logo

సాగని పనులు.. అన్నదాతకు వెతలు

ఎస్సారెస్పీని ఉత్తర తెలంగాణ వర ప్రదాయినిగా పిలుస్తారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ముంపునకు గురైన జిల్లాలోని 33 గ్రామాల ప్రజలు సర్వం కోల్పోయారు.

Published : 06 Feb 2023 05:17 IST

కాళేశ్వరం 27 ప్యాకేజీ కాలువల దుస్థితి

కుంటాల మండలం విఠాపూర్‌ సమీపంలో వంతెన అసంపూర్తిగా ఉండటంతో కాలువలో మట్టి పోసుకుని రాకపోకలు సాగిస్తున్న ప్రజలు

నిర్మల్‌, న్యూస్‌టుడే: ఎస్సారెస్పీని ఉత్తర తెలంగాణ వర ప్రదాయినిగా పిలుస్తారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ముంపునకు గురైన జిల్లాలోని 33 గ్రామాల ప్రజలు సర్వం కోల్పోయారు. ఇందులో కొన్ని గ్రామాల ప్రజలు బతుకు జీవుడా అంటూ పొట్ట చేత పట్టుకొని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లగా.. మరికొన్ని గ్రామాల వారికి జిల్లాలో ప్రభుత్వం పునరావాసం కల్పించింది. ఈ ప్రాంత రైతులకు సాగు, తాగు నీరు అందించాలనే ఉద్దేశంతో ఈ జలాశయం వెనుకతట్టు భాగంలో కాళేశ్వరం ప్రాజెక్టు 27 ప్యాకేజీ కింద పంట కాలువ నిర్మాణం పనులు 15 ఏళ్ల కిందట ప్రారంభించి నాలుగేళ్లలో పనులన్నీ పూర్తి చేస్తామని ప్రకటించినా.. సకాలంలో నిధుల విడుదల చేయకపోవడంతో పనులు ముందుకు సాగక సాగు నీరందక రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.

నీళ్లు లేక నోళ్లు తెరిచిన భూములకు సాగు నీటి కాలువలు ప్రాణం పోస్తుందని తమ విలువైన పంట భూములు అప్పజెప్పారు. ఒకచోట పోయినా మరోచోట కలిసొస్తుందని భావించారు. భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఇచ్చినా.. మిగిలిన భూముల్లో పంటలు సాగు చేసుకుందామని ఎదురుచూస్తున్న రైతాంగానికి నీరందక వారి ఆశలు ఆడియాశలు అవుతున్నాయి. జిల్లాలోని దిలావర్‌పూర్‌ మండలం గుండంపల్లి గ్రామ సమీపంలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు వెనుకతట్టు భాగంలోని గోదావరి పరివాహక ప్రాంతంలో 15 ఏళ్ల క్రితం కాళేశ్వరం (కాల్వ నర్సింహస్వామి ఎత్తిపోతల పథకం) ప్రాజెక్టు 27 ప్యాకేజీ కింద పంట కాలువ నిర్మాణం పనులకు సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో పనులు నత్తతో పోటీపడుతూ సాగుతున్నాయి.  

ఇదీ పరిస్థితి

2008లో ప్రారంభమైన ఈ పనులు నాలుగేళ్లలో పూర్తిచేయాలని గత ప్రభుత్వం గడువు విధించగా, తదనంతరం జరిగిన పరిణామాలతో ఈ పనులు అర్ధాంతరంగా ఆగాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తిరిగి పనులకు అనుమతినిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జూన్‌ 2019 లోగా పనులు పూర్తి చేయాలని సదరు నిర్మాణ సంస్థకు అవకాశం కల్పించినా నిధులు విడుదల చేయకపోవడంతో పనులను నిలిపివేసింది. 2021లో మళ్లీ టెండరు ప్రక్రియ నిర్వహించి మరో నిర్మాణ సంస్థ పనులు అప్పజెప్పింది. అయినా.. పనులు చేయడానికి అవసరమైన నిధులు విడుదల చేయకపోవడంతో ఆ నిర్మాణ సంస్థ కూడా ప్రస్తుతం పనులను ఎక్కడికక్కడ నిలిపివేసింది. పంట కాలువ నిర్మాణంలో కోల్పోయిన భూములతోపాటు పక్కనే ఉన్న భూములు ఈ అర్థాంతరంగా ఆగిన పనులతో సాగుకు నోచుకోవడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.


* సారంగాపూర్‌ మండలం కౌట్ల(బి) గ్రామ సమీపంలోని కర్జీవాగుపై అండర్‌టెన్నెల్‌ (యూటీ) నిర్మించారు. ఎడమ వైపు నుంచి వాన నీరు కుడి వైపునకు వెళ్లడానికి నిర్మించారు. పక్కనే ఉన్న పంటల నుంచి వచ్చే వరదనీరు ఇక్కడ అయిదు అడుగుల ఎత్తు నుంచి వస్తుంటాయి. అంటే ఇక్కడ ఎస్‌పీ (సూపర్‌ పాస్‌) నిర్మించాల్సి ఉంది. అయితే ఇక్కడ యూటీ ఏర్పాటు చేయడంతో ఎగువ నుంచి వచ్చిన వరదనీరు దిగువకు వెళ్లకుండా అక్కడే నిల్వ ఉంటున్నాయి. దిగువన సుమారు 20 అడుగుల లోతుతో కాలువ తీయాల్సి ఉన్నా.. అలా చేయకపోవడంతో వానాకాలంలో ఎగువ ప్రాంతానికి నీరు వెళ్లడం లేదు.


పనుల పూర్తికి చర్యలు తీసుకుంటున్నాం
- నరేశ్‌, డీఈ, ప్యాకేజీ-27

సాగునీటి కాలువ పనుల పూర్తికి చర్యలు తీసుకుంటున్నాం. మామడ మండలంలో సాగునీటి కాలువ నిర్మాణానికి సంబంధించి భూ సేకరణ జరిగిన వెంటనే పనులు మొదలుపెడుతాం. ఎక్కడా పూర్తిగా సాగునీటి కాలువ పనులు పూర్తికాలేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నెలాఖరు వరకు కొన్ని చెరువులకు నీటిని విడుదల చేస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని