logo

భారం మోయరు.. ప్రసవాలు చేయరు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచాలంటూ ఆరోగ్యశాఖ మంత్రి పదే పదే ఆదేశిస్తూనే ఉన్నారు. కాని జిల్లాలో మాత్రం జీజీహెచ్‌లో తప్పితే ఎక్కడ కూడా ఆశించిన ఫలితాలు రావడం లేదు. 

Published : 02 Feb 2023 02:22 IST

బెల్లంపల్లి..చెన్నూరు ఆసుపత్రుల్లో నిర్లక్ష్యం..
మంచిర్యాల వైద్యవిభాగం, న్యూస్‌టుడే

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచాలంటూ ఆరోగ్యశాఖ మంత్రి పదే పదే ఆదేశిస్తూనే ఉన్నారు. కాని జిల్లాలో మాత్రం జీజీహెచ్‌లో తప్పితే ఎక్కడ కూడా ఆశించిన ఫలితాలు రావడం లేదు. రెండుజిల్లాల భారం మొత్తం మంచిర్యాల జనరల్‌ ఆసుపత్రిపైనే పడుతోంది. ఇక్కడ జరుగుతున్న ప్రసవాలు 50 శాతానికి పైగా ఆసిఫాబాద్‌ జిల్లాకు చెందినవారివే అయినా వచ్చే దారిలో ఉన్న బెల్లంపల్లిలో మాత్రం రోజుకు ఒకటి కూడా కావడం లేదు. అదే బాటలో చెన్నూరు ఆసుపత్రి ఉండగా లక్షెట్టిపేటలోని కేంద్రం మరీ అలంకారప్రాయంగా మారింది. ఒక్కో నెలలో ఒక్క ప్రసవం కూడా జరగడం లేదు. ప్రసూతి వైద్యులు, సదుపాయాల కొరత..  సమస్యలు లేకపోయినా అక్కడి వైద్యులు ప్రసవాలు చేసేందుకు ఇష్టపడటÄం లేదు. ఆయా కేంద్రాలకు వచ్ని గర్బిణులను జీజీహెచ్‌ రిఫర్‌ పంపించడం.. చేతులు దులుపుకోవడం.. ఆనవాయితీగా మారిందని సమచారం.

ప్రైవేటు కంటే అధ్వానం..

జిల్లాలోని ఏ ప్రైవేటు ప్రసూతి ఆసుపత్రులోనైనా నెలకు సాధారణ, శస్త్రచికిత్సలు 15 నుంచి 20 జరుగుతున్నాయి. కొన్ని ఆసుపత్రుల్లో 70-80 కూడా చేస్తున్నారు. ఆయా కేంద్రాలన్నీ ఒకే వైద్యురాలితో కొనసాగుతున్నాయి. మత్తు ఇచ్చే వైద్యులూ ఒకరే ఉంటున్నారు. బెల్లంపల్లి, చెన్నూరు కేంద్రాల్లో సంబంధిత వైద్యులు ఉన్నా ప్రైవేటులో నమోదవుతున్న సంఖ్యను కూడా చేరుకోవడం లేదు. వీటిలో బెల్లంపల్లి సీహెచ్‌సీ నుంచి ఏరియా(వందపడకలు) ఆసుపత్రిగా మారగా చెన్నూరు, లక్షెట్టిపేట సీహెచ్‌సీలు 30 పడకలతో కొనసాగుతున్నాయి. కనీసం నెలలో ఆయా ఆసుపత్రిల్లోని పడకల స్థాయి సంఖ్యను కూడా చేరకపోవడం చూస్తే అక్కడి వైద్యుల పనితీరు ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.

జీజీహెచ్‌ నుంచి వైద్యులను తరలించాలి..

జిల్లా కేంద్రంలోని పెద్దాసుపత్రి  జీజీహెచ్‌గా మారడం.. డీఎంఈకి సంబంధించిన సిబ్బంది వందల సంఖ్యలో రావడంతో ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్న టీవీవీపీ వైద్యులను పూర్తిగా తొలగించి.. ఈ విభాగం పరిధిలోని మూడు(బెల్లంపల్లి, చెన్నూర్‌, లక్షెటిపేట) ఆసుపత్రులకు సర్దుబాటు చేస్తే పరిస్థితిలో మార్పువచ్చే అవకాశం ఉంద. ముఖ్యంగా బెల్లంపల్లిలో వందపడకల ఆసుపత్రితో పాటు ప్రసవాలు పెంచేందుకు అవకాశం ఉండటంతో ఆసిఫాబాద్‌ నుంచి వచ్చే తాకిడిని కొంత తగ్గించవచ్చు. ప్రస్తుతం జీజీహెచ్‌లో టీవీవీపీ, డీఎంఈ సిబ్బందికి కొంత సమన్వయలోపం ఉన్నట్లు తెలుస్తోంది. సమన్వయం, సర్దుబాటుతో అన్నిచోట్ల సేవలు మెరుగుపడతాయి. బాధితులకు కూడా దూరభారం తగ్గుతుందని బాధితులు పేర్కొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని