logo

ఇష్టారాజ్యం.. తనిఖీలు పూజ్యం

జిల్లాలో మెడికల్‌ దుకాణాల నిర్వహణపై పర్యవేక్షణ కరవైంది. ఔషధ నియంత్రణ అధికారులెవరు, ఎక్కడుంటారు.. ఫిర్యాదు చేయాలంటే ఎలా అనే విషయంలో స్థానికులకు తగిన సమాచారం అందుబాటులో ఉండటం లేదు.

Published : 07 Feb 2023 06:32 IST

నిబంధనలు పాటించని మందుల దుకాణాల యాజమాన్యం
నిర్మల్‌ పట్టణం, న్యూస్‌టుడే

దుకాణంలోని మందులు

జిల్లాలో మెడికల్‌ దుకాణాల నిర్వహణపై పర్యవేక్షణ కరవైంది. ఔషధ నియంత్రణ అధికారులెవరు, ఎక్కడుంటారు.. ఫిర్యాదు చేయాలంటే ఎలా అనే విషయంలో స్థానికులకు తగిన సమాచారం అందుబాటులో ఉండటం లేదు. ఉన్నతాధికారులు ఆదేశిస్తే తప్ప మందుల దుకాణాల తనిఖీలు జరిగిన ఘటనలు మచ్చుకైనా కనిపించకపోవడం దీనికి నిదర్శనంగా మారింది.

కొందరు మెడికల్‌ దుకాణాల నిర్వాహకులు నిబంధనలు విస్మరిస్తున్నారు. వైద్యుడి ప్రిస్క్రిప్షన్‌ లేకుండా కొన్ని రకాల మందులు విక్రయించడం నిషిద్ధం. కానీ, కొన్నిచోట్ల దీన్ని పాటించడం లేదు. ఎవరు, ఎలాంటి మందులు కావాలని అడిగినా ఇచ్చేస్తున్నారు. వైద్యుడు రాసిచ్చినవి కాకుండా తమకు అనుకూలంగా ఉన్నవాటిని (లాభం ఎక్కువ వస్తుందన్న ఆశతో) విక్రయిస్తున్నారనే విమర్శలూ లేకపోలేదు. ఫార్ములా ఒకటే అంటూ కొనుగోలుదారులకు నచ్చజెప్తున్నారు. దీనివల్ల కొన్ని సందర్భాల్లో రోగి ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. విక్రయించిన మందులకు తగిన రసీదులు ఇవ్వాలి. కానీ, చాలాచోట్ల ఇవ్వడం లేదు. దీంతో వారడగినంత చెల్లించాల్సి వస్తోంది. కావాల్సినన్ని మందుబిళ్లలు ఇవ్వకుండా మొత్తం స్ట్రిప్‌ తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. వైద్యుల సూచనల మేరకు రోగికి ఇది అనవసరమే అయినా తప్పనిసరి పరిస్థితుల్లో కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా ఆర్థికంగా అదనపు భారం పడుతోంది.

అవగాహన లేకపోయినా..

మెడికల్‌ దుకాణాలు నిర్వహించాలంటే బీ-ఫార్మసీ, ఎం-ఫార్మసీ పట్టభద్రులై ఉండాలి. మందులపై కనీస అవగాహన ఉండాలి. కానీ, కొందరు సరైన అవగాహన లేకుండానే కొనసాగిస్తున్నారనే విమర్శలున్నాయి. పట్టభద్రుల ధ్రువపత్రాలను అద్దెకు తీసుకొని వీటిని నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో తగిన అనుమతుల్లేకపోయినా మందుల దుకాణాలు కొనసాగిస్తున్నారు. కొందరు కిరాణ, ఇతర దుకాణాల్లో అంతర్లీనంగా వీటిని నిర్వహిస్తున్నారు. కొన్ని మందులను విధిగా ఫ్రిజ్‌లో భద్రపర్చాలి. మందులు నిల్వచేసే ప్రాంతంలో పరిశుభ్రత పాటించాలి. దుమ్ము, ధూళి లేకుండా చూడాలి. రిజిస్టర్లు, బిల్‌ బుక్కులు నిర్వహించాలి. చాలామంది వీటి విషయంలో మొక్కుబడిగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

కనిపించని తనిఖీలు..

మార్కెట్‌ విస్తరణలో భాగంగా మెడికల్‌ రెప్రజెంటేటివ్స్‌ ఇచ్చే శాంపిల్‌ మందులను, ప్రభుత్వం ఆసుపత్రులకు సరఫరా చేసేవాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయించొద్దు. దుకాణంలోని మందుల తయారీ గడువుకు ఆరునెలల ముందు నుంచే వాటిని విడిగా ఉంచాలి. కొందరు తయారీ గడువుకు కొద్దిరోజుల ముందువరకూ విక్రయిస్తున్న సంఘటనలు అప్పుడప్పుడు బయటపడ్తున్నాయి. జిల్లాకేంద్రంలో కొద్దిరోజుల క్రితం ఓ మందుల దుకాణంలో గడువు తేదీ ముగిసిన మందులు విక్రయించిన విషయం వెలుగుచూసింది. వీటన్నింటి నివారణకు ఔషధ నియంత్రణ అధికారులు తరచూ పర్యవేక్షణ చేపట్టడం, దుకాణాల్లో తనిఖీలు చేయడం చేపట్టాలి. కానీ, ఇదంతా ఎప్పుడోగాని జరగడం లేదు. గతంలో నిర్మల్‌ జిల్లాకేంద్రంలోని ఓ ఇంట్లో డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయం నిర్వహించేవారు. మందుల దుకాణదారులకు మినహా దీని చిరునామా చాలామందికి తెలిసేది కాదు. ప్రస్తుతం ఆదిలాబాద్‌ డీఐకి నిర్మల్‌ ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు. ఫలితంగా తనిఖీల ప్రస్తావనే కనిపించడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని