logo

బాబోయ్‌.. భాగ్యనగర్‌ రైలు

భాగ్యనగర్‌ రైలు సమయానికి రాక ప్రయాణికులు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగ, ఉపాధి, తదితర పనుల నిమిత్తం వేల మంది ప్రయాణికులు కాగజ్‌నగర్‌ నుంచి ఈ రైలులో రాకపోకలు సాగిస్తుంటారు.

Updated : 20 Mar 2023 12:46 IST

సహాయకులకూ ఇబ్బందే..

కాగజ్‌నగర్‌, న్యూస్‌టుడే: భాగ్యనగర్‌ రైలు సమయానికి రాక ప్రయాణికులు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగ, ఉపాధి, తదితర పనుల నిమిత్తం వేల మంది ప్రయాణికులు కాగజ్‌నగర్‌ నుంచి ఈ రైలులో రాకపోకలు సాగిస్తుంటారు. కాగజ్‌నగర్‌ నుంచి సికింద్రాబాద్‌ వరకు కొంత మేరకు ఫర్వాలేదు. కానీ సికింద్రాబాద్‌ నుంచి కాగజ్‌నగర్‌ ప్రయాణం నరకం కనిపిస్తోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న స్టేషన్లలో గంటల తరబడి నిలుపుతుండటంతో వ్యాధిగ్రస్థులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని, క్యాంటీన్‌ సదుపాయం కూడా లేకపోవడంతో ఆకలితో అలమటించాల్సి వస్తోందని వాపోతున్నారు. ఆ సమయంలో ఆర్టీసీ బస్సులు, ఇతర రైళ్లు లేకపోవడంతో గత్యంతరం లేక ఆ రైలునే ఆశ్రయించాల్సి వస్తోందని నిట్టూర్చుతున్నారు.

పారిశ్రామిక ప్రాంతమైన కాగజ్‌నగర్‌ నుంచి సికింద్రాబాద్‌కు రోజూ భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు వేకువజామున 3.35 నిమిషాలకు ప్రారంభమై ఉదయం 10.40 నిమిషాలకు సికింద్రాబాద్‌ జంక్షన్‌ చేరుకుంటుంది. కాగజ్‌నగర్‌ నుంచి సికింద్రాబాద్‌ 296 కిలోమీటర్ల పరిధిలో 29 రైల్వేస్టేషన్లలో నిలుపుదల ఉంది. అదే రైలు మధ్యాహ్నం 3.35 గంటలకు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి ప్రారంభమై కాగజ్‌నగర్‌కు రాత్రి 10.05 నిమిషాలకు చేరుకోవాలి. కానీ తీవ్రమైన జాప్యం నెలకొంటుంది.

క్రాసింగ్‌ పేరిట కాలయాపన

సికింద్రాబాద్‌ నుంచి కాగజ్‌నగర్‌ బయల్దేరిన భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆసిఫాబాద్‌ రైల్వేస్టేషన్‌కు రాత్రి 9 గంటల వరకు చేరుకుంటుంది. ఆసిఫాబాద్‌ నుంచి కాగజ్‌నగర్‌కు 19 కి.మీ. దూరం. ఆ సమయంలో పలు ఎక్స్‌ప్రెస్‌లు, గూడ్స్‌ రైళ్లు బల్లార్ష నుంచి సికింద్రాబాద్‌కు వెళతాయి. దీంతో క్రాసింగ్‌ నిమిత్తం రైలును ఆ స్టేషన్‌లోనే నిలిపివేస్తారు. ఆ రైళ్లు వెళ్లిన తర్వాతే కాగజ్‌నగర్‌కు పంపిస్తుంటారు. క్రాసింగ్‌ పేరిట రైల్వే అధికారులు పలు సందర్భాల్లో రెబ్బెన, రాళ్లపేట రైల్వేస్టేషన్లలోనే భాగ్యనగర్‌ రైలు నిలుపుతారు. స్టేషన్‌ లేనిచోట, అటవీ ప్రాంతంలోనూ ఆపుతున్నారు.

* కాగజ్‌నగర్‌ నుంచి కాజీపేట వరకు ప్యాసింజర్‌ టిక్కెట్టు, కాజిపేట నుంచి సికింద్రాబాద్‌ వరకు ఎక్స్‌ప్రెస్‌ రైలుగా టిక్కెట్టు రుసుం వసూలు చేసేవారు. రెండేళ్ల క్రితం భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌గా మార్చారు. అయినప్పటికీ సమయపాలన ఏమాత్రం పాటించడం లేదు.

* అధికారులు ఏమన్నారంటే..: ప్రయాణికుల ఫిర్యాదు మేరకు జాప్యం విషయం పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని స్థానిక రైల్వే అధికారులు తెలిపారు. ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటామన్నారు.

గురువారం అర్ధరాత్రి 1.30 గంటలకు సికింద్రాబాద్‌- కాగజ్‌నగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు కాగజ్‌నగర్‌ స్టేషన్‌కు చేరింది. ఆ రైలు మధ్యాహ్నం 3.35 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయల్దేరి కాగజ్‌నగర్‌కు రాత్రి 10.05 నిమిషాలకు చేరుకోవాలి. మూడు గంటలపైనే ఆలస్యంగా రావడంతో ప్రయాణికులు, వారిని తీసుకెళ్లడానికి స్టేషన్‌కు వచ్చిన సహాయకులు ఇబ్బందులు పడ్డారు. ఈ ఆలస్యం ఒక్కరోజు మాత్రమే కాదు. నిత్యం ఇదే సమస్య ఎదురవుతోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయం లేకపోవడంతో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది.


మూడు గంటలకుపైగా నిలిపారు..

పి.జ్ఞానేశ్వర్‌, వ్యాపారి

రైలు మధ్యాహ్నం 3.30 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయల్దేరి ఆసిఫాబాద్‌ రోడ్డు వరకు బాగానే వచ్చింది. ఆ స్టేషన్‌లో క్రాసింగ్‌ల పేరిట మూడు గంటలపైగా నిలిపివేశారు. మళ్లీ పెద్దవాగు వద్ద అరగంట నిలిపారు. తరచూ ఇదే సమస్య ఎదురవుతుంది. వివిధ రకాల వ్యాధిగ్రస్థులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే ఉన్నతాధికారులు స్పందించి క్రాసింగ్‌ పేరిట జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని