఘాలను వ్యాపార పరంగా ప్రోత్సహించి ఆర్థికంగా అభివృద్ధి బాట పట్టించాలనే లక్ష్యంతో గతంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో రెండు మండలాల్లో మినీ పప్పు మిల్లులు ఏర్పాటు చేశారు. అధికారుల చొరవతో ప్రారంభంలో రెండేళ్లపాటు సాఫీగా సాగిన వ్యాపారం.. పర్యవేక్షణ కొరవడి తర్వాత పడకేసింది. దీంతో రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన యంత్రాలు తుప్పుపట్టి పనికిరాకుండా మారాయి. పాతవాటి నిర్వహణను మరిచిన అధికారులు మళ్లీ కొత్తగా జైనూర్‌లో యంత్రం కొనుగోలుచేసి మిల్లు ఏర్పాటుచేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే సమయంలో పాతవాటి నిర్వహణపైనా అధికారులు దృష్టి సారిస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

జిల్లాలో పత్తి, వరి తరువాత ఎక్కువగా సాగయ్యేది కంది పంట. గ్రామీణ ప్రాంత గిరిజన రైతులకు ప్రయోజనం కల్పించడంతో పాటు కందిపప్పు ఉత్పత్తి చేసేలా 2017లో వనబంధు కల్యాణయోజన కింద ఐటీడీఏ ఆధ్వర్యంలో వాంకిడి, తిర్యాణి మండలాల్లో ఒక్కో యంత్రానికి రూ.7.80 లక్షల చొప్పున వెచ్చించి రెండుచోట్ల మినీ దాల్‌ మిల్లులను ఏర్పాటు చేశారు. మండల సమాఖ్య ఆధ్వర్యంలో  మహిళా సభ్యులు కందులు కొనుగోలు చేసి పప్పు తయారు చేసేవారు. అప్పటి ఐటీడీఏ పీఓ కర్ణన్‌ ప్రత్యేక చొరవతో గిరిజన సంక్షేమశాఖ పరిధిలోని గురుకులాలు, వసతి గృహాలకు ఈ పప్పును సరఫరా చేసేవారు. విపణిలోనూ విక్రయించేవారు.

జిల్లా కేంద్రంలో ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేసిన కందులు

ఉడకడం లేదని నిర్లక్ష్యం చేశారు..

వాంకిడిలో 2017లో కందులు కొని పప్పుగా మలిచి విక్రయించడంతో ఖర్చులు పోనూ రూ.రెండు లక్షల ఆదాయం వచ్చింది. 2018లో 118 క్వింటాళ్ల కందులు కొని పప్పుగా మార్చి గురుకులాలకు సరఫరా చేసినా.. బకాయిలు రాక నష్టాలతో మూతపడింది. తిర్యాణిలోనూ 2018, 2019లలో కందులు కొనుగోలు చేసి పప్పుగా మార్చి విక్రయించడంతో రూ.2.50 లక్షల వరకు ఆదాయం వచ్చింది. కొన్ని గురుకులాల వార్డెన్లు ఈ పప్పు ఉడకడంలేదంటూ తీసుకోవడం మానేశారు. బయట గుత్తేదారు నుంచి పప్పు సరఫరా అయితే తృణమో ఫలమో వారికి దక్కేది. కానీ మహిళ సంఘాల నుంచి సరఫరా అయితే తమకేమి లాభం? అన్న ఉద్దేశంతో పప్పు తీసుకోవడం మానేశారన్న విమర్శలు అప్పట్లో వినిపించాయి.

విపణిలో జోరుగా విక్రయాలు

జిల్లాలో వానాకాలంలో 34,200 ఎకరాల్లో కంది సాగైంది. సుమారు 1.70- 1.80 లక్షల క్వింటాళ్ల కంది దిగుబడి రావొచ్చని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. క్వింటా ప్రభుత్వ మద్దతు ధర రూ.6600 ఉంది. విపణిలో నాణ్యతను బట్టి క్వింటా రూ.6600 నుంచి 6800 వరకు కొనుగోలు చేస్తున్నారు. జైనూర్‌లో ఆరు నెలల క్రితం రూ.10 లక్షల ఐడీడీఏ నిధులతో మినీ దాల్‌ మిల్లు యంత్రాలు కొని బిగించారు. జైనూర్‌, వాంకిడి, కెరమెరి, సిర్పూర్‌(యు) మండలాల్లో ఆయా మండల సమాఖ్యల ఆధ్వర్యంలో ఈ సారి సుమారు 8-10 క్వింటాళ్ల కందులు కొని పప్పుగా మార్చి విక్రయించాలన్న ప్రణాళికను అధికారులు సిద్ధం చేశారు.

పునరుద్ధరణపై దృష్టి పెడితే మేలు..

వాంకిడి, తిర్యాణిలో ఏర్పాటు చేసిన పప్పు మిల్లులు రెండేళ్లు నడిచి తరువాత మూలన చేరాయి. యంత్రాలు తుప్పు పట్టాయి. ప్రస్తుతం కంది సీజన్‌ మొదలైంది. జైనూర్‌లో కొత్త దాల్‌ మిల్లు ప్రారంభానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పాత మిల్లులను సైతం పునరుద్ధరిస్తే మళ్లీ ఉత్పత్తి మొదలై సంఘాలు వ్యాపారపరంగా వృద్ధి సాధించే అవకాశం ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని