logo

గంగాపూర్‌ జాతరకు వేళాయె...

జిల్లాలో పేరొందిన రెబ్బెన మండలం గంగాపూర్‌ వాగు శివారులోని శ్రీబాలాజీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం నుంచి ఈ నెల 6వ తేదీ వరకు జాతర జరగనుంది.

Published : 04 Feb 2023 04:28 IST

వేంకటేశ్వర స్వామి, అలివేలుమంగ, పద్మావతి విగ్రహాలు

రెబ్బెన, న్యూస్‌టుడే: జిల్లాలో పేరొందిన రెబ్బెన మండలం గంగాపూర్‌ వాగు శివారులోని శ్రీబాలాజీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం నుంచి ఈ నెల 6వ తేదీ వరకు జాతర జరగనుంది. ప్రతి సంవత్సరం మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని మూడురోజుల పాటు నిర్వహించే జాతరలో రెండో రోజును భక్తులు పవిత్రంగా భావిస్తారు. భక్తుల సౌకర్యార్థం ఆసిఫాబాద్‌, మంచిర్యాల ఆర్టీసీ డిపోల నుంచి అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికీ కొందరు భక్తులు ఎడ్లబండ్లపై జాతరకు రావడం జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

మండలానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని ప్రకృతి ఓడిలో వెలిసిన శ్రీబాలాజీ వేంకటేశ్వరస్వామి ఆలయం 16వ శతాబ్దానికి పూర్వం గంగాపూర్‌ గ్రామానికి చెందిన విశ్వబ్రాహ్మణ కులస్థుడు ముమ్మడి పోతాజీ నిర్మించినట్లు పూజారులు తెలిపారు. పోతాజీ చిన్నతనం నుంచి బాలాజీ వేంకటేశ్వర స్వామిని భక్తితో కొలుస్తూ ఏటా మాఘశుద్ధ పౌర్ణమి రోజు తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి కాలినడకన వెళ్లి మొక్కులు సమర్పించుకునేవారు. పోతాజీకి వయసు పైబడటంతో పాటు అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఒక సంవత్సరం స్వామి దగ్గరకు వెళ్లలేక తీవ్ర మనోవేదనకు గురయ్యారు. అతని బాధను చూసిన స్వామివారు ఒకరోజు రాత్రి పోతాజీకి కలలో దర్శనమిచ్చారు. గంగాపూర్‌ గ్రామ పొలిమేరలోని గుట్ట ముందు భాగంలో ఆలయం నిర్మించాలని, అక్కడ నేను నీకోసం.. నీవంటి మరి కొందరు భక్తుల కోసం ప్రతి సంవత్సరం మాఘశుద్ధ పౌర్ణమి రోజు దర్శనమిస్తానని చెప్పాడని ప్రతీతి. దాతల సహకారంతో ఆలయ నిర్మాణం పనులు చేపట్టారు. వాగును ఆనుకొని ఉన్న గుట్ట మధ్య భాగంలో ఒక గుహను తొలవగా యాదృచ్ఛికంగా అక్కడ ప్రకృతి రహస్యంగా ఉన్న శ్రీబాలాజీ వేంకటేశ్వర స్వామి వారి పట్టెనామాలు ఆయనకు దర్శనమిచ్చాయి. పర్వతం మొదటి భాగంలో గోవిందరాజుల విగ్రహాలు, స్వామివారి వైపు శివాలయం, పక్కనే వాయుపుత్ర శ్రీహనుమాన్‌, గరుఢ విగ్రహాలున్నాయి. ఆలయం ముందు భాగంలో పోతాజీ సమాధి నిర్మించారు.

నేడు కల్యాణ మహోత్సవం: శ్రీబాలాజీ వేంకటేశ్వరస్వామి జాతర ప్రారంభమయ్యే శనివారం రోజున కల్యాణ మహోత్సవం ఉదయం 11.15 నిమిషాలకు నిర్వహించనున్నారు.

5న రథోత్సవం: రథోత్సవం ఈ నెల 5న సాయంత్రం 6.15 నిమిషాలకు ఉంటుంది.

ఏర్పాట్లు పూర్తి..: భక్తుల కోసం తాగునీటి సౌకర్యం, మూత్రశాలలు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. పారిశుద్ధ్యం లోపించకుండా సుమారు 60 మంది సిబ్బందిని నియమించారు. ఎస్పీ సురేష్‌కుమార్‌ పర్యవేక్షణలో ఏఎస్పీ, ఒక డీఎస్పీ, 10 మంది సీఐలు, 25 మంది ఎస్సైలతో పాటు 200 మంది సిబ్బందితో బందోస్తు ఏర్పాటు చేయనున్నారు.

ఏర్పాట్లు చేసిన అధికారులు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు