logo

పట్టాలెక్కనున్న మూడోలైను పనులు

ఉత్తరాది రాష్ట్రాలను అనుసంధానించే కాజీపేట- బల్లార్ష రైల్వేలైన్‌ అత్యంత రద్దీగా ఉంటుంది. ఈ మార్గంలో మూడోలైన్‌ పనులను దశాబ్దం క్రితమే ప్రారంభమయ్యాయి.

Published : 04 Feb 2023 04:28 IST

తాజా కేటాయింపులతో పుంజుకోనున్న వేగం

కుమురం భీం జిల్లాలో కొనసాగుతున్న కాజీపేట- బల్లార్ష మూడో రైల్వేలైన్‌ నిర్మాణాలు

ఈనాడు డిజిటల్‌, ఆసిఫాబాద్‌: ఉత్తరాది రాష్ట్రాలను అనుసంధానించే కాజీపేట- బల్లార్ష రైల్వేలైన్‌ అత్యంత రద్దీగా ఉంటుంది. ఈ మార్గంలో మూడోలైన్‌ పనులను దశాబ్దం క్రితమే ప్రారంభమయ్యాయి. కరోనా కారణంగా రెండేళ్ల పాటు పనుల పురోగతిలో అంతరాయం కలిగింది. తాజాగా కేంద్ర బడ్జెట్లో రూ.450.86 కోట్లు కేటాయించడం వల్ల పనులు వేగం పుంజుకోనున్నాయి. 235 కి.మీ. పొడవునా ఉండే ఈ లైన్‌ ప్రస్తుతం మంచిర్యాల జిల్లా మందమర్రి నుంచి ఉప్పల్‌ వరకు, మహారాష్ట్ర మానిక్‌ఘర్‌ నుంచి వీరూర్‌ వరకు 110 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. వీరూర్‌ నుంచి రెబ్బెన మండలంలోని ఆసిఫాబాద్‌ రోడ్‌ వరకు 125 కి.మీ. మేర పనులు సాగుతున్నాయి.

2015-16 బడ్జెట్లో ఈ మార్గానికి రూ.2063 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం కేటాయించిన నిధులతో రాఘవపురం- పొట్కపల్లి, వీరూర్‌- మానిక్‌ఘర్‌ మార్గంలో విద్యుత్తు లైన్‌ పనులు చేయనున్నారు. 2021-22 బడ్జెట్లో ఈ మార్గానికి రూ.485 కోట్లు కేటాయించారు. అటవీ అనుమతులు, టైగర్‌ రిజర్వ్‌, కొవిడ్‌ కారణంగా కుమురం భీం జిల్లాలో పనులు ఆలస్యమయ్యాయి. కాజీపేట- బల్లార్ష మార్గంలో ఉన్న రెండో రైల్వే లైన్‌ నిరంతరం రద్దీగా ఉండడంతో ప్రయాణికులు గమ్యస్థానానికి చేరడానికి గంటల తరబడి ఆలస్యం అవుతోంది. సింగరేణి బొగ్గును తీసుకెళ్లే రైళ్లు, సిమెంటు గూడ్సు, ప్యాసింజర్‌ రైళ్లు ఈ ప్రాంతం నుంచి వెళ్లడానికి సిగ్నల్‌ కోసం చాలా సమయం వేచి చూడాల్సి వస్తోంది. తాజాగా నిధుల కేటాయింపుతో పనులు వేగంపై ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు