logo

బహుళ అంతస్తుల్లో.. భలే సౌకర్యాలు..

దినదినాభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో మంచిర్యాల ముందువరుసలో ఉంటుంది. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగంలో దాదాపు రాష్ట్రరాజధానితో పోటీపడుతోంది.

Published : 19 Mar 2023 04:23 IST

ఆటస్థలాలు..ఈతకొలనులతో ఇళ్ల నిర్మాణాలు..
న్యూస్‌టుడే, మంచిర్యాల సిటీ

మంచిర్యాలలో పచ్చదనంతో భవనం

దినదినాభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో మంచిర్యాల ముందువరుసలో ఉంటుంది. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగంలో దాదాపు రాష్ట్రరాజధానితో పోటీపడుతోంది. సింగరేణి సంస్థలో రిటైర్డ్‌ అధికారులు, కార్మికులతోపాటు మహారాష్ట్రకు అతి దగ్గరగా ఉన్న మంచిర్యాల లాంటి పట్టణాన్ని ఇతర రాష్ట్రాలకు చెందినవారు కూడా ఎంచుకుని స్థిరపడుతున్నారు. 20 ఏళ్ల ముందుగానే బహుళ అంతస్తుల భవనాలు మంచిర్యాలలో అందుబాటులోకి రాగా జిల్లాగా ఏర్పడిన తర్వాత మరింత ఊపందుకున్నాయి. గేటెడ్‌ కమ్యూనిటీల తరహాలో సకలసౌకర్యాలతో బహుళనిర్మాణాలు జరుగుతుండగా దాదాపు ప్రతీ కాలనీలో 5-10 విలాసవంతమైన భవనాలు ఉంటున్నాయి.

సొంత ఇల్లు ఉండాలి.. పట్టణానికి దగ్గరగా ఉండాలని చాలామంది కోరుకుంటారు. అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండాలని అందరూ ఆశిస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో మంచిర్యాల పట్టణంలో ఎటు చూసినా నిర్మాణాలే ఉండటంతో ఖాళీ స్థలాలు కరవయ్యాయి. చుట్టు పక్క పరిసరాల్లో ఉన్నా జిల్లా కేంద్రానికి దూరమవుతామనే భావన కలుగుతోంది. దీంతో సమీపంలోని బహుళ అంతస్తుల వైపు చూస్తున్నారు. దీనికి తోడు ఇక్కడి నిర్మాణరంగానికి చెందినవారు వీటికే మొగ్గు చూపిస్తున్నారు. అందరికి నచ్చేలా సకల సదుపాయాలు కల్పిస్తూ, నిర్మాణం చేపడుతూ ఆకట్టుకుంటున్నారు.

ఓ భవనంలో అందుబాటులో ఈతకొలను

నిర్మాణంలో చాలా మార్పులు..

బహుళ అంతస్తులను గతంలో మాదిరిగా నామమాత్రంగా నిర్మించామా.. విక్రయించామా అనే విధంగా కాకుండా అధునాతన పద్ధతులు, పేరుపొందిన ఇంజినీర్లు, అర్కిటెక్చర్ల పర్యవేక్షణలో నిర్మిస్తున్నారు. పిల్లలకు ఆటస్థలాలు, ఈత కొలనులు, పెద్దలకు వేర్వేరుగా క్లబ్‌లు, సేదతీరేందుకు ప్రత్యేక ఉద్యానవనాలు, అందరికోసం కమ్యూనిటీ హాళ్లు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. మొన్నటి వరకు ఒక్కో బహుళ అంతస్తు భవనంలో 15-20ఫ్లాట్లు మాత్రమే నిర్మించగా ప్రస్తుతం వీటికున్న డిమాండ్‌కు 40నుంచి 60వరకు అందుబాటులో ఉంటున్నాయి. 

వేలమందికి ఉపాధి

హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌ తర్వాత నిర్మాణరంగంలో మంచిర్యాల ముందువరుసలో ఉంటుందని ఇక్కడి సంబంధిత నిపుణులు చెబుతున్నారు. జాతీయస్థాయిలో పేరుపొందిన ఆయా రంగానికి చెందిన సంస్థ క్రెడాయ్‌.. మంచిర్యాలలో ఆరేళ్ల కిందటే ఏర్పాటు కావడమే ఇందుకు ఉదాహరణ అని అంటుంటారు. ఉమ్మడి జిల్లాలో మొదటిసారిగా రాష్ట్రస్థాయిలో ఎనిమిదో చాప్టర్‌గా(ప్రస్తుతం 15ఉన్నాయి) ప్రారంభమైంది. ఈ సంస్థలో మంచిర్యాలకు చెందినవారు వందమందికి పైగా ఉండగా నిర్మాణరంగంలో ఉన్నవారు సుమారు 500 మంది ఉన్నారు.భవన నిర్మాణాలతో దాదాపు 45 వేల కార్మికులు ఉపాధి పొందుతున్నారు.


అంతా కలిసి వేడుకలు..

పెద్ద నగరాల్లో మాదిరిగా.. బహుళ అంతస్తుల ఉంటున్నామంటే పక్కవారితో సంబంధం ఉండదనే భావన ఉంటుంది. కానీ మంచిర్యాల ఇందుకు విరుద్ధం. కులమతాలకు అతీతంగా అన్న, వదిన, అక్క, బావ, చెల్లి అంటూ ఏ ఆపదొచ్చినా అండగా ఉంటారు. ఏ సంబరమైనా అందరూ కలిసే చేసుకుంటారు. పండగలు, ఇతర వేడుకలే కాకుండా కిట్టీ పార్టీలతో వారం, వారం కలుస్తుంటారు. భవనాన్నే వేదికగా చేసుకుని ఆటపాటలతో ఆనందంగా గడుపుతుంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు