logo

రిమ్స్‌ నిండా నిర్లక్ష్యం!

రాజీవ్‌గాంధీ వైద్య విజ్ఞాన సంస్థ(రిమ్స్‌)లో కొందరు వైద్యుల తీరు ఏ మాత్రం మారటం లేదు. సొంత దవాఖానాలకు ప్రాధాన్యమిస్తూ రిమ్స్‌కు చికిత్స నిమిత్తం వచ్చే నిరుపేద రోగుల పట్ల వారు ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరి ఆ సంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తోంది.

Published : 23 Mar 2023 05:56 IST

మారని వైద్యుల తీరు
న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ వైద్య విభాగం

రాజీవ్‌గాంధీ వైద్య విజ్ఞాన సంస్థ(రిమ్స్‌)లో కొందరు వైద్యుల తీరు ఏ మాత్రం మారటం లేదు. సొంత దవాఖానాలకు ప్రాధాన్యమిస్తూ రిమ్స్‌కు చికిత్స నిమిత్తం వచ్చే నిరుపేద రోగుల పట్ల వారు ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరి ఆ సంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తోంది. ఉదయం 9 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు విధులు నిర్వహించాల్సిన వైద్యులు ఒంటి గంట అనంతరం ఆసుపత్రిలో కనబడకుండా పోతున్నారు.  అత్యవసర పరిస్థితి ఏర్పడితే వైద్యులు అందుబాటులో లేకపోవటం రోగులకు ప్రాణసంకటంగా మారుతోంది. మధ్యాహ్నం అనంతరం ఆసుపత్రిలోని అన్ని వార్డులకు కేవలం హౌస్‌ సర్జన్లు(జూనియర్‌ వైద్యులు) మాత్రమే పెద్ద దిక్కు అవుతున్నారు. అత్యవసరమైనా తరచూ పలు శస్త్ర చికిత్సలను వాయిదా వేస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే ఏదో ఒక సాంకేతిక కారణం చెప్పి చేతులెత్తేస్తున్నారు. కొన్ని యంత్రాలు ఏళ్ల తరబడి మూలనపడి ఉండటంతో నిర్ధారణ ఫలితాల కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది.  

గడువు ముగిసిన మాత్రలు  

ఈ చిత్రంలో కనిపిస్తున్నవి హృద్రోగులకు ఇచ్చే మాత్రలు. వీటి తయారీ తేది మార్చి-2021గా ముద్రితమై ఉంది. చివరి గడువు ఫిబ్రవరి-2023గా ఉంది. కాల పరిమితి కిందటి నెలలో అయిపోయినా సోమవారం ఈ మాత్రలను బాధితునికి సిబ్బంది అందజేశారు. ఇక్కడకు వచ్చేది చదువు రాని వారే. ఏదైనా ఇబ్బందులు తలెత్తితే ప్రాణాలకే ప్రమాదం.  

వైద్యుల నిర్లక్ష్యం ఇలా..

జైనథ్‌ మండలం దీపాయిగూడకు చెందిన యువకుడు వినోద్‌ ఈ నెల 16న కిడ్నీ సమస్యతో రిమ్స్‌లో చేరాడు. చికిత్స పొందుతూ 17న మధ్యాహ్నం వరకు బాగానే ఉన్నా తర్వాత వాంతులు చేసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. సహాయకురాలిగా ఉన్న తల్లి సునీత స్టాఫ్‌నర్సు వద్దకు వెళ్లి విషయం వివరించింది. ఆ సమయంలో ఆ వార్డులో ఉండాల్సిన వైద్యులెవరూ అందుబాటులో లేరు. స్టాఫ్‌నర్సు ఆ వైద్యులను సంప్రదించటానికి ప్రయత్నించినా వారు అందుబాటులోకి రాలేదు. బాధితుడిని ఎంఐసీయూ వార్డుకు తరలించేలోపు దాదాపు ఒక గంట సమయం గడిచిపోయింది. అప్పటికే ఆ యువకుడు మృతి చెందాడు.

శస్త్ర చికిత్సలు వాయిదా

ఇటీవలి కాలంలో పలువురు మహిళలు గర్భసంచి ఇబ్బందులతో బాధపడుతున్నారు. ఆర్థిక స్తోమత ఉన్న వారు ప్రైవేటు ఆసుపత్రుల్లో శస్త్ర చికిత్సలు చేయించుకుంటున్నారు. నిరుపేద బాధితులు మాత్రం రిమ్స్‌ చుట్టూ తిరుగుతూ ఇబ్బందుల పాలవుతున్నారు. వీరికి శస్త్ర చికిత్సలను వైద్యులు రోజుల తరబడి వాయిదా వేస్తున్నారు. బేల మండలం సాంగిడి, సయీద్‌పూర్‌కు చెందిన ఇద్దరు మహిళలు 20 రోజుల కిందట ఇదే సమస్యతో రిమ్స్‌లో చేరారు. వారికి శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుందని, నమూనాలను నిర్ధారణ పరీక్షలకు పంపించారు. అనంతరం వారిని ఇంటికి పంపించేశారు. సేకరించిన నమూనాల ఫలితాలు వచ్చాక పిలిపిస్తామని చెప్పి పంపించేశారు.  

అయిదేళ్లుగా మూలకే..  

ఇది రిమ్స్‌లోని ‘టిష్యూ ప్రాసెసింగ్‌’ యంత్రం. అయిదేళ్లుగా పాడై మూలన పడి ఉంది. కడుపులో, ఇతర చోట్ల గడ్డలు ఉంటే నమూనాలను ఈ యంత్రంలో పరీక్షించి క్యాన్సర్‌ ఉందా? లేదా? అనేది నిర్ధారిస్తారు. రెండు, మూడు గంటల్లోనే ఫలితం వస్తుంది. ఈ యంత్రం మూలన పడి ఉండటంతో సాంకేతిక సిబ్బంది ఒక్కో నమూనాకు నిర్ధారణ పరీక్ష చేసి ఫలితం రాబట్టడానికి దాదాపు 12 గంటల సమయం పడుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని