logo

అర్జీదారుకు రాతపూర్వక సమాధానం

ఆయా సమస్యల అర్జీలతో వచ్చే వారికి ఆ సమస్య పరిష్కారం అవుతుందో, లేదో అన్నది రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలని పాలనాధికారి రాహుల్‌రాజ్‌ అధికారులను ఆదేశించారు.

Published : 07 Feb 2023 06:32 IST

 అధికారులకు పాలనాధికారి ఆదేశం

అర్జీలు స్వీకరిస్తున్న పాలనాధికారి రాహుల్‌రాజ్‌

పాలనాప్రాంగణం, న్యూస్‌టుడే: ఆయా సమస్యల అర్జీలతో వచ్చే వారికి ఆ సమస్య పరిష్కారం అవుతుందో, లేదో అన్నది రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలని పాలనాధికారి రాహుల్‌రాజ్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణిలో ప్రజల నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు. అనంతరం అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై దిశానిర్దేశం చేశారు. ఒకే సమస్యపై ప్రజలు పదే పదే ప్రజావాణికి రాకుండా చూడాలన్నారు. జిల్లా ఉన్నతాధికారులు మాత్రమే రావాలని, అనుమతిలేకుండా హెడ్‌క్వార్టర్‌ దాటి వెళ్లొద్దని స్పష్టంచేశారు. ఇకపై ప్రతి నెలా 3వ తేదీన జిల్లా అధికారులతో సమావేశం ఉంటుందన్నారు. జిల్లా సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలని, అందుకు సమష్టి కృషి అవసరమని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులుగా బాధ్యతగా విధులు నిర్వహించాలని, నిబంధనల మేరకు ప్రజల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. బుధవారం జిల్లా అధికారులతో సమావేశం ఉంటుందని, ఆ సమావేశంలో రెండేళ్ల ప్రగతి నివేదికలతో రావాలన్నారు. గురువారం ఐటీడీఏ చేపడుతున్న కార్యక్రమాలపై ఉట్నూరులో సమీక్ష నిర్వహిస్తామన్నారు. అర్జీదారుల సమస్యలను ఓపిగ్గా విన్న పాలనాధికారి వారికి సమాధానాలు చెప్పారు. దివ్యాంగుల వద్దకే వెళ్లి అర్జీలు తీసుకున్నారు. అదనపు పాలనాధికారులు నటరాజ్‌, రిజ్వాన్‌ బాషాషేక్‌, శిక్షణ సహాయ పాలనాధికారి పి.శ్రీజ, జడ్పీ సీఈవో గణపతి, మున్సిపల్‌ కమిషనరు శైలజ, ఆయా శాఖల అధికారులు మిల్కా, శంకర్‌, కిరణ్‌కుమార్‌, రాజలింగు, పుల్లయ్య, సునీత, సుధారాణి, నిహారిక తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని