logo

పక్షులు కిలకిల.. వన్యప్రాణుల కళకళ

పక్షుల కిలకిలరావాలు... వన్యప్రాణుల ఉరుకులు, పరుగుల సవ్వడితో ప్రాణహిత కృష్ణజింకల అభయారణ్యం కళకళలాడుతోంది.

Published : 03 Feb 2023 04:48 IST

కృష్ణ జింకల అభయారణ్యంలో పెరుగుతున్న సంతతి

రొయ్యలపల్లిలో ఏర్పాటు చేసిన గడ్డిక్షేత్రం

కోటపల్లి, (చెన్నూరు), న్యూస్‌టుడే: పక్షుల కిలకిలరావాలు... వన్యప్రాణుల ఉరుకులు, పరుగుల సవ్వడితో ప్రాణహిత కృష్ణజింకల అభయారణ్యం కళకళలాడుతోంది. గతంలో తాగునీరు, ఆహారం కొరతతో పాటు వేటగాళ్లతో ఉండే ముప్పుతో ప్రాణభయంతో విలవిలలాడే మూగ జీవాలు ప్రస్తుతం వాటి ఆవాసాల్లో స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. అడుగడుగునా రక్షణ, ఆహారం, వసతి తదితర సౌకర్యాలు మెరుగు పడటంతో వాటి వృద్ధి గణనీయంగా పెరుగుతోంది. జిల్లా సరిహద్దులో మణిహారంగా గోదావరి, ప్రాణహిత నదుల పరివాహకంగా ఉన్న ప్రాణహిత కృష్ణ జింకల అభయారణ్యం వన్యప్రాణి ప్రేమికులకు కనువిందు చేస్తోంది.  


నిఘానేత్రాలతో రక్షణ

వన్యప్రాణుల రక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించి కంపా నిధులతో పలు అభివృద్ధి పనులు చేపడుతుండటంతో వాటి సంతతి క్రమేపీ పెరుగుతోంది. చెన్నూరు సబ్‌ డివిజన్‌ పరిధిలోని చెన్నూరు, కోటపల్లి, వేమనపల్లి అటవీ రేంజీల్లో శాకాహార జంతువుల కోసం ప్రత్యేకంగా గడ్డిక్షేత్రాలను అభివృద్ధి చేసి ఆహారం కొరత తీరుస్తున్నారు. మరోవైపు సహజ సిద్ధంగా ఉన్న కుంటలతో పాటు ప్రత్యేకంగా మరికొన్ని నూతనంగా నిర్మించి 24 గంటల పాటు నీరు అందుబాటులో ఉంచుతుండటంతో వన్యప్రాణులకు దాహార్తి తీరుతోంది. మహారాష్ట్ర తాడోబా అడవుల నుంచి కాగజ్‌నగర్‌ మీదుగా మరోవైపు గడ్చిరోలి జిల్లా సిరొంచా అటవీ డివిజన్‌ నుంచి పులులు రాకపోకలు సాగిస్తూ ఇక్కడ ఆవాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాయి. వన్యప్రాణులు అటవీ ప్రాంతం దాటి బయటికి రాకుండా రక్షణ కవచాలు ఏర్పాటు చేయడంతో పాటు అనేక చోట్ల సీసీకెమెరాలు ఏర్పాటు చేసి అధికారులు అనునిత్యం పర్యవేక్షిస్తున్నారు.


పెరుగుతున్న సంతతి

చెన్నూరు సబ్‌ డివిజన్‌ పరిధిలోని అడవుల్లో పులుల సంచారం పెరగడంతో వాటికి రక్షణ కల్పించడమే కాకుండా శాకాహార జంతువుల పెంపుతో ఆహారం కొరత తీర్చేందుకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా సరిహద్దులోని సుమారు 13,600 హెక్టార్ల పరిధిలో ప్రాణహిత కృష్ణజింకల అభయారణ్యం విస్తరించి ఉంది. ఇందులో పలు రకాల మాంసాహార జంతువులతో పాటు శాకాహార జంతువులు ఉన్నాయి. కృష్ణజింకలు, చుక్కల దుప్పులు, కొండగొర్రెలు, కుందేళ్లు, సాంబర్లు, మనువోతులు, కనుజులు, నెమళ్లు, అటవీపందులు తదితర మాంసాహార, శాకాహార జంతువులతో అభయారణ్యం తొణికిసలాడుతోంది.

పులి (దాచినచిత్రం)

నీలుగాయి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని