logo

ఐటీ టవర్‌కు రూ. 40 కోట్లు మంజూరు

ఆదిలాబాద్‌ పట్టణంలో ఐటీ టవర్‌ భవన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ఇప్పటికే స్థల ఎంపిక పూర్తికాగా తాజాగా భవన సముదాయానికి నిధులు కేటాయించారు.

Published : 03 Feb 2023 04:48 IST

ఐటీ టవర్‌ భవనం నమూనా చిత్రం

న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ పట్టణం: ఆదిలాబాద్‌ పట్టణంలో ఐటీ టవర్‌ భవన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ఇప్పటికే స్థల ఎంపిక పూర్తికాగా తాజాగా భవన సముదాయానికి నిధులు కేటాయించారు. నిర్మాణ బాధ్యతను తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ)కి అప్పగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

స్థానికంగానే ఉద్యోగ కల్పన కోసం ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ ఐటీ సేవలు విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆసక్తి చూపుతున్న తరుణంలో ఉమ్మడి జిల్లాలోనే ఆదిలాబాద్‌లో మొదటగా ఈ ఐటీ టవర్‌ మంజూరైంది. ఇది స్థానిక నిరుద్యోగులకు ఊరటనివ్వనుంది. ఇప్పటికే బీడీఎన్‌టీ, ఎన్‌టీటీ రెండు ప్రైవేటు ఐటీ సంస్థల ఆధ్వర్యంలో పట్టణంలోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో 150 మంది ఇంజినీరింగ్‌ పట్టభద్రులతో కార్యాలయం కొనసాగుతోంది. స్థానికంగా ఉన్నవారికే ఇందులో ఉద్యోగాలు కల్పించారు. గతంలో ఐటీ మంత్రి కేటీఆర్‌ ఈ భవనాన్ని సందర్శించిన సమయంలో విద్యుత్తు, మరమ్మతులు, ఇతర సౌకర్యాల కోసం రూ.1.50 కోట్లు విడుదల చేశారు. మంత్రి ఇచ్చిన హామీ మేరకు తాజాగా కొత్త భవన నిర్మాణానికి నిధులు విడుదలయ్యాయి.


మూడెకరాల స్థలంలో..

జిల్లా కేంద్రంలోని బట్టిసావర్గాం శివారు పరిధిలోకి వచ్చే సర్వే నెం.72లో ఐటీ టవర్‌ నిర్మాణానికి మూడెకరాల స్థలం కేటాయించారు. రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో విక్రయించిన ప్లాట్లకు ఆనుకొనే ఈ స్థలం ఉంటుంది. మూడెకరాల విశాలమైన స్థలంలో 48,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. జి+5 తరహాలో రూ.40 కోట్ల వ్యయంతో అన్ని హంగులతో ఈ భవనం రూపుదిద్దుకోనుంది.


స్థానికంగానే ఉపాధి

మూడు షిఫ్టుల వారీగా దాదాపు 2 వేల మంది వరకు పనిచేసే సామర్థ్యం ఉండేలా భవనం నిర్మించనున్నారు. వివిధ కంపెనీలను ఇక్కడ ఆహ్వానించేందుకు ఇది వరకే పట్టణంలో ఓ సమావేశాన్ని సైతం ఏర్పాటు చేశారు. స్థానికంగా పుట్టి పెరిగి ఇతర ఇతర దేశాల్లో ఐటీ కంపెనీలు నిర్వహిస్తున్న వారిని ఇక్కడికి ఆహ్వానిస్తున్నారు. సామర్థ్యం ఆధారంగా ఒక కంపెనీ 50 మందికి ఉద్యోగావకాశం కల్పిస్తే మరో కంపెనీ 100 వరకు ఉద్యోగాలు ఇస్తుంది. పది నుంచి 20 వరకు కంపెనీలు వస్తేనే లక్ష్యం పూర్తవుతుందని అంచనా. తద్వారా స్థానికంగా ఉన్న ఇంజినీరింగ్‌ పట్టభద్రులకు ఇక్కడే ఉద్యోగం చేసుకునే వెసులుబాటు లభిస్తుంది.


యువతకు ఉజ్వల భవిత

- జోగు రామన్న, ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే

స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పన కోసం కోరిన వెంటనే ఐటీ టవర్‌ మంజూరు చేసినందుకు మంత్రి కేటీఆర్‌కు ఎప్పటికి రుణపడి ఉంటాం. టవర్‌ నిర్మాణం ద్వారా ఐటీ రంగంలో యువతకు ఉజ్వల భవిష్యత్తు అందుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని