logo

నిరాశ పరిచిన రైల్వే బడ్జెట్

ఆదిలాబాద్‌ జిల్లాకు రైల్వే బడ్జెట్లో కేంద్రం మళ్లీ మొండి చేయే చూపించింది. ఆదిలాబాద్‌ - ఆర్మూర్‌ రైలు మార్గం నిర్మాణానికి నిధులు ఈ ఏడాదైనా కేటాయిస్తారని జిల్లావాసులు ఆశపడ్డారు.

Updated : 04 Feb 2023 06:37 IST

ఊసే లేని ఆదిలాబాద్‌ - ఆర్మూర్‌ మార్గం

ఎదులాపురం, న్యూస్‌టుడే : ఆదిలాబాద్‌ జిల్లాకు రైల్వే బడ్జెట్లో కేంద్రం మళ్లీ మొండి చేయే చూపించింది. ఆదిలాబాద్‌ - ఆర్మూర్‌ రైలు మార్గం నిర్మాణానికి నిధులు ఈ ఏడాదైనా కేటాయిస్తారని జిల్లావాసులు ఆశపడ్డారు. జిల్లా నుంచి భాజపా తరఫున ఎన్నికైన ఎంపీ సోయం బాపురావు సైతం ఆర్మూర్‌ - ఆదిలాబాద్‌ లైన్‌కు నిధులు కేటాయించాలని రైల్వే మంత్రి, అధికారులను కలిసి విన్నవించారు. ఈ బడ్జెట్లో కచ్చితంగా ఈ రైలు మార్గం నిర్మించటానికి నిధులు మంజూరవుతాయని భరోసా కల్పించారు. కానీ దీని ప్రస్తావన బడ్జెట్లో లేకపోవటంతో తీరని కలగానే మిగిలింది.  ఈ లైన్‌ మంజూరై పూర్తయితే జిల్లావాసులకు హైదరాబాద్‌ వెళ్లటానికి దూరభారం తగ్గుతుంది. గుడిహత్నూర్‌, ఇచ్చోడ, నేరడిగొండ, బజార్‌ హత్నూర్‌ మండలవాసులకు రైలు మార్గం సౌకర్యం కలిగేది. ఇదిలా ఉండగా ఆదిలాబాద్‌కు కనీసం ఏ ఒక్క రైలును సైతం ప్రకటించలేదు. ఆదిలాబాద్‌ పట్టణంలో నిర్మించనున్న రెండు రైల్వే వంతెనలకు రాష్ట్ర ప్రభుత్వం వాటాను సైతం కేంద్రమే భరిస్తుందని నాయకులు ప్రకటనలు చేశారు. కానీ ఈ నిధుల కేటాయింపు ప్రస్తావనే లేదు. కేవలం 2017-18 సంవత్సరంలో రూ.325 కోట్లతో మంజూరైన 246 కిలో మీటర్ల దూరానికి పింపల్‌కుట్టి-ముద్కేడ్‌, పర్భని, పర్లి, వైజానాథ్‌ సెక్షన్‌ల విద్యుదీకరణకు రూ.132.33 కోట్లు కేటాయించి చేతులు దులుపుకొంది. ఈ సెక్షన్‌లో ఇప్పటికే పింపల్‌కుట్టి-కోసాయి మధ్య 44 కిలో మీటర్ల దూరం విద్యుదీకరణ పూర్తయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని