logo

బోధనకు దూరంగా భాషా పండితులు

బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పదో తరగతి విద్యార్థుల చదువులకు ప్రతిబంధకంగా తయారైంది.

Updated : 04 Feb 2023 06:37 IST

పది విద్యార్థులపై తీవ్రప్రభావం

సంబంధిత ఉపాధ్యాయుడు రాక ఇచ్చోడలో సొంతంగా చదువుకుంటున్న పదోతరగతి విద్యార్థులు

న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ పాలనాప్రాంగణం: బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పదో తరగతి విద్యార్థుల చదువులకు ప్రతిబంధకంగా తయారైంది. వార్షిక పరీక్షలు సమీపిస్తున్న సమయంలో బదిలీ ప్రక్రియతో ఉపాధ్యాయులు బోధనపై దృష్టి సారించని పరిస్థితి నెలకొనడం ఫలితాలపై ప్రభావం చూపుతుందన్న భయం వెంటాడుతోంది.

వేసవిలో జరపాల్సిన బదిలీ, పదోన్నతుల ప్రక్రియకు ప్రభుత్వం కిందటి నెల 28 నుంచి శ్రీకారం చుట్టింది. అప్పటి నుంచి పాఠశాల ఎలాగూ వదులుతున్నామని కొందరు, పదోన్నతి వస్తుందని మరికొందరు, బదిలీ అయితే ఎక్కడికి వెళ్తామని భావనలో ఇంకొందరు ఉండటం పాఠశాలల్లో బోధన పూర్తిగా గాడితప్పింది. మరోవైపు పదోతరగతి పరీక్షలు ఏప్రిల్‌ 3 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికీ శతశాతం పాఠ్యప్రణాళిక పూర్తిచేయలేదు. ఉదయం, సాయంత్రం పూట విద్యార్థులకు రోజుకో సబ్జెక్టు చొప్పున ప్రత్యేక పునశ్చరణ తరగతులు అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి. సరిపడా సబ్జెక్టు టీచర్లు లేక సర్దుబాటు చేసి పది విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న సమయంలో బదిలీ ప్రక్రియకు తెరలేపడంతో ఉపాధ్యాయులు దరఖాస్తులు, పరిశీలన, అభ్యంతరాల పేరిట డీఈవో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఇంకోవైపు పదోన్నతులలో తమకు అవకాశం ఇవ్వలేదనే ఆవేదనతో భాషా పండితులు 9, 10వ తరగతులకు బోధించడం లేదు. ఫలితంగా పదోతరగతి విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.


నిరసన బాట

ఆదిలాబాద్‌ పట్టణంలోని కొలిపుర ఉన్నత పాఠశాలలో తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు తాము పాఠాలు చెప్పమని అక్కడి హెచ్‌ఎంకు వినతిపత్రం ఇస్తున్న తెలుగు, హిందీ పండితులు వీరు. జిల్లాలో 119 మంది తెలుగు పండితులు 106 హిందీ, ఆరుగురు ఉర్దూ, ముగ్గురు మరాఠీ పండితులు పదో తరగతి బోధనకు దూరంగా ఉంటూ నిరసనబాట పట్టారు.


అడ్డంకిగా బదిలీ ప్రక్రియ

ఉపాధ్యాయ బదిలీ, పదోన్నతుల షెడ్యూల్‌ విడుదల చేయడంతో ఉపాధ్యాయులంతా అదే పనిలో నిమగ్నమయ్యారు. ఆన్‌లైన్‌లో ప్రక్రియ అని చెబుతున్నా ధ్రువపత్రాల పరిశీలన, అభ్యంతరాల కోసం ఉపాధ్యాయులు విద్యాశాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.


పరిమిత బోధన

ఇచ్చోడ మండలం జిల్లా పరిషత్తు సెకండరీ ఉర్దూ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు తెలుగు బోధిస్తున్న ఉపాధ్యాయుడు వివేక్‌ భవాని. రాష్ట్ర ఉపాధ్యాయ పండిత పరిషత్తు జిల్లా అధ్యక్షుడైన ఈయన మూడురోజులుగా పదో తరగతి విద్యార్థులకు బోధన చేయడం ఆపేశారు. ఈయన ఒక్కరే కాదండోయ్‌ జిల్లాలో 105 పాఠశాలల్లో పనిచేస్తున్న 234 మంది తెలుగు, హిందీ, ఉర్దూ, మరాఠీ భాషా పండితులు మూడురోజులుగా పదోన్నతులలో తమకు అవకాశం ఇవ్వలేదని ఎనిమిదో తరగతి వరకే పాఠాలు బోధిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు