logo

మూడేళ్లు దాటినా.. ముడిపడని ప్రగతి

మున్సిపాలిటీల్లో పాలకవర్గాలు కొలువుదీరి మూడేళ్లు గడుస్తున్నాయి. ఈ సందర్భంలో ఆయా పురాల్లో సౌకర్యాలు,పనులను బేరీజు వేసుకుంటే అనుకున్నంత ప్రగతి చేకూరలేదని స్పష్టమవుతోంది.

Published : 01 Feb 2023 04:11 IST

బల్దియాల్లో పనులు వేగవంతం చేస్తేనే  ఫలితం
లక్షెట్టిపేట, న్యూస్‌టుడే

ఇది లక్షెట్టిపేటలో పోలీస్‌ స్టేషన్‌ పక్కన ఏర్పాటు చేసిన  పిల్లల పార్కు.

రూ. 5 లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన పార్కు పిల్లలకు ఆహ్లాదాన్ని పంచుతోంది.

మున్సిపాలిటీల్లో పాలకవర్గాలు కొలువుదీరి మూడేళ్లు గడుస్తున్నాయి. ఈ సందర్భంలో ఆయా పురాల్లో సౌకర్యాలు,పనులను బేరీజు వేసుకుంటే అనుకున్నంత ప్రగతి చేకూరలేదని స్పష్టమవుతోంది. కొన్నిచోట్ల ప్రభుత్వం ప్రారంభించిన పట్టణ ప్రగతి, నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా చేపడుతున్న పనులతో అభివృద్ధికి బాటలు పడుతున్నాయి. స్థలాభావం, ఏజెన్సీలాంటి స్థానికంగా వివాదాలు, కోర్టు కేసుల లాంటి సమస్యలు ఉన్న మున్సిపాలిటీల్లో లక్ష్యానికి అనుగుణంగా పనులు జరగడం లేదు. అధికారులు, ప్రజా ప్రతినిధులు మరింత చొరవ తీసుకుని ప్రజలతో సమన్వయంగా సాగి మరింత అభివృద్ధికి బాటలు వేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ‘న్యూస్‌టుడే’ కథనం.


స్థల ఎంపిక దశలోనే..

క్యాతన్‌పల్లిలో వర్షం కురిసిందంటే రహదారుల దుస్థితి ఇది.

క్యాతన్‌పల్లిలో సమీకృత మార్కెట్‌ పనులు కొనసాగుతున్నాయి. డంపింగ్‌ యార్డు కోసం ఇప్పటి వరకు స్థల ఎంపిక జరగలేదు. ప్రస్తుతం చెత్తను గతంలో సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యార్డులోనే వేస్తున్నారు. కొత్తగా ఏర్పాటైన కాలనీల్లో అంతర్గత రహదారులు, డ్రైనేజీల పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. వర్షాకాలంలో నీరు నిలుస్తోంది.


కొత్త పురాల్లో ఆదాయ వనరులే అసలు సమస్య

జిల్లాలోని పాత మున్సిపాలిటీల్లో పన్నుల వసూళ్లు, అద్దెలు, ఇతర వనరుల ద్వారా నిధులకు అంతగా సమస్య లేకపోయినా... కొత్తగా ఏర్పాటైన పురపాలక సంఘాలకు వస్తున్న నిధులు ఖర్చులకు ఏమాత్రం సరిపోవడం లేదు. సాధారణ నిధి, పట్టణ ప్రగతి, ఆర్థిక సంఘం నిధులు సిబ్బంది జీతభత్యాలు, విద్యుత్తు బిల్లుల చెల్లింపు, ఇతర నిర్వహణ ఖర్చులకు సరిపోతున్నాయి. సొంత నిధులతో అభివృద్ధి చేసుకునే అవకాశం ఏమాత్రం లేకపోవడంతో అభివృద్ధి జరగడం లేదు.

ముందుకు సాగని పనులు

జిల్లా ప్రధాన పట్టణమైన మంచిర్యాలలో అభివృద్ధి పనుల కోసం రూ. కోట్లు ఖర్చు చేస్తున్నా పనులు ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా మారాయి. బైపాస్‌ రహదారి నిర్మాణానికి రెండు విడతల్లో రూ. 14 కోట్లతో నిర్మించతలపెట్టినా ఇంకా మొదటి దశ దాటలేదు. ఇక రూ. 4 కోట్లు వెచ్చించి పార్కుల నిర్మాణం చేపట్టినా అవి ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వడం లేదు. ఓపెన్‌ జిమ్‌ల పరికరాలు చోరీకి గురవుతున్నాయి.

డంపింగ్‌ యార్డు ప్రారంభమెప్పుడో..

బెల్లంపల్లి రడగం బాల బస్తీలో డంపింగ్‌ యార్డు నిర్మాణానికి 5 ఎకరాలు కేటాయించినా పనులు ప్రారంభం కాలేదు. రూ. కోటి వెచ్చించి నిర్మించినా రెండు పార్కులు అందుబాటులోకి వచ్చాయి. క్రీడా ప్రాంగణాలు బోర్డులకే పరిమితమయ్యాయి. శ్మశాన వాటికల్లో ఒకటి అన్ని హంగులతో అందుబాటులోకి రాగా మరో రెండింటిలో పనులు సాగుతున్నాయి.

మందమర్రిలో..

ఏజెన్సీ చట్టం వివాదం కారణంగా మందమర్రిలో ఎన్నికలకు అవకాశం లేకపోవడం అభివృద్ధికి ఆటంకంగా మారింది. ఇక్కడ సమీకృత మార్కెట్‌ నిర్మాణం పనులు, శ్మశాన వాటిక పనులు కొనసాగుతున్నాయి. సింగరేణి పార్కు అందుబాటులో ఉండగా మరో పార్కు నిర్మాణం పనులు జరుగుతున్నాయి.


కొనసాగుతున్న దారుల విస్తరణ

చెన్నూరు పట్టణంలో నిర్మించిన డివైడర్లు, వాటికి ఏర్పాటు చేసిన సెంట్రల్‌ లైటింగ్‌

పట్టణంలో రహదారుల విస్తరణ, సుందరీకణ, సెంట్రల్‌ లైటింగ్‌, పార్కుల నిర్మాణం, సమీకృత మార్కెట్‌ నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. ఇక శివారు కాలనీల్లో అంతర్గత రహదారులు, డ్రైనేజీల సమస్య వేధిస్తోంది. వైకుంఠధామం, డంపింగ్‌ యార్డు పనులు సాగడం లేదు.


అంతర్గత రహదారులు లేక ఇబ్బందులు

లక్షెట్టిపేటలోని గోదావరి రోడ్డులో నిరుపయోగంగా క్రీడా ప్రాంగణం

క్షెట్టిపేటలో పురపాలికగా ఏర్పాటుకు ముందే దాతల సహకారంతో అన్ని హంగులతో శ్మశాన వాటిక ఏర్పాటు జరిగింది. ఇక ప్రకృతి వనం ఏర్పాటు కూడా బాగానే ఉంది. సమీకృత మార్కెటÆ్, డంపింగ్‌ యార్డు నిర్మాణం జరుగుతున్నాయి. వాహనాలు సరిపోయినన్ని ఉన్నా సిబ్బంది కొరత కారణంగా కాలనీల్లో చెత్త సేకరణ ఆశించిన స్థాయిలో జరగడం లేదు. విలీన గ్రామాల్లో అంతర్గత రహదారులు, మురుగునీటి కాల్వలు, విద్యుత్‌ దీపాల ఏర్పాటు జరగలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని