logo

దండు కట్టి.. జంగు లేపి

పత్తికి మద్దతు ధర కల్పించాలని రైతుహక్కుల పోరాట సమితి ఇచ్చిన బంద్‌ పిలుపు జిల్లా కేంద్రంలో విజయవంతమైంది. ఉదయం సమితి సభ్యులు, రైతులు జిల్లా కేంద్రంలో తిరిగి బంద్‌ చేయాలని కోరారు.

Published : 07 Feb 2023 06:42 IST

పత్తికి మద్దతు ధర కోసం రోడ్డెక్కిన అన్నదాతలు

జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారిపై ధర్నా చేస్తున్న రైతులు

ఆసిఫాబాద్‌, న్యూస్‌టుడే: పత్తికి మద్దతు ధర కల్పించాలని రైతుహక్కుల పోరాట సమితి ఇచ్చిన బంద్‌ పిలుపు జిల్లా కేంద్రంలో విజయవంతమైంది. ఉదయం సమితి సభ్యులు, రైతులు జిల్లా కేంద్రంలో తిరిగి బంద్‌ చేయాలని కోరారు. దీంతో హోటళ్లు, పాన్‌ టేలాలు, అన్నిరకాల వ్యాపార సంస్థలు మూసివేశారు. మధ్యాహ్నం వరకు వివిధ గ్రామాల నుంచి రైతులు జిల్లా కేంద్రానికి తరలివచ్చారు. స్థానిక అంబేడ్కర్‌ చౌక్‌ వద్ద నుంచి రైతులు పాదయాత్రగా బయల్దేరి చెక్‌పోస్టు, పెద్దవాగు మధ్య జాతీయ రహదారిపై బైఠాయించారు. మధ్యాహ్నం 12 గంటలకు ధర్నాకు కూర్చున్న అన్నదాతలు సాయంత్రం 4 గంటల వరకు లేవలేదు. దీంతో ఇరువైపులా కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఏటా సాగు వ్యయం పెరుగుతోందని, విత్తనాలు, ఎరువులు, మందుల ధరలు పెరుగుతున్నా.. పత్తి ధర మాత్రం పెరగడంలేదని వాపోయారు. ప్రజా ప్రతినిధుల వేతనాలు రెండు మూడింతలు పెంచుతున్న పాలకులు.. కర్షకులకు గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలం అవుతున్నట్లు ఆరోపించారు. క్వింటా పత్తికి రూ.15 వేల మద్దతు ధర కల్పించాలంటూ నినాదాలు చేశారు.

ఆసిఫాబాద్‌లో కర్షకుల ర్యాలీ

పలువురి అరెస్టు..

సాయంత్రం ఆర్డీవో రాజేశ్వర్‌, డీఎస్పీ శ్రీనివాస్‌, తహసీల్దార్‌ రామ్మోహన్‌రావు తదితరులు రైతులతో మాట్లాడారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని.. ధర్నా విరమించాలని నచ్చజెప్పారు. అయినా రైతులు వినలేదు. కొంతమంది రైతులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. దీంతో మిగతా రైతులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎస్‌హెచ్‌వో రాణాప్రతాప్‌ ఆధ్వర్యంలో పోలీసులు రాకపోకలు పునరుద్ధరించారు. ఉదయం డీఎస్పీ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో పట్టణంలో పలువురు ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు బందోబందు నిర్వహించారు. ధర్నాలో పోరాట కమిటీ సభ్యులు రూప్‌నార్‌ రమేశ్‌, కేశవరావు, శంకర్‌, ప్రణయ్‌, మారుతి, ప్రశాంత్‌, సందీప్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని