logo

ఓపిక.. విజయ వీచిక..!

ఇలా చదువు పూర్తికాగానే అలా కొలువు రావాలని కోరుకుంటారు. ఒకటి, రెండు ప్రయత్నాలు విఫలమైతే నిరాశపడతారు.

Published : 05 Feb 2023 04:23 IST

స్ఫూర్తిదాయకం.. నూతన పాలనాధికారి కర్నాటి వరుణ్‌రెడ్డి ప్రస్థానం

నిర్మల్‌, న్యూస్‌టుడే: ఇలా చదువు పూర్తికాగానే అలా కొలువు రావాలని కోరుకుంటారు. ఒకటి, రెండు ప్రయత్నాలు విఫలమైతే నిరాశపడతారు. ఇక తమతో కాదులే అని నీరసిస్తారు. ఈ ప్రయత్నంలో ఏదో ఒకటి వచ్చింది చాలని సరిపెట్టుకుంటారు. కానీ.. చాలాకొద్ది మంది మాత్రమే ఎంచుకున్న లక్ష్యం సాధించేందుకు మొక్కవోని దీక్షతో అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నిస్తారు. విజయం దక్కించుకుంటారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మన జిల్లా పాలనాధికారి కర్నాటి వరుణ్‌రెడ్డి ఈ కోవలో ముందుంటారు. ఆయన విజయ ప్రస్థానం పరిశీలిస్తే..


అయిదోసారి.. ఏడో ర్యాంకు

కర్నాటి వరుణ్‌రెడ్డిది నల్గొండ జిల్లా మిర్యాలగూడ. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఆలిండియా 29వ ర్యాంకు సాధించి ముంబయి ఐఐటీలో చదువు పూర్తిచేశారు. ఐఆర్‌ఎస్‌ వచ్చాక ఆదాయపన్ను విభాగంలో పనిచేశారు. ఎంచుకున్న లక్ష్య సాధనలో పలుమార్లు విఫలమయ్యారు. మానసికంగా సమాలోచనలో పడ్డారు. ఓ దశలో ప్రయత్నం మానేయాలనే ఆలోచనా వచ్చింది. తమ వ్యవసాయక్షేత్రానికి వెళ్లినపుడు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులను ప్రత్యక్షంగా గమనించారు. వ్యవసాయశాఖ అధికారిగా తల్లి తీసుకున్న నిర్ణయాలతో వారికి కలిగిన ప్రయోజనం, వారిలోని కృతజ్ఞతాభావం కదలించాయి. పెద్ద చదువులు చదువుకొని డీలా పడిపోతే ప్రయోజనం లేదని భావించి, తనకు తాను ప్రోత్సహించుకున్నారు. మొత్తానికి అయిదో ప్రయత్నంలో తన ఆశల కొలువైన సివిల్స్‌లో ఏడో ర్యాంకు సాధించి ఐఏఎస్‌ను దక్కించుకున్నారు. తొలి పోస్టింగ్‌ కుమురంభీం జిల్లా అదనపు పాలనాధికారి. తర్వాత ఐటీడీఏ పీవోగా సమర్థంగా పనిచేశారు. గిరిజనుల అభివృద్ధికి తనవంతు కృషి చేసి అందరితో ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం నిర్మల్‌ జిల్లా తొలి కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు.


జిల్లాపై కలెక్టర్‌ ఏమన్నారంటే..

అన్ని వనరులు ఉన్న జిల్లా నిర్మల్‌. అన్ని రకాల వాతావరణం ఉంది. అభివృద్ధికి అవకాశం ఎక్కువ. ఇక్కడి ప్రజలు చైతన్యవంతులు. సవాళ్లూ ఎక్కువగా ఉంటాయి. నేను ఐటీడీఏ పీవోగా పనిచేసిన సమయంలో జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో చాలా సార్లు పర్యటించి ఇక్కడి ప్రజలు పడుతున్న బాధలు, కష్టాలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేశా. ఇక్కడ సవాళ్లు ఎక్కువే. అయినా అందరి సహకారంతో అన్నింటినీ అధికమించి జిల్లాను ముందుంచడానికి కృషి చేస్తా.


తొలి ప్రాధాన్యమిస్తా..

జిల్లాలో ప్రభుత్వ పథకాలు సక్రమంగా, విజయవంతంగా అమలుచేయడానికి తొలి ప్రాధాన్యం ఇస్తా. పల్లె, పట్టణ ప్రగతి, ప్రకృతి వనాలు, బృహత్‌ ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, డంపింగ్‌యార్డులు, ఇలా ప్రతి ప్రభుత్వ పథకం సమర్థంగా అమలయ్యేలా చూస్తా. విద్య, వైద్యం, సాంకేతిక రంగాల అభివృద్ధే లక్ష్యంగా చర్యలు తీసుకుంటాను. ప్రాధాన్యం, అవసరం బట్టి అన్ని ప్రాంతాల్లోనూ పర్యటించి స్థానికంగా ఉన్న సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తా.


లైవ్‌ లొకేషన్‌ కొనసాగిస్తాం

ఇదివరకు ఇక్కడ పనిచేసిన కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారుఖీ అమలుచేసిన లైవ్‌ లొకేషన్‌ విధానం బాగుంది. పలు ప్రభుత్వశాఖల ఉద్యోగులు సమయానికి వచ్చి విధులకు హాజరవుతున్నారు. ప్రస్తుతం ఉన్న ఈ విధానం కొనసాగిస్తూనే, వాటిని అన్ని ప్రభుత్వశాఖలకు విస్తరించేందుకు చర్యలు తీసుకుంటాను.


కుటుంబ నేపథ్యం

భార్య : చాహత్‌ బాజ్‌పాయ్‌ (ప్రస్తుత కుమురంభీం జిల్లా అదనపుపాలనాధికారి)
తండ్రి : జనార్ధన్‌, అప్తాల్మజిస్ట్‌
తల్లి : నాగమణి, వ్యవసాయశాఖ ఏడీ
సోదరుడు : పృథ్వి, ఎంబీబీఎస్‌
సొంతూరు: నల్గొండ జిల్లా మిర్యాలగూడ
ఇష్టమైన రచయిత: అఫ్గానిస్తాన్‌ రచయిత ఖలేద్‌ హోసెయిని రచనలు ఇష్టం. మానవత్వం ప్రతిబింబించేలా, అఫ్గాన్‌లోని పరిస్థితులకు అద్దంపట్టేలా రాసే విధానం ఆకట్టుకుంది. జయప్రకాశ్‌ నారాయణ పనితీరు, వ్యక్తిత్వం నాలో ఉత్సాహం నింపడటంతోపాటు ఎంతో ప్రేరణనిచ్చింది.


బ్యాచ్‌మేట్‌తో వివాహం

తన బ్యాచ్‌మేట్‌ అయిన చాహత్‌ బాజ్‌పాయి (ప్రస్తుత కుమురంభీం జిల్లా అదనపు పాలనాధికారి)ని 29 నవంబరు 2021న వివాహం చేసుకున్నారు.


ఆటలంటే ఇష్టం

ఆటలపై ఆసక్తి ఎక్కువన్నారు. ప్రధానంగా క్రికెట్‌తోపాటు జాగింగ్‌, లాంగ్‌ టెన్నిస్‌, బాస్కెట్‌బాల్‌ ఆడుతానని, ప్రయాణం అంటే చాలా ఇష్టం. కొత్త ప్రదేశాలు చూడటం, తెలుసుకోవడంపై ఆసక్తి అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని