logo

వణికిస్తున్న చలి.. సుర్రుమంటున్న ఎండ

ఒకవైపు తగ్గని చలి తీవ్రత.. మరోవైపు పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు..  ఇలా అసాధారణ వాతావరణం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వాసులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.

Published : 06 Feb 2023 05:17 IST

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో అసాధారణ వాతావరణం
లక్షెట్టిపేట, ఆదిలాబాద్‌ వ్యవసాయం, న్యూస్‌టుడే

లక్షెట్టిపేటలో గోదావరి తీరంలో ఉదయం 7 గంటల ప్రాంతంలో చలిమంటలు కాచుకొంటున్న దృశ్యం

ఒకవైపు తగ్గని చలి తీవ్రత.. మరోవైపు పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు..  ఇలా అసాధారణ వాతావరణం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వాసులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. పగలు సాధారణం కన్నా ఎక్కువ ఉంటున్న ఎండలు రాత్రి కాగానే ఒక్కసారిగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక శీతల గాలుల ప్రభావంతో ఇంటి బయటకు రావాలంటే భయపడేలా చేస్తోంది.

రాత్రి కనిష్ఠం.. పగలు గరిష్ఠం

అసాధారణ వాతావరణ పరిస్థితులు గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతల నమోదులో ఉమ్మడి జిల్లా రాష్ట్రస్థాయిలో రికార్డు నమోదవుతోంది. అటు చలి తీవ్రత, ఇటు ఎండ వేడిమి నమోదవుతుండటం విశేషం. ఆదివారం ఉదయం స్వయంచాలక వాతావరణ కేంద్రాల్లో నమోదైన గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతల ప్రకారం కుమురంభీం జిల్లాలోని సిర్పూర్‌(యు)లో రాష్ట్రంలోనే అత్యల్పంగా 6.2 డిగ్రీ సెంటీగ్రేడ్లు నమోదు కాగా పగటి ఉష్ణోగ్రతలు మంచిర్యాల జిల్లాలోని నస్పూరు, నిర్మల్‌ జిల్లా దస్తూరాబాద్‌ల్లో 35.1 చొప్పున నమోదయ్యాయి. ఇవి రాష్ట్రంలోని జయశంకర్‌ భూపాలపల్లిలో నమోదైన 37.1 పెద్దపల్లి జిల్లా కునారంలో నమోదైన 36.1 తర్వాత గరిష్ఠ ఉష్ణోగ్రతలుగా నమోదవడం గమనార్హం.

వేసవిని తలపించేలా..

మార్చి నుంచి ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతూ రావడం సాధారణం. కాగా ఈ ఏడాది ఫిబ్రవరి మొదటి వారం నుంచే ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుండటం గమనార్హం. ఉదయం 9 దాటిందంటే తీవ్రత పెరుగుతూ సాయంత్రం 4 గంటల వరకు సుర్రుమనేలా ఉంటోంది. పగటి ఉక్కపోత ఊపిరి సలుపనివ్వడం లేదు.

మంచిర్యాల జిల్లా నస్పూరులో గరిష్ఠంగా 35.1 డిగ్రీ సెంటీగ్రేడ్‌ల పగటి ఉష్ణోగ్రత  చూపుతున్న పటం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని