logo

ఇంటి నెంబర్ల కథ ఇంతింత కాదయా!

ప్రభుత్వం సూచించిన విధంగా దరఖాస్తు చేసుకుంటే చేపట్టే నిర్మాణాలకు అనుమతులు లభిస్తాయి. ఆ తర్వాత వాటికి ఇంటి నెంబర్లను కేటాయిస్తారు. ఇది అంతటా జరిగేది.

Published : 07 Feb 2023 06:42 IST

చెన్నూరు పట్టణం, న్యూస్‌టుడే

ప్రభుత్వం సూచించిన విధంగా దరఖాస్తు చేసుకుంటే చేపట్టే నిర్మాణాలకు అనుమతులు లభిస్తాయి. ఆ తర్వాత వాటికి ఇంటి నెంబర్లను కేటాయిస్తారు. ఇది అంతటా జరిగేది. కానీ చెన్నూరు పురపాలికలో అందుకు విరుద్ధంగా చేస్తున్నారు. లేనిది ఉన్నట్లు కనికట్టు చేస్తున్నారు. ఖాళీ స్థలాలతోపాటు అక్రమంగా నిర్మించిన ఇళ్లకు ఇంటి నెంబర్లు కేటాయిస్తూ అక్రమాలకు తెరలేపుతున్నారు. గతకొంత కాలంగా పురపాలికలో ఇంటినెంబర్ల దందా సాగుతోంది. ఒక్కో ఇంటినెంబర్‌కు వేలల్లో వసూలు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఒక్కరిద్దరూ ప్రజాప్రతినిధులు కీలకంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

అక్రమ నిర్మాణాలకు అధికారిక ముద్ర..

ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తూ చెన్నూరులో అసైన్డు భూముల దందాను సాగిస్తున్నారు. పట్టణంలోని గెర్రెకాలనీ, లంబడిపల్లికి వెళ్లే మార్గంలో 858, 859, 869, 1046, 1047, 1048, తదితర సర్వేనెంబర్లలో ఉన్న అసైన్డు భూములను గతంలోనే గుంటలుగా మార్చి విక్రయించడంతో పలువురు కొనుగోలు చేశారు. చెన్నూరు పురపాలికగా రూపాంతరం చెందిన తర్వాత భూముల ధరలు  పెరగడంతో కొందరు దొడ్డిదారిన ఖాళీస్థలాలకు ఇంటినెంబర్లు పొందారు. ఇంటిపన్ను రషీదు, అసెస్‌మెంట్‌ కాపీ, టౌన్‌ప్లానర్‌ ఇచ్చిన మ్యాప్‌ ఆధారంగా భూమిని రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. మరికొందరు వాటిల్లో షెడ్ల నిర్మాణాలను చేపట్టారు. గెర్రెకాలనీలోని 63వ జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న అసైన్డు భూముల్లో పదులసంఖ్యలో అక్రమ షెడ్ల నిర్మాణాలను చేపట్టారు. కొందరు ఇంటినెంబర్లను పొందగా.. మరికొందరు ఖాళీ స్థలాలకు ఇంటినెంబర్లను దొడ్డిదారిన తీసుకొని ఇంటిపన్ను చెల్లిస్తున్నారు. ఈవ్యవహారంలో వేలాది రూపాయలు చేతులు మారుతున్నాయి. ప్రస్తుతం అసైన్డు భూముల్లో చేపట్టిన నిర్మాణాలకు నిబంధనలకు విరుద్ధంగా ఇంటినెంబర్లను పొందుతున్నట్లు తెలిసింది.. వాటి ఆధారంగానే విద్యుత్తు మీటర్లకు దరఖాస్తు చేస్తున్నట్లు సమాచారం.. గెర్రెకాలనీతో పాటు లంబడిపల్లికి వెళ్లే మార్గంలో కేటాయించిన ఇంటినెంబర్లను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే అక్రమాలు వెలుగులోకి వస్తాయి..

ఈ విషయమై పురపాలిక కమీషనర్‌ గంగాధర్‌ను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా తాను ఇటీవలే బాధ్యతలు స్వీకరించానని, దీనిపై పూర్తి వివరాలు తెలుసుకుంటానన్నారు.  


తన సతీమణి పేరున పొందిన ఇంటినెంబరు పత్రం

చెన్నూరు పురపాలికకు చెందిన ఓ ప్రజాప్రతినిధి వేలాది రూపాయలు దండుకొని అవసరమున్న వారికి అక్రమ షెడ్ల నిర్మాణాలతోపాటు ఖాళీ స్థలాలకు ఇంటి నెంబర్లు ఇప్పించాడు. ప్రజా సమస్యలను అంతగా పట్టించుకోని సదరు ప్రజాప్రతినిధి భూముల సెటిల్‌మెంట్లు చేయడంలో దిట్ట. ఇతడు గెర్రెకాలనీలో తన సతీమణి పేరున రెండు ఇంటి నెంబర్లు పొందారు.. వివాదంలో ఉన్న భూమిలో షెడ్డు నిర్మాణం చేపట్టి ఇంటినెంబర్‌ పొందగా ప్రత్యర్థి దానిని కూల్చివేయించాడు.. ఒక ఇంటినెంబర్‌ అధారంగా వివాదంలో ఉన్న భూమిని రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నట్లు సమాచారం.


ఖాళీ స్థలానికి ఓవ్యక్తి పొందిన ఇంటినెంబరు వివరాలు

గెర్రెకాలనీలో ఏఎంసీ ముందున్న 63వ జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న అసైన్డు భూమిని పలువురు వ్యక్తులు గుంటల చొప్పున కొనుగోలు చేసి షెడ్ల నిర్మాణాలు చేపట్టారు. వాటిని పురపాలిక అధికారులు కూల్చివేశారు. అందులోని కొందరు ఇంటి నెంబర్ల ఆధారంగా భూములను రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. ఆన్‌లైన్‌లో వారి వివరాలు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని