logo

చేజారుతున్న యువతరంగాలు

ఉమ్మడి జిల్లాలో నిత్యం ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.

Published : 03 Feb 2023 04:48 IST

 డబ్బు మోజులో పడి కటకటాల్లోకి..

* ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన ఓ యువకుడు గంజాయికి బానిసయ్యాడు. తక్కువ సమయంలోనే డబ్బు సంపాదించాలనే ఆశతో గంజాయి అమ్మకాలు మొదలుపెట్టాడు. తీరా పోలీసులకు పట్టుబడి జైలు జీవితం గడుపుతున్నాడు. 25 ఏళ్లు దాటకుండానే కటకటాలు లెక్కించాల్సిన గతి పట్టింది.


* నిర్మల్‌ జిల్లాకు చెందిన ఓ యువకుడు చదువు పేరుతో పట్టణానికి వెళ్లి అక్కడ విదేశీ మహిళతో కలిసి సైబర్‌ నేరాలను ప్రారంభించాడు. మిత్రులను ఆ మోసంలో కలుపుకొన్నాడు. ఒక వ్యక్తిని బెదిరించడంతో కేసు నమోదైంది. పూర్తి వివరాలను సేకరించిన పోలీసులు యువకుడి పాత్ర ఉండటంతో జైలుకు పంపారు.


* మంచిర్యాల జిల్లాకు చెందిన యువకుడు బెట్టింగ్‌ మోజులో పడి లక్షలు ధారపోశాడు. ఆర్థికంగా నష్టపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చాడు.


* ఆదిలాబాద్‌ జిల్లాలోని ఓ పాఠశాలలో ఇటీవల నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా వసతిగృహంలో విద్యార్థులు సిగరెట్లు తెచ్చుకొని తాగుతుండగా ఉపాధ్యాయుడు వారించాడు. పిల్లల తల్లిదండ్రులు మాత్రం ఎందుకు మందలించావని అట్రాసిటీ కేసు నమోదు చేస్తామంటూ బెదిరించారు.


* 17 ఏళ్ల బాలిక ఇన్‌స్టాగ్రాం వినియోగిస్తోంది. ఆమె పేరుతో ఫేక్‌ ఐడీ సృష్టించి సమీప బంధువే వేధింపులకు పాల్పడ్డాడు.  వేధింపులు  భరించలేక  ఆత్మహత్య చేసుకుంది.  కన్నవారికి కన్నీళ్లు మిగిల్చింది.


* తన గదిలో పుస్తకాలతో కుస్తీ పడుతుందని అనుకున్న తల్లిదండ్రులకు ఆమె చరవాణిలో ఒక యువకుడితో చేస్తున్న విషయం తెలిసి వారించారు. తప్పు అని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఆమె అవేమీ పట్టించుకోకుండా ప్రాణాలు తీసుకుంది.


న్యూస్‌టుడే, ఇచ్చోడ, జైనథ్‌: ఉమ్మడి జిల్లాలో నిత్యం ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. పిల్లలకు బంగారు భవిష్యత్తును ఇవ్వాలని, ఎంత ఖర్చుకైనా వెనుకాడని తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్మూ చేస్తూ జీవితాన్ని చేజేతులారా నాశనం చేసుకుంటున్నారు. తాత్కాలిక ఆనందాల కోసం బంగారు భవిష్యత్తును పణంగా పెడుతున్నారు.


మత్తుతో చిక్కులు

జిల్లాలో మత్తుపదార్థాల రవాణా అడ్డగోలుగా సాగుతోంది. అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండటంతో గంజాయి సాగు కొనసాగుతోంది. యువతకు ఇది సులభంగా దొరుకుతోంది.
పేద, ధనిక తేడా లేకుండా అంతా దీనికి బానిసై నేరాల బాట పడుతున్నారు. పట్టుమని 25 ఏళ్లు కూడా నిండని యువతే ఇందులో ఉండటం విచారకరం.


‘చెర’వాణిలో..

ప్రపంచ పరిజ్ఞానాన్ని అరచేతిలో తెలుసుకునే అవకాశం చరవాణితో కలిగింది. అదే స్థాయిలో తప్పుదోవ పట్టేందుకు సాధనంగానూ మారింది. చెడు కోసం వినియోగించే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. కరోనా తర్వాత ఆన్‌లైన్‌ తరగతుల పేరుతో పిల్లలకు చరవాణులు పరిచయం అయ్యాయి. అదే పిల్లల్లో పెద్ద మార్పులను తీసుకొచ్చింది. సామాజిక మాధ్యమాలు, ఆశ్లీల వీడియోలు, ఆన్‌లైన్‌ గేమ్స్‌ బాట పట్టించాయి.


సమస్య తీవ్రత పెరిగింది

డా.ఓం ప్రకాష్‌, మానసిక వైద్యులు, రిమ్స్‌

గతంతో పోలిస్తే మత్తుపదార్థాల వల్ల బాధపడుతూ వచ్చే కేసుల తీవ్రత పెరిగింది. అందులో యువతే ఎక్కువగా ఉంటున్నారు. మద్యం, గంజాయి ఎక్కువగా అందుబాటులో ఉండటంతో సులభంగా బానిసవుతున్నారు. గంజాయి సేవిస్తే వ్యక్తిలో తీవ్ర స్థాయిలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఇలాంటి వారికి మత్తుకు తప్ప ఇతర ఎలాంటి ఆలోచనలు ఉండవు. ఆరోగ్యం క్షీణిస్తుంది. చరవాణితో ఇబ్బందులు పడే వారు కూడా ఎక్కువగా వస్తున్నారు. అర్ధరాత్రి వరకు చూడడం, నిద్రలేకపోవడం, చికాకు పడడం, చదువుపై దృష్టి సారించడం లేదని పోషకులు చెబుతున్నారు. ఇలాంటి సమస్యల పరిష్కారానికి ప్రధానంగా ఆదిలోనే తల్లిదండ్రులు గుర్తించి, వాటిని దూరం చేయిస్తే ఇబ్బందులు తీరే ఆస్కారం ఉంటుంది.


ఒక్కోసారి భయమేస్తుంది

ఓ కళాశాల ప్రిన్సిపల్‌ మనోవేదన

పిల్లల్లో గతంలో భయం, బాధ్యత కనిపించేవి. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. కనీసం వారిని వారించే పరిస్థితి కనిపించడం లేదు. కరోనా తరువాత పిల్లల పరిస్థితిలో పూర్తి మార్పులు వచ్చాయి. చరవాణులో వసతి గృహాలకు తెచ్చుకుంటున్నారు. హాస్టళ్లను నిర్వహించడం కూడా కష్టతరంగా మారింది. వారికి ఏ తీరుగా చెప్పినా పట్టించుకోవడం లేదు. ఇదే విషయం తల్లిదండ్రులకు చెబుతున్నాం. పోషకులు కొంత దృష్టి సారించి వారిలో మార్పులు తీసుకొస్తే బాగుంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని