logo

పుడమి.. తల్లడిల్లి..!

నీటి వనరులు ఉన్న జిల్లాలో మిగులు జలాలు పుష్కలంగా ఉన్నాయని అవసరానికి మించి వాడుతుండటం భవిష్యత్తు ప్రమాదాన్ని సూచిస్తోంది. పొదుపు చర్యలు చేపట్టక.. అను‘మతి’లేకుండా ఇష్టారీతిన బోర్ల తవ్వకాలు చేపడ్తున్నారు.

Updated : 03 Feb 2023 06:01 IST

అనుమతి లేకుండా ఇష్టారీతిన బోర్ల తవ్వకాలు

నిర్మల్‌ సమీపంలో బోరు తవ్వకం

నిర్మల్‌, న్యూస్‌టుడే : నీటి వనరులు ఉన్న జిల్లాలో మిగులు జలాలు పుష్కలంగా ఉన్నాయని అవసరానికి మించి వాడుతుండటం భవిష్యత్తు ప్రమాదాన్ని సూచిస్తోంది. పొదుపు చర్యలు చేపట్టక.. అను‘మతి’లేకుండా ఇష్టారీతిన బోర్ల తవ్వకాలు చేపడ్తున్నారు. సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నాం.. పరుగెత్తే నీటిని ఆపడానికి అవసరమైన కృషి చేస్తున్నాం.. నీటి ఎద్దడి రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటాం.. వాల్టాచట్టాన్ని అమలు చేస్తున్నామంటూ పాలకులు, అధికారులు ప్రచారం చేస్తున్నా క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. జిల్లాలో 47 శాతం నీటిని వినియోగిస్తుండగా.. 53 శాతం మిగులు జలాలు ఉండటం సంతోషకరమైనా.. రోజురోజుకు వినియోగం పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో ఆర్నెళ్ల నుంచి ఒక్క బోరు తవ్వడానికి అనుమతి తీసుకోకుండా ప్రతి నిత్యం పదుల సంఖ్యలో బోర్ల తవ్వకాలతో పుడమి తల్లఢిల్లుతోంది.


నిబంధనలు గాలికి..

పంట పొలాల్లో వేసే బోర్ల తవ్వకాలకు కచ్చితంగా అనుమతి తీసుకోవాలన్న నిబంధన ఉన్నా.. ఎక్కడా పాటించడం లేదు. ఒక బోరు తవ్వాలంటే ముందుగా సంబంధిత మండలాల తహసీల్దార్ల వద్ద అనుమతి తీసుకోవాలి. బోరు తవ్వకం ప్రాంతంలో నీరుందో లేదో తెలుసుకోవడానికి భూగర్భజల శాఖ అధికారులను సంప్రదించాలి. ఈ రెండు శాఖల అధికారుల అనుమతులు తీసుకున్న తర్వాత బోరు తవ్వాలి. జిల్లాలో ఇదెక్కడా అమలు కావడం లేదు. బోరు తవ్వకం కోసం ఒక్క దరఖాస్తు కూడా రాలేదని ఆ శాఖల అధికారులు తేల్చిచెప్పారు.


నాలుగు మండలాల్లో పొంచి ఉన్న ప్రమాదం

జిల్లాలోని ముథోల్‌, భైంసా, లోకేశ్వరం, నిర్మల్‌ గ్రామీణ మండలాల్లో నీటి వినియోగం ఎక్కువగా జరుగుతున్నట్లు భూగర్భజలశాఖ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. 70 శాతం కంటేె తక్కువగా నీటిని వినియోగిస్తే సురక్షితమైనా ఈ నాలుగు మండలాల్లో 90 శాతం వరకు నీటిని వాడతుండటం భవిష్యత్తు ప్రమాదాన్ని సూచిస్తోంది.  భూగర్భ జలాలు ఎక్కువగా వినియోగం అవుతున్న ఈ మండలాల్లో రానున్న రోజుల్లో నీటి పొదుపు చర్యలు పాటించడంతోపాటు వృథా నీటిని భూమిలోకి ఇంకించే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.


బోరుబావులపై 55 వేల ఎకరాల్లో సాగు..

యాసంగిలో జిల్లాలో 1.70 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగుచేస్తున్నారు. ఇందులో 55 వేల ఎకరాల్లో బోరుబావులపై ఆధారపడి పండిస్తున్నారు. నిరంతర విద్యుత్తు సరఫరా జరుగుతుండటంతో నీటి వినియోగం ఎక్కువ అవుతోంది. చాలా ప్రాంతాల్లో రైతులు అవసరం లేకుండా పంపుసెట్లు నడిపిస్తున్నారు. ఒకవేళ అవసరం లేకుండా మోటారు నిలిపివేస్తే ఇక్కడి నీటి ఊటలు పక్కనున్న బావిలోకి వెళ్లిపోయే అవకాశం ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నిరంతర ఉచిత విద్యుత్తు అందుతుండటంతో రాత్రి సమయాల్లో నీటి వినియోగం ఎక్కువగా జరుగుతుండటంతో భవిష్యత్‌లో నీటి ముప్పును సూచిస్తోంది. జిల్లాలో 53 వేల ఆటోస్టార్టర్లు ఉండగా.. 20 వేల మంది రైతులు ఆ స్టార్టర్ల స్వచ్ఛందగా తొలగించినా.. ఇంకా 33 వేల వరకు ఉండటంతో అవసరం లేకున్నా నీటిని ఉపయోగిస్తున్నారు. దీంతో భూగర్భజలాలు అడుగంటుపోతున్నాయి. నీరుందని వృథా నీటిని భూమిలోకి ఇంకించని కారణంగా మండుతున్న ఎండల కారణంగా ఆవిరి రూపంలో 30 శాతం నీరు కనుమరుగవుతోంది. ప్రస్తుతం ప్రస్తుతం 6.95 ఉన్న భూగర్భజలం మేనెలాఖరు వరకు 10 నుంచి 12 మీటర్లకు పడిపోయే ప్రమాదం ఉందని భూగర్భజలశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకుంటే కొంతవరకైనా నీటి సమస్య నుంచి బయటపడే అవకాశం ఉందని చెబుతున్నారు.


కొత్తగా బోరుబావులు తవ్వొద్దు

ఓ వైపు ఎండలు మండుతుండటంతో పంటలకు నీరు ఎక్కువ అవసరం పడుతుంది. ఈ క్రమంలో భూగర్భజలాలు పడిపోవడం సహజం. వానాకాలంలో వర్షంనీటిని ఇంకించని కారణంగా భూగర్భంలోని నీటి పొరల్లో నీటి లభ్యత తగ్గిపోవడంతో బోర్లలో నీరు రావడం నిలిచిపోతుంది. జిల్లాలో పడిపోయిన భూగర్భ జలమట్టంతో వ్యవసాయ బోరుబావులు ఏకధాటిగా నడిపితే 50 శాతానికిపైగా బోరుబావులు ఖాళీ అవుతాయి. రైతులు ఎవరూ కొత్తగా బోరుబావులు తవ్వించి ఆర్థికంగా నష్టపోవద్దు. ఈ వేసవిలో ప్రతి ఒక్కరూ తమ పంట పొలాల్లో నీటి గుంటలు నిర్మించుకుంటే రానున్న వానాకాలంలో వర్షం నీరు నిల్వ చేసుకునే వీలుండటంతో భూగర్భజలాలు సమృద్ధిగా పెరిగి సాగునీటికి ఇబ్బందులు ఉండవు.

శ్రీనివాసబాబు, ఉప సంచాలకుడు, భూగర్భజలశాఖ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని