logo

పాలనాధికారిగా రాహుల్‌రాజ్‌ బాధ్యతల స్వీకరణ

నూతనంగా నియమితులైన పాలనాధికారి పీఎస్‌. రాహుల్‌రాజ్‌ బుధవారం రాత్రి బాధ్యతలు స్వీకరించారు.

Published : 02 Feb 2023 02:22 IST

బాధ్యతలు స్వీకరిస్తున్న కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

పాలనాప్రాంగణం, న్యూస్‌టుడే : నూతనంగా నియమితులైన పాలనాధికారి పీఎస్‌. రాహుల్‌రాజ్‌ బుధవారం రాత్రి బాధ్యతలు స్వీకరించారు. పాలనాధికారి వస్తున్నారని తెలిసి జిల్లా అధికారులు, పాలనాప్రాంగణ విభాగాధిపతులు, ఉద్యోగులు, సిబ్బంది సాయంత్రం పాలనాప్రాంగణానికి చేరుకున్నారు. తమను తాము పరిచయం చేసుకుంటూ  పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. బాధ్యతలు చేపట్టినందుకు శుభాకాంక్షలు తెలిపారు. తొలుత అదనపు పాలనాధికారులు నటరాజ్‌, రిజ్వాన్‌ బాషా షేక్‌, శిక్షణ సహాయపాలనాధికారి శ్రీజ, అటవీశాఖ అధికారి రాజశేఖర్‌, ఇతర శాఖల అధికారులతో పాటు ఎంపీడీవోలు, తహసీల్దార్లు నూతన పాలనాధికారికి స్వాగతం పలికినవారిలో ఉన్నారు.

మీరంతా తెలిసినవారే కదా!

కరోనా సమయంలో రెండు నెలల పాటు ఇక్కడ ఇన్‌ఛార్జిగా వ్యవహరించానని, మీరంతా కొత్తవారేం కాదుగా అంటూ సమష్టి కృషితో సమన్వయంతో పనిచేద్దామని తొలి సమావేశంలోనే అధికారులకు మార్గదర్శనం చేశారు. మాతాశిశు మరణాల నివారణకు ఆసిఫాబాద్‌ జిల్లాలో ప్రత్యేక చర్యలు తీసుకున్నామని, ఇక్కడా అలాంటి మరణాలు లేకుండా చూద్దామని పేర్కొన్నారు. గిరిజన జిల్లాలో పని చేయడం సంతృప్తినిచ్చిందని, మళ్లీ గిరిజనులు ఉన్న జిల్లాలో పనిచేసే అవకాశమిచ్చినందుకు సీఎం కేసీఆర్‌కి ధన్యవాదాలు తెలిపారు. త్వరలో శాఖలవారీగా సమీక్షలు నిర్వహిస్తానని, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 20 శాతం వృద్ధి సాధించేలా పనిచేయాలని చెప్పారు. ఆర్డీవోలు రమేష్‌, సురేష్‌, పాలనాప్రాంగణ ఏవో అరవిందర్‌, పుర కమిషనరు శైలజ, సంక్షేమాధికారులు మిల్కా, సునీత, కృష్ణవేణి, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే పాలనాధికారి బాధ్యతలు తీసుకునే సమయంలో మీడియాను లోనికి అనుమతించలేదు. బాధ్యతలు తీసుకుని అధికారులతో సమావేశం పూర్తయ్యాక వేచిచూస్తున్న మీడియా ప్రతినిధులను లోనికి రావాలని పిలిపించారు. ఫొటోలు తీసుకుని వెనక్కి రావాల్సిన పరిస్థితి నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని