logo

ద్విచక్ర వాహనం ఉన్నా అనర్హులే

ద్విచక్ర వాహనం ఉంటే రెండు పడక గదుల ఇళ్లకు అనర్హులే అని అధికారులు ప్రకటించారు. ఆదిలాబాద్‌ పురపాలక సంఘం పరిధిలోని ఇళ్లు లేని నిరుపేదలకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల దరఖాస్తుల విచారణ పూర్తికావడంతో అర్హుల జాబితా సిద్ధం చేశారు.

Published : 19 Mar 2023 04:23 IST

రెండు పడక గదుల అర్హుల జాబితా తయారు
న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ పట్టణం

కేఆర్‌కే కాలనీలో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లు

ద్విచక్ర వాహనం ఉంటే రెండు పడక గదుల ఇళ్లకు అనర్హులే అని అధికారులు ప్రకటించారు. ఆదిలాబాద్‌ పురపాలక సంఘం పరిధిలోని ఇళ్లు లేని నిరుపేదలకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల దరఖాస్తుల విచారణ పూర్తికావడంతో అర్హుల జాబితా సిద్ధం చేశారు. అర్హుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో లబ్ధిదారులను లక్కీడ్రా పద్ధతిలో ఎంపిక చేయనున్నారు. ప్రస్తుతం ఎంపిక చేసిన వారి పేర్లు పుర కార్యాలయంలో బహిరంగంగా ప్రదర్శించనున్నారు. అందులోనూ ఎవరైనా అనర్హులుంటే అధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు.

ఆరేళ్లుగా పట్టణంలోని రెండు పడక గదుల ఇళ్లు లబ్ధిదారులను ఊరిస్తూనే ఉన్నాయి. కలెక్టర్‌ ఫిర్యాదుల విభాగంలో, ఎమ్మెల్యేకు వచ్చిన దరఖాస్తులు, తహసీల్దార్‌ కార్యాలయం, ఆర్డీఓ కార్యాలయాల్లో వచ్చిన దరఖాస్తులను ఒకచోట చేర్చారు. అలా 2016 నుంచి వస్తున్న దరఖాస్తులను భద్రపరిచారు. ఈ విషయంపై 2022 ఏప్రిల్‌ 4 నుంచి 6 వరకు పట్టణంలో వార్డుల వారీగా గ్రామసభలు నిర్వహించి దరఖాస్తుదారుల పేర్లు చదివి వారు ఉన్నారా? లేరా అనేది ఆరా తీశారు. ఇదే సమయంలో కొత్త దరఖాస్తులు సైతం స్వీకరించారు.

‘ఈనాడు’ కథనంతో విచారణ

గ్రామ సభలు నిర్వహించి పది నెలలు కావొస్తున్నా ప్రక్రియ స్తబ్ధుగా ఉండటంతో 2023 ఫిబ్రవరి 12వ తేదిన ‘ఈనాడు’లో ‘అవి ఉత్తుత్తి సభలేనా?’ శీర్షికన కథనం ప్రచురితమైంది. స్పందించిన అధికారులు ఎట్టకేలకు దరఖాస్తులన్నింటిపై ఇంటింటి విచారణ చేపట్టారు. రెవెన్యూ అధికారులు అందించిన జాబితాను వార్డుల వారీగా పుర సిబ్బంది జల్లెడ పట్టారు. కారుందా, సొంతిళ్లు ఉందా? ఆదాయమెంత? తదితర వివరాలన్నీ సేకరించారు. దీంతోపాటు ద్విచక్ర వాహనం ఉన్నా ఆ వివరాలను చేర్చారు. దీంతో చాలా వరకు దరఖాస్తులను తొలగించారు. వేలాది మందికి ద్విచక్ర వాహనాలు ఉండటంతో వారందరి పేర్లు అర్హుల జాబితా నుంచి తొలగించారు. ఎట్టకేలకు నిరుపేదలకు సంబంధించి అర్హుల జాబితాను రూపొందించారు.

982 ఇళ్లు సిద్ధం

పట్టణంలో లబ్ధిదారుల కోసం అపార్ట్‌మెంట్‌ తరహాలో ఇళ్లు నిర్మించారు. ఇందులో కేఆర్‌కే కాలనీలో 760, మావల గ్రామ సమీపంలో సర్వే నెం.170 పరిధిలో నాలుగు వరుసల జాతీయ రహదారికి ఆనుకొని మరో 222 ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేశారు. మొత్తం 982 ఇళ్లు సిద్ధంగా ఉన్నాయి.

ఆదిలాబాద్‌ అర్బన్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో అర్హులు, అనర్హుల దరఖాస్తులు వేరు చేస్తున్న అధికారులు

లక్కీడ్రా పద్ధతిలో ఎంపిక?

ఎంపిక చేసిన జాబితాలో పేర్లు, చిరునామాల వారీగా పుర కార్యాలయంలో ప్రదర్శిస్తారు. అభ్యంతరాలుంటే స్వీకరిస్తారు. ఒకవేళ అందులోనూ అనర్హులున్నట్లు ఆధారాలు సమర్పిస్తే వారి పేర్లు తొలగిస్తారు. ఇదే విషయంపై ఆదిలాబాద్‌ తహసీల్దార్‌ కార్యాలయం నుంచి పుర కార్యాలయానికి జాబితాను పంపించారు. నిర్మించిన ఇళ్ల సంఖ్య తక్కువగా ఉండడం, అర్హుల జాబితా ఎక్కువగా ఉండడంతో లక్కీడ్రా పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ఇది వరకే వేరే జిల్లాలోనూ లక్కీడ్రా పద్ధతి నిర్వహించడంతో ఇక్కడా అదే విధానం అమలు చేయనున్నట్లు భావిస్తున్నారు.

దరఖాస్తుల వివరాలు

మొత్తం దరఖాస్తులు : 9,194
విచారణలో తేలిన అర్హులు : 2,960
అనర్హులు : 6,234
సిద్ధంగా ఉన్న ఇళ్లు : 982


అభ్యంతరాలు స్వీకరించాకే..

పూర్తి విచారణ చేపట్టాకే అర్హుల జాబితాను రూపొందించాం. ద్విచక్ర వాహనం ఉన్నా వారి పేర్లు తొలగించాం. అర్హుల జాబితాను పుర కార్యాలయానికి పంపించాం. అక్కడ ప్రదర్శించాక అభ్యంతరాలుంటే తీసుకుంటాం. ఆ తరువాత లబ్ధిదారుల ఎంపిక ఎలా ఉంటుందనేది ఉన్నతాధికారులు నిర్ణయిస్తారు.

సతీష్‌కుమార్‌, తహసీల్దార్‌, ఆదిలాబాద్‌ అర్బన్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని