logo

అన్నదాతకు అండ.. బడుగులకు భరోసా!

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ వ్యవసాయాభివృద్ధికి అనుకూలంగా ఉండటంతో జిల్లా రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. అన్నదాతలకు అండగా.. బడుగు జీవులకు భరోసా నింపేలా సంక్షేమ పథకాలకు భారీగా నిధులు కేటాయించారు.

Published : 07 Feb 2023 06:32 IST

ఆదిలాబాద్‌ వ్యవసాయం, న్యూస్‌టుడే

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ వ్యవసాయాభివృద్ధికి అనుకూలంగా ఉండటంతో జిల్లా రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. అన్నదాతలకు అండగా.. బడుగు జీవులకు భరోసా నింపేలా సంక్షేమ పథకాలకు భారీగా నిధులు కేటాయించారు. విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యమివ్వడంతో సమగ్ర అభివృద్ధికి దోహదపడేలా బడ్జెట్‌ ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్‌ నిధులు కేటాయింపు, జిల్లాకు కలిగే ప్రయోజనాలపై కథనం

జిల్లాలో 1.50 లక్షల మంది రైతులు 5.50 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. ఈ బడ్జెట్‌లో రైతుబంధు, బీమా, రుణమాఫీ తదితర పథకాలతో పాటు పంట రుణాలు, తదితర వాటితోపాటు ఆయిల్‌పామ్‌ సాగు విస్తీర్ణం పెంపునకు, వ్యవసాయ అనుబంధ రంగాలకు నిధులు కేటాయించారు. గొర్రెల పంపిణీ, ఉచితంగా చేపలు వదలడం తదితర వాటిని కొనసాగించేందుకు వీలుగా నిధులు కేటాయించడంతో.. ఆయా వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


ప్రతిష్ఠాత్మక పథకాలకు..

రైతుబంధు, బీమా పథకాలను కొనసాగించాలంటే వానాకాలం, యాసంగి సీజన్లకు కలిపి జిల్లాకు రూ.540 కోట్లు అవసరం. జిల్లా మొత్తంలో 1.47 లక్షల మంది రైతులు రైతుబంధు కింద లబ్ధి పొందుతున్నారు. రైతుబీమా పథకంలో భాగంగా.. ఏటా 90వేల మంది ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఇందుకు రూ.35 కోట్లు అవసరం. జిల్లా మొత్తంలో రుణమాఫీ పూర్తిగా చేయాలంటే రూ.236 కోట్లు అవసరం.. కాగా కొన్నేళ్లుగా నిధులు లేక మాఫీ చేయడం లేదు. ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించడంతో.. ఈ సీజన్‌లో మాఫీ డబ్బులు జమవుతాయనే ఆశతో రైతాంగం ఉంది. రూ.25 వేల లోపు రుణం తీసుకున్న వారికి మాఫీ మొత్తాన్ని ఇప్పటికే వారివారి ఖాతాల్లో జమ చేయగా.. మిగిలిన వారికి త్వరలో జమ చేసే అవకాశం ఉంది.

రైతుబంధు

అర్హులు - 1.47 లక్షలు
నిధులు- రూ. 540 కోట్లు
రైతుబీమా అర్హులు- 90 వేలు
నిధులు- రూ. 35 కోట్లు
రుణమాఫీ అర్హులు- 70 వేలు
నిధులు- రూ. 236 కోట్లు
ప్రాజెక్టులకు అరకొరగానే..


చనఖా కోరటా ప్రాజెక్టు

జిల్లాలో దిగువ పెన్‌గంగ ప్రాజెక్టు పూర్తికి అవసరమయ్యే నిధులు కేటాయించకపోవడంతో.. ఈ ఏడాది కూడా పొలాలకు నీరందే పరిస్థితి కనిపించడం లేదు. గత బడ్జెట్‌లో రూ.276 కోట్లు కేటాయించగా.. రూ.202 కోట్లు ఖర్చయ్యాయి. ప్రస్తుతం రూ.289.61 కోట్లు కేటాయించారు. చనఖా-కోరటా బ్యారేజీ నిర్మాణం పూర్తికాగా.. పొలాలకు నీరందించాలంటే పిల్ల కాలువలు నిర్మించాలి. వీటి నిర్మాణానికి 1100 ఎకరాల భూసేకరణ జరపాలి. ఇందుకు రూ.200 కోట్లు అవసరం. పిప్పల్‌కోటి రిజర్వాయరు పనులకు రూ.350 కోట్లు, కాలువల నిర్మాణానికి రూ.200 కోట్లు అవసరమని అధికారుల అంచనా. జిల్లాలోని సాత్నాల, మత్తడివాగు ప్రాజెక్టుల్లోని అసంపూర్తి పనులు చేపట్టేందుకు అరకొరగా నిధులు కేటాయించారు..

* బోథ్‌ నియోజకవర్గంలో ప్రతిపాదనలో ఉన్న కుప్టి ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు కేటాయించలేదు. రెండేళ్ల కిందటే ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ.1100 కోట్లు అంచనాతో అధికారులు ప్రతిపాదనలు పంపించారు. గతేడాది రూ.2 కోట్లు కేటాయించి ప్రాథమిక సర్వే చేయమని చెప్పారు. ఈ బడ్జెట్‌లో మొండిచేయి చూపారు. ప్రాజెక్టు పూర్తయితే ఇచ్చోడ, బోథ్‌, నేరడిగొండ మండలాల్లో 68వేల ఎకరాలకు సాగు నీరందించే అవకాశం ఉందని భావిస్తున్నారు.


అనుబంధ రంగాలకు..

* ఉమ్మడి జిల్లాలో ఆయిల్‌పామ్‌ సాగు విస్తీర్ణం పెరగాలంటే బడ్జెట్‌లో రూ.25 కోట్లకు పైగా నిధుల అవసరం ఉంది. గతేడాది 3,400 ఎకరాల లక్ష్యంతో రైతులను ప్రోత్సహించగా.. 2,050 ఎకరాల్లో సాగైంది. వచ్చే ఏడాది 7వేల ఎకరాల్లో సాగును పెంచాలి. మొక్కలతో పాటు బిందుసేద్య పరికరాలపై రాయితీ ఇస్తున్నారు.

* ప్రస్తుత బడ్జెట్‌లో గొర్రెలు, చేపల పథకాలకు రూ.2,071 కోట్లు కేటాయించడంతో పథకంపై ఆశలు చిగురించాయి. రెండో విడత గొర్రెల యూనిట్లు పొందేందుకు ఇప్పటికే అర్హులు తమ వాటా కింద రూ.9 కోట్లు ప్రభుత్వ ఖాతాలో జమ చేశారు. జిల్లా మొత్తంలో 4,500 యూనిట్లు మంజూరు చేయాల్సి ఉంది.


పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన..

మన ఊరు/బస్తీ-మన బడి పథకంలో భాగంగా.. జిల్లాలో తొలివిడత 237 బడులు ఎంపికయ్యాయి. ఇందులో కొన్నింటికి నిధులు మంజూరు చేయడంతోపాటు పనులు పూర్తి చేసి ఈ నెల 1న ప్రారంభించేలా చర్యలు తీసుకున్నారు. మిగిలిన వాటిల్లో ప్రతిపాదించిన పనులు పూర్తి చేయాలంటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ పథకానికి నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. ఈ బడ్జెట్‌లో విద్యాసంస్థల్లో మౌలిక వసతులు కల్పించేందుకు రూ.7,789 కోట్లు కేటాయించారు. బడుల్లో వంట చేసే కార్మికులకు ఇప్పటి వరకు నెలకు రూ.1000 మాత్రమే ఇచ్చేవారు. అలాంటిది వీరి వేతనం రూ.3 వేలకు పెంపు చేసి నిధులు కేటాయించారు.

మొత్తం పాఠశాలలు- 1422
మన ఊరు-మన బడి కింద ఎంపికైనవి - 237
నిధుల కేటాయింపు- రూ. 87.75 కోట్లు
మధ్యాహ్న భోజన కార్మికులు- 1,799
వేతన పెంపు- రూ. 3 వేలు


అందుబాటులో వైద్యం

జిల్లాలోని పేదలకు వైద్యం అందుబాటులో ఉండేందుకు వీలుగా ఇప్పటికే అనేక పీహెచ్‌సీలను ఏర్పాటు చేశారు. కేసీఆర్‌ కిట్లు, పౌష్టికాహారం అందేలా పథకాలను కొనసాగించేందుకు నిధులు కేటాయించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించే వారికి ఇప్పటి వరకు కేసీఆర్‌ కిట్లు ఇస్తున్నారు. పౌష్టికాహార లోపం ఉండటంతో బడ్జెట్‌లో నిధులు కేటాయించడంతో పథకం కొనసాగింపుపై ఆశలు చిగురించాయి.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు- 22
ఉపకేంద్రాలు- 126
పడకలు- 950
ఆరోగ్యశ్రీ - 1296
ఇప్పటి వరకు ఇచ్చిన కేసీఆర్‌ కిట్లు- 5796


పేదల కోసం..

పేదలు, బడుగు వర్గాలకు భరోసా కల్పించే దిశగా బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించారు. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి నిధులు కేటాయింపుతో పాటు స్థలం ఉన్న వారు ఇల్లు కట్టుకునేందుకు వీలుగా రూ.3 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. నియోజకవర్గానికి రెండువేలమంది వంతున జిల్లాలో 4వేలమందికి లబ్ధి కలగనుంది. దీనికి అదనంగా సీఎం కోటానుంచి కూడా కొంతమందికి నిధులు అందే అవకాశం ఉంది. జిల్లాలో ఇప్పటి వరకు 3,381 రెండుపడకగదుల ఇళ్లు మంజూరు కాగా.. ఇప్పటి వరకు కేవలం 478 మాత్రమే నిర్మించారు. తాజాగా స్థలం ఉన్న వారికి నిధులు కేటాయించేందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించడంపై హర్షం వ్యక్తమవుతోంది. జిల్లా మొత్తంలో స్థలం ఉన్న అర్హులు 58వేల మంది ఉన్నట్లు తేలింది. విడతల వారీగా నిధులు కేటాయించే వీలుంది.

రెండు పడక గదుల ఇళ్ల మంజూరు- 3,381
పూర్తయినవి - 478
ఇళ్ల స్థలాలు ఉన్న వారు - 58 వేల కుటుంబాలు
దళితబస్తీ పథకం అర్హులు- 1,832
భూ పంపిణీ- 4,672 ఎకరాలు
వెచ్చించిన మొత్తం రూ. 206.66 కోట్లు
నిధుల కేటాయింపు- రూ. 60 కోట్లు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని