logo

సర్వేయర్లు లేక.. భూకొలతలు పూర్తికాక

జిల్లాలో భూములు సర్వే కోసం అన్నదాతలు ఏళ్లుగా అవస్థలు పడుతున్నారు. కాళ్లరిగేలా తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా.. భూ వివాదం పరిష్కారం కావడం లేదు.

Published : 07 Feb 2023 06:32 IST

పేరుకుపోతున్న దరఖాస్తులు..
న్యూస్‌టుడే, తలమడుగు

జిల్లాలో భూములు సర్వే కోసం అన్నదాతలు ఏళ్లుగా అవస్థలు పడుతున్నారు. కాళ్లరిగేలా తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా.. భూ వివాదం పరిష్కారం కావడం లేదు. అధికారులు అర్జీలు తీసుకోవడానికే పరిమితమవుతున్నారు. వేధిస్తున్న సర్వేయర్ల కొరత.. సమస్యను నానాటికీ పెంచుతోంది. దళితబస్తీలో  ప్రభుత్వం పంపిణీ చేసిన భూముల్లో సమస్యలు అధికంగా ఉన్నాయి. గత ప్రభుత్వాలు పంపిణీ చేసిన భూములతోపాటు అసైన్డ్‌ భూముల్లోనూ ఈ సమస్య అధికంగా ఉంది.
జిల్లా వ్యాప్తంగా 18 మండలాలకు గాను 467 పంచాయతీల్లో 508 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఇందులో దాదాపు 5.5 లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. దళితబస్తీ పథకంలో జిల్లా వ్యాప్తంగా 7,400 ఎకరాల భూమిని అర్హులకు పంపిణీ చేశారు. తలమడుగు, తాంసి, జైనథ్‌, ఆదిలాబాద్‌, భీంపూర్‌ మండలాల్లోని ఈ పథక భూముల్లో సమస్య అధికంగా ఉంది. భూముల ధరలు ఆకాశాన్నంటుండటంతో ఊరూరా భూ వివాదాలు  పెరిగాయి. తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చే లబ్ధిదారుల్లో ఈ సమస్యల దరఖాస్తులు అధికంగా ఉంటున్నాయి. వీటి పరిష్కారానికి సర్వేయర్లు సరిపడా లేకపోవడం ఇబ్బందికరంగా మారింది.

* జిల్లా వ్యాప్తంగా 20 మంది సర్వేయర్లు ఉండాల్సి ఉండగా.. కేవలం ఎనిమిది మందితో నెట్టుకొస్తున్నారు. చాలా మండలాల్లో భూ సమస్యలు పరిష్కారం కావడంలేదు. ప్రతి మండలం నుంచి దాదాపు 50 నుంచి 60 దరఖాస్తులు రహదారులు, భూ కబ్జాలు తదితరాలు ఉంటున్నాయి.

తరచూ ఘర్షణలు

తాంసి మండలంలోని పొన్నారి గ్రామానికి చెందిన ఓ రైతు తనకు సంబంధించి సాగు భూమిలో కొన్ని గుంటలను.. పక్క పొలానికి చెందిన వ్యక్తి కబ్జా చేశాడని ఆరోపించారు. బాధితుడు తన భూమి పూర్తిస్థాయిలో సర్వే చేయించి హద్దులు ఏర్పాటు చేయాలని అధికారులకు దరఖాస్తు ఇచ్చారు. పలుమార్లు ఇరువురి మధ్య గొడవలు జరుగుతున్నాయి. సమస్యను పరిష్కరించాలని బాధితుడు వాపోతున్నారు. 

అటవీ అధికారుల అడ్డగింత

బోథ్‌ మండలం ధన్నూర్‌ గ్రామానికి చెందిన పలువురు రైతులు.. కొన్నేళ్లుగా సాగు చేస్తున్నారు. అయితే అటవీ అధికారులు ఇటీవల సాగవుతున్న భూమి అటవీశాఖకు సంబంధించినదని అడ్డుకున్నారు. ఆ భూములను సర్వే చేయించి న్యాయం చేయాలని బాధితులు మొరపెట్టుకున్నారు. అయినా ఫలితం లేదని వాపోతున్నారు. రైతులు సమస్యను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటికీ  పరిష్కారం కాలేదు.

దారి ఇవ్వడం కుదరదంటూ..

తలమడుగుకు చెందిన ఆశమ్మకు దళితబస్తీ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మూడు ఎకరాల సాగు భూమిని పంపిణీ చేసింది.  ఇన్నాళ్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగు చేసుకుంటున్న ఆమెకు పక్క పొలం యజమాని తన పొలం పక్కనుంచి దారి ఇవ్వడం కుదరదని కర్రలు పాతారు. దీంతో సర్వేయర్లు ఆ స్థలాన్ని సర్వే చేశారు. సదరు భూ యజమాని కర్రలను తొలగించడంతో సమస్య పరిష్కారమైంది.

సమస్యల పరిష్కారానికి కృషి : రమేశ్‌ రాథోడ్‌, ఆర్డీవో ఆదిలాబాద్‌

జిల్లాలో భూ వివాదాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. జిల్లాలో సర్వేయర్ల కొరత ఉండటంతో ఇబ్బందులు ఉన్నాయి. మండలాల వారీగా వచ్చిన దరఖాస్తుల ఆధారంగా పరిశీలించి భూ వివాద సమస్యలను పరిష్కారిస్తాం. సమస్య తీవ్రత అధికంగా ఉన్న వాటిపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని