logo

అధికారుల నిర్లక్ష్యం.. సేవలకు అంతరాయం

అధికారుల నిర్లక్ష్యం స్టాఫ్‌నర్సులకు శాపంగా మారింది. ఎనిమిది నెలలుగా వారు విధులు నిర్వహిస్తున్నా వేతనాలు చెల్లించకపోవటంతో కుటుంబ పోషణ, పిల్లల చదువులు భారమై తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు.

Published : 05 Feb 2023 04:23 IST

ఓసీఎస్‌ స్టాఫ్‌నర్సుల సమ్మెతో రిమ్స్‌లో ఇబ్బందులు

సమ్మె చేస్తున్న స్టాఫ్‌నర్సులు

న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ వైద్య విభాగం: అధికారుల నిర్లక్ష్యం స్టాఫ్‌నర్సులకు శాపంగా మారింది. ఎనిమిది నెలలుగా వారు విధులు నిర్వహిస్తున్నా వేతనాలు చెల్లించకపోవటంతో కుటుంబ పోషణ, పిల్లల చదువులు భారమై తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. విధి లేని పరిస్థితుల్లో వారం రోజులుగా నిరవధిక సమ్మె బాటపట్టారు. దీంతో రిమ్స్‌ ఆసుపత్రిలో రోగుల సేవలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఉన్న సిబ్బందితో సేవలను కొనసాగిస్తుండటంతో వారిపై పని భారం పెరిగింది.
2018 మేలో 544 ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా 300 ఓసీఎస్‌(అదర్‌ కాంట్రాక్ట్‌ స్కీమ్‌) పథకంలో 49 మందిని నియమించారు. ఏటా కొనసాగింపు ఉత్తర్వులు ఇస్తూ వేతనాలు చెల్లించారు. ఎనిమిది నెలల కిందట ఆ ఉత్తర్వులు ఇవ్వకపోగా డీఎంఈ పోర్టల్‌ నుంచి వారి పేర్లు తొలగించటంతో జీతాలు అందని పరిస్థితి నెలకొంది.


గత్యంతరం లేక..

రిమ్స్‌లో చేరిన 49 మందిలో ఏడుగురు వివిధ కారణాల వల్ల ఉద్యోగాలను వదిలి వెళ్లిపోయారు. మిగిలిన 42 మంది కొనసాగుతున్నారు. వీరికి ఎనిమిది నెలల కిందట కొనసాగింపు (కంటిన్యుయేషన్‌) ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉండగా జారీ చేయలేదు. వీరి పేర్లను సైతం ఆరోగ్యశాఖ పోర్టల్‌ నుంచి తొలగించేశారు. కొనసాగింపు ఉత్తర్వులు వస్తాయన్న ఆశతో గత ఎనిమిది నెలలుగా వేతనాలు రాకపోయినా వారు విధులు నిర్వర్తిస్తూనే ఉన్నారు. తమ వేతనాలు వచ్చే నెలలో.. ఆపై నెలలో వస్తాయంటూ ఇన్నాళ్లు ఎదురు చూస్తూ ఉన్నారు. కుటుంబ పోషణ, పిల్లల చదువుల కోసం అందిన చోటల్లా అప్పులు చేశారు. ప్రస్తుతం అప్పు పుట్టని పరిస్థితులు నెలకొనటం.. మరో పక్క వేతనాలు ఎంతకూ విడుదల కాకపోవటంతో విధి లేని పరిస్థితుల్లో పది రోజులుగా ఆందోళనలు ప్రారంభించారు. మొదటి మూడు రోజులు వినతి పత్రాలు అందజేసినా అధికారులు స్పందించకపోవటంతో వారం రోజులుగా విధులు బహిష్కరించి నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నారు. భిక్షాటన చేసి, వంటావార్పుతో నిరసన వ్యక్తం చేశారు. గురువారం రాత్రంతా నిరసన కొనసాగించి జాగారం చేశారు.


నిధులున్నా.. ఉత్తర్వులు రాక

ఓసీఎస్‌ స్టాఫ్‌నర్సులకు వేతనాలు చెల్లించటానికి అవసరమైన నిధులు రిమ్స్‌ వద్ద ఉన్నాయి. కాకపోతే వారిని కొనసాగిస్తున్నట్లు ఉత్తర్వులు లేకపోవటం వల్లనే సమస్య ఏర్పడింది. ఉత్తర్వులు లేకుండా వేతనాలు చెల్లించటానికి నిబంధనలు అంగీకరించవని అధికారులు రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులకు నివేదించి కొనసాగింపు ఉత్తర్వులు జారీ చేయాలని పలు మార్లు కోరినా ఫలితం లేకుండా పోయింది. దీంతో సమస్య క్లిష్టంగా మారుతూ వస్తోంది. వేతనాలు చెల్లించే వరకు సమ్మె విరమించేది లేదని స్టాఫ్‌నర్సులు భీష్మించుకొని కూర్చున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని