logo

గిరిజన కోటకు.. నిర్మలమ్మ బాసట..

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో గిరిజన జిల్లా అవసరాలకు పెద్దపీట వేశారు.

Published : 02 Feb 2023 02:22 IST

బడ్జెట్‌లో వ్యవసాయ, ఆరోగ్య, విద్యా రంగాలకు పెద్దపీట

ఈనాడు డిజిటల్‌, ఆసిఫాబాద్‌: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో గిరిజన జిల్లా అవసరాలకు పెద్దపీట వేశారు. ఆదాయపన్ను మినహాయింపులు, సొంతింటి కల నెరవేరేలా చర్యలు, వ్యవసాయం, అనుబంధ రంగాలకు ప్రాధాన్యం, యువత ఉపాధికి చేసిన కేటాయింపులు ఆయా వర్గాలకు ఊరటనిచ్చాయి. సికిల్‌సెల్‌, తలసీమియా వ్యాధులను 2047 వరకు దేశం నుంచి తరిమివేసేలా ప్రత్యేక మిషన్‌ను అమలు చేయనున్నట్లు విత్త మంత్రి ప్రకటించారు. దీనివల్ల జిల్లాలోని బాధితులకు లబ్ధి చేకూరనుంది.

వ్యవసాయ రంగానికి జవసత్వాలు అందేలా పంట రుణాల పంపిణీ లక్ష్యాన్ని పెంచుతూ అనుబంధ రంగాలకు మరింతగా నిధులు విడుదల చేస్తున్నట్లుగా ఆర్థిక మంత్రి పార్లమెంట్ వేదికగా భరోసానిచ్చారు. యువతకు మూడేళ్ల పాటు శిక్షణ ఇచ్చేందుకు ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన పథకానికి నిధులు పెంచింది. జిల్లా విద్యాశిక్షణా సంస్థలను ఎక్స్‌లెన్సు కేంద్రాలుగా తీర్చిదిద్దడంతోపాటు మోడల్‌ ఏకలవ్య పాఠశాలల్లో పెద్దఎత్తున బోధన, బోదనేతర సిబ్బంది పోస్టుల భర్తీ చేస్తుండటంతో గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు నిరుద్యోగులకు లబ్ధి చేకూరనుంది.


వ్యవసాయ అనుబంధ రంగాలకు చేయూత

తృణధాన్యాల సాగు పెంచడం, వ్యవసాయానికి ఆధునిక హంగులు అద్దడం, అనుబంధ రంగాలకు కేటాయింపులతో సాగు రంగానికి ప్రాధాన్యం ఇచ్చారు ఆర్థిక మంత్రి. పంటలు సాగు చేసే సమయం నుంచి మార్కెటింగ్‌ సౌకర్యం వరకు డిజిటలైజేషన్‌ చేయనున్నారు. రైతులు అధిక ధర ఉన్నప్పుడు పంటలను విక్రయించుకునేలా నిల్వ చేసుకునే సౌకర్యం కల్పించనున్నారు. రైతు సొసైటీలను కంప్యూటీకరణ చేయనున్నారు. మత్స్యరంగానికి రూ.6 వేల కోట్లు కేటాయింపుల వల్ల పెండింగ్‌లో ఉన్న వారికి రాయితీ యూనిట్ల నిధులు విడుదల కానున్నాయి.

జిల్లాలోని రైతులు: 1,19,978
మత్స్యకార సంఘాలు: 47
తృణధాన్యాలు సాగు చేసే రైతులు: 7,468


మూడేళ్లపాటు నీతి ఆయోగ్‌ కొనసాగింపు..

రైతులకు ఉచితంగా చిరుధాన్యాల విత్తనాల పంపిణీ

దేశంలోనే వెనుకబడిన జిల్లాలను నీతి ఆయోగ్‌ కింద ఎంపిక చేసింది. ఇందులో కుమురం భీం జిల్లా ఉండగా, చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, కార్యచరణ అమలు కోసం ఏటా నీతి ఆయోగ్‌ నిధులు విడుదల చేయనుంది. 2020లో రూ.4.6 కోట్లు, 2021లో రూ.2.15 కోట్లు నిధులు జిల్లాకు వచ్చాయి. వాటితో అంగన్‌వాడీ కేంద్రాల ఆధునికీకరణ, ఆట వస్తువుల పంపిణీ, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రయోగశాలల ఏర్పాట్లు, చిరుధాన్యాలతో పోషకాహరం తయారీ, జిల్లా వాసుల్లో రక్తహీనత నివారణ చర్యలు చేపట్టారు. ఈ తరుణంలో నీతి ఆయోగ్‌ పథకాన్ని మరో మూడేళ్లు కొనసాగిస్తున్నట్లుగా బడ్జెట్లో నిధులు కేటాయించడంపై జిల్లావాసులు హర్షం వ్యక్తం చేశారు.


మెరుగుపడనున్న విద్యాబోధన

కాగజ్‌నగర్‌ పట్టణంలో ఏకలవ్య పాఠశాల భవనాన్ని రూ.32 కోట్ల వ్యయంతో పూర్తి చేశారు. దేశవ్యాప్తంగా 38 వేల మంది ఉపాధ్యాయులను ఈ పాఠశాలల్లో నియమిస్తామని ఆర్థిక మంత్రి అన్నారు. ఈ తరుణంలో కాగజ్‌నగర్‌ ఏకలవ్య పాఠశాలల్లో సరిపడా సిబ్బంది వచ్చే అవకాశం ఉంది. ఇందులో 500 మంది విద్యార్థులు ఆరు నుంచి ఇంటర్‌ వరకు ఇక్కడ చదువుకోవచ్చు.


పొదుపు ద్వారా ఆర్థిక స్వావలంబన

మహిళలు, బాలికల కోసం ప్రత్యేకంగా మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్ పేరుతో కొత్త పథకాన్ని బడ్జెట్లో ప్రవేశపెట్టారు. రెండు సంవత్సరాల కాల వ్యవధికి సంబంధించిన ఈ పథకంలో మహిళలు గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు పొదుపు చేయవచ్చు. వాటికి 7.5 శాతం వడ్డీ లభిస్తోంది. దీన్‌ దయాళ్‌ అంత్యోదయ యోజన, జాతీయ జీవనోపాధి మిషన్‌ పరిధిలో స్వయం సహాయక సంఘాలకు కేటాయింపులు ప్రకటించారు.

జిల్లాలో మహిళా సంఘాల సభ్యులు: 86251
పొదుపు సంఘాలు: 7923
మహిళలు: 2,13,861


ఆవాస్‌ యోజనకు అదనపు కేటాయింపులు

పీఎం ఆవాస్‌ యోజనలో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరం రూ.79 వేల కోట్లు కేటాయించారు. గత సంవత్సరం కంటే 60 శాతం అదనమని ఆర్థికమంత్రి అన్నారు. తెలంగాణలో సైతం ఇళ్లు లేని నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3 లక్షల వరకు ఆర్థిక సాయం చేయాలనే తలంపుతో ఉన్నందున ఈ పథకానికి పీఎం ఆవాస్‌ యోజనలో అందించే ఆర్థిక సాయం (రూ.2.50 లక్షలు) జతచేసి నిలువ నీడ లేని బడుగులు సొంతింటి కల సాకారం చేసుకునే అవకాశం ఉంది.

జిల్లాలో నిర్మిస్తున్న రెండు పడకగదుల ఇళ్లు: 1285
ఇళ్లు లేని నిరుపేదలు: 45,245


సికిల్‌సెల్‌, తలసీమియా నిర్మూలన

జిల్లాలో సికిల్‌సెల్‌, తలసీమియా వ్యాధులు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. గతేడాది ఆగస్టు నెలలో గిరిజన వసతిగృహాల్లోని 13 వేల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. 550 మందికి పైగా సికిల్‌సెల్‌ వ్యాధిగ్రస్థులు బయటపడ్డారు. అవగాహన లేకపోవడం, పోష్టికాహారలోపం వల్ల ఈ వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. ఈ తరుణంలో 2047 వరకు సికిల్‌సెల్‌ వ్యాధిని నిర్మూలించేందుకు 40 సంవత్సరాలోపు ప్రతిగిరిజనుడికి వైద్య పరీక్షలు నిర్వహించి, వ్యాధికి తగిన చికిత్స అందించేలా బడ్జెట్ కేటాయింపులతోపాటు కార్యాచరణ రూపొందించారు. గిరిజన మిషన్‌కు రూ.10 వేల కోట్ల కేటాయింపులతో రహదారులు, మౌలిక వసతులు ఈ ప్రాంతాల్లో కల్పించనున్నారు.

జిల్లాలో గిరిజన జనాభా: 1.33 లక్షలు
పీవీటీజీల సంఖ్య: 45 వేలు
గిరిజన గ్రామాలు: 246


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని