logo

ఇటుక బట్టీ.. అక్రమాల పుట్ట

ఇటుక బట్టీల యాజమాన్యాలు అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా పచ్చని చెట్లు నరుకుతూ కాల్చేందుకు వినియోగిస్తున్నారు. దీన్ని అరికట్టాల్సిన అటవీశాఖ అధికారులు ఇవేమి పట్టించుకోకుండా ఈ వ్యవహారాన్ని ‘మామూలు’గా తీసుకుంటున్నారు.

Published : 06 Feb 2023 05:17 IST

సరస్వతీ నగర్‌లో శివారులో ఓ ఇటుక బట్టీ వద్ద కాల్చేందుకు నిల్వచేసిన మొద్దులు

భైంసా పట్టణం, న్యూస్‌టుడే: ఇటుక బట్టీల యాజమాన్యాలు అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా పచ్చని చెట్లు నరుకుతూ కాల్చేందుకు వినియోగిస్తున్నారు. దీన్ని అరికట్టాల్సిన అటవీశాఖ అధికారులు ఇవేమి పట్టించుకోకుండా ఈ వ్యవహారాన్ని ‘మామూలు’గా తీసుకుంటున్నారు. ముథోల్‌ నియోజకవర్గంలోని ముథోల్‌, భైంసా మండలాల్లో 33 ఇటుక బట్టీలు కొనసాగుతున్నాయి. వాటిని కాల్చేందుకు బొగ్గు వినియోగించాల్సి ఉండగా 80 శాతం కర్రతోనే కాల్చుతున్నారు. దీంతో వేల వృక్షాలు బట్టీలకు ఆహుతవుతున్నాయి. ఈ క్రమంలో ముథోల్‌ మండలంలో ఇటుక బట్టీల్లో భారీగా కర్ర వినియోగంపై అటవీ శాఖ ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ఆకస్మిక తనిఖీలు చేపట్టడంతో స్థానిక అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నిబంధనల ప్రకారం ఇటుకలు బొగ్గుతో కాల్చాలి. కర్ర వినియోగించాల్సి వస్తే 40-50 సంవత్సరాల తుమ్మ, వేప చెట్ల కర్రనే వాడాలి. అందుకు ముందస్తుగా సంబంధిత యాజమాన్యాలు వృక్షాలు ఉన్న భూ యజమానిచే కొనుగోలు చేసే వృక్షాల సంఖ్య, పట్టాదారు పాసుపుస్తకం, లొకేషన్‌ మ్యాప్‌తో అటవీశాఖ అధికారులకు దరఖాస్తు చేయించాలి. వాల్టా చట్టం కింద ఒక్కో వృక్షానికి రూ.550 చొప్పున ప్రభుత్వానికి చలాను చెల్లించాలి. అనంతరం అధికారులు క్షేత్రస్థాయిలో వృక్ష పరిమాణం(పొడవు, వృత్తాకారం) పరిశీలిస్తారు. దాని నుంచి లభించే కర్ర, తరలించే వాహన వివరాలతో 3-4రోజుల గడువుతో అనుమతి పత్రం జారీచేస్తారు. ఆ లోపే వాటిని నరికి తరలించాలి. అయితే జిల్లాలో ఇటుకబట్టీ యాజమాన్యాలు భూ యజమానుల వద్ద నామమాత్రపు ధరతో వివిధ రకాల చెట్లను కొనుగోలు చేసి ఇష్టానుసారంగా నరుకుతూ అక్రమంగా తరలించి వినియోగిస్తున్నారు. దీర్ఘకాలిక వయసు వృక్షాలు లభించక 15-20 సంవత్సరాల చెట్లను యథేచ్ఛగా నరికి దుర్వినియోగం చేస్తున్నారు.

ముథోల్‌ మండలం పిప్రి శివారులో ఇటుక బట్టీల వద్ద తనిఖీలు చేస్తున్న ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు

పట్టించుకోని అధికారులు

ఈ సీజన్‌లో ముథోల్‌లో 29 బట్టీలు కొనసాగుతుండగా స్థానిక అధికారులు మూడింటిపై కేసులు నమోదు చేసి రూ. 45 వేల జరిమానా విధించారు. భైంసా మండలంలో నాలుగు బట్టీలకు మూడు కేసులు చేసి రూ.లక్ష జరిమానా విధించినట్లు సమాచారం. ఈ విషయాన్ని గమనించిన ఉన్నతాధికారులు ఇటీవల ప్రత్యేకంగా ముథోల్‌ ఇటుకబట్టీలపై నిఘా సారించారు. స్థానిక అధికారుల ప్రమేయం లేకుండా రెండు రోజుల క్రితం ఫ్లయింగ్‌ స్క్వాడ్‌చే తనిఖీలు నిర్వహించారు. ఒకే రోజు 14 పరిశ్రమలను పరిశీలించగా 7 బట్టీల్లో కర్ర వినియోగిస్తున్నట్లు గుర్తించారు. తనిఖీల విషయం ముందుగానే తెలుసుకున్న కొన్ని యాజమాన్యాలు అప్పటికప్పుడు మొద్దులను దూరంగా మరోచోటికి తరలించినట్లు సమాచారం.


పది బట్టీలే ఉన్నాయి
- రాఠోడ్‌ రమేశ్‌, ఎఫ్‌ఆర్వో, భైంసా

మా పరిధిలో పది ఇటుక పరిశ్రమలు ఉన్నాయి. కర్ర వినియోగించవద్దని నిర్వాహకులకు నచ్చజెబుతున్నాం. కొందరు పెడచెవిన పెడుతున్నారు. ఈ సీజన్‌లో కర్ర వినియోగిస్తున్న ఆరు బట్టీలపై కేసులు నమోదుచేసి జరిమానా విధించాం.


నివేదిక అందజేశాం
- రమేశ్‌రావు, జిల్లా అటవీశాఖ  ఫ్లయింగ్‌స్క్వాడ్‌ ఎఫ్‌ఆర్వో, నిర్మల్‌

ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ముథోల్‌ మండలంలోని వివిధ గ్రామాల శివార్లలో కొనసాగుతున్న 14 ఇటుక బట్టీలో ఆకస్మిక తనిఖీలు చేశాం. కర్ర వినియోగిస్తున్న పరిశ్రమలపై నివేదిక అందజేశారు. తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని