logo

ప్రవాసుని ధ్యేయం.. ప్రశంసనీయం

తాతలు, తండ్రుల జ్ఞాపకార్థం సమాధులు నిర్మించటం, గ్రామంలో ప్రజల సౌకర్యార్థం భవనాలను నిర్మించటం చూస్తుంటాం.

Published : 07 Feb 2023 06:45 IST

గ్రామంలో ఆలయం, ప్రార్థనా మందిర నిర్మాణాలు
న్యూస్‌టుడే, సొనాల(బోథ్‌)

మహారాష్ట్రలోని దహేగావ్‌లో అల్తాఫ్‌ నిర్మించిన శ్రీకృష్ణుడి ఆలయం

తాతలు, తండ్రుల జ్ఞాపకార్థం సమాధులు నిర్మించటం, గ్రామంలో ప్రజల సౌకర్యార్థం భవనాలను నిర్మించటం చూస్తుంటాం. కానీ మతాలకు అతీతంగా గ్రామంలో ఆనవాళ్లు కోల్పోకుండా శ్రీకృష్ణుడి ఆలయం, మసీదును నిర్మించి ఆదర్శంగా నిలిచారు అల్తాఫ్‌. ఊరంతా పచ్చదనం, ప్రతి ఇంటికి ఒకటి, రెండు పండ్ల చెట్లను పెంచుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని కిన్వట్ తాలూకా దహేగావ్‌ గ్రామవాసులు. సరిహద్దు ప్రాంతం నుంచి దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ గ్రామం.  ఈ గ్రామంలో దాదాపు 150 కుటుంబాలు ఉన్నాయి. మరాఠీలు, గోండులు, ముస్లింలు నివసిస్తున్నారు. గతంలో గ్రామానికి చెందిన ముస్లిం పీర్‌బాయి హిరానీ, తర్వాత కుమారుడు కరీంబాయి గ్రామ పెద్దలుగా ఉండేవారు. ఈయన కుమారుడు అల్తాఫ్‌ 20 ఏళ్ల వయసులో విదేశాలకు వెళ్లి స్థిరపడ్డాడు. దేశాలు దాటి వెళ్లినా సొంత ఊరిపై మమకారాన్ని మాత్రం మరవలేదు. సొంత గ్రామంలో తన పూర్వీకుల ఆనవాళ్లు ఉండాలనే ఉద్దేశంతో మతాలకు అతీతంగా వారి జ్ఞాపకార్థం శ్రీకృష్ణుడి ఆలయాన్ని, మసీదును నిర్మించారు. గ్రామంలో స్థలాన్ని కొనుగోలు చేసి రూ.20 లక్షలు ఖర్చు చేసి ఆలయాలను నిర్మించారు. కృష్ణుడి ఆలయంలో ఏటా కృష్ణాష్టమి పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. గ్రామంలో ఎలాంటి గొడవలు లేకుండా, కుల, మతాలకు తావులేకుండా గ్రామస్థులంతా ఒకే తాటిపై నిలుస్తున్నారు.  ఏటా గ్రామాభివృద్ధికి రూ.2 లక్షల వరకు అల్తాఫ్‌ పంపిస్తారని, రెండు, మూడు సంవత్సరాలకు ఒకసారి గ్రామానికి వచ్చి గ్రామస్థుల మంచి, చెడులు అడిగి తెలుసుకుంటారని గ్రామస్థులు తెలిపారు.

ఆలయంలో రాధ, కృష్ణుడి విగ్రహాలు

అల్తాఫ్‌ నిర్మించిన మసీదు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని