logo

క్షయ అంతం వైపు అడుగులు..

క్షయ (టీబీ-ట్యూబర్‌ క్లోసిస్‌) అంటేనే పలువురు ఆమడదూరం పారిపోతుంటారు. ఇంతగా భయపెడుతున్న ఈ వ్యాధి నిరక్షరాస్యత, అవగాహన లోపం, ముందు జాగ్రత్తలు తీసుకోకపోవటంతో చాపకింద నీరులా విస్తరిస్తూనే ఉంది.

Updated : 23 Mar 2023 06:51 IST

వ్యాధి గుర్తింపు, చికిత్సల్లో ఆదిలాబాద్‌ జిల్లాకు నాలుగో స్థానం
ఆదిలాబాద్‌ వైద్య విభాగం, న్యూస్‌టుడే

జిల్లా కేంద్రంలోని క్షయ నివారణ కార్యాలయం

క్షయ (టీబీ-ట్యూబర్‌ క్లోసిస్‌) అంటేనే పలువురు ఆమడదూరం పారిపోతుంటారు. ఇంతగా భయపెడుతున్న ఈ వ్యాధి నిరక్షరాస్యత, అవగాహన లోపం, ముందు జాగ్రత్తలు తీసుకోకపోవటంతో చాపకింద నీరులా విస్తరిస్తూనే ఉంది. 2025 నాటికి దేశవ్యాప్తంగా క్షయను నిర్మూలించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం, వ్యాధిగ్రస్థుల గుర్తింపు, బాధితులకు చికిత్సలు అందించటం తదితర చర్యలు ముమ్మరం చేసింది. ఈ నెల 24న ‘ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం’ నేపథ్యంలో.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. క్షయ నుంచి రక్షణ, నివారణోపాయాల గురించి సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం కొనసాగిస్తున్నారు. వ్యాధి నిర్ధారణ గుర్తింపు, చికిత్సలు అందించటంలో ఆదిలాబాద్‌ జిల్లా రాష్ట్రంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. మెదక్‌, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు వరుసగా.. 93.0, 61.8, 61.8 పాయింట్లు సాధించి మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. ఉమ్మడి జిల్లాలోని మిగతా జిల్లాలో మొదటి పది స్థానాల్లో లేకుండా పోయాయి.

క్షయను పూర్తిగా అంతం చేయటానికి, బాధితులు చికిత్స కోసం ముందుకొచ్చేలా ప్రోత్సహించటానికి వ్యాధిగ్రస్థులకు రవాణా ఛార్జీలు, పోషకాహారం కోసం ప్రతి నెలా రూ.500 నగదు అందజేస్తుంది. ప్రైవేటు వైద్యులు టీబీ రోగులను గుర్తిస్తే వారికి సైతం ప్రోత్సాహకంగా రూ.500 అందజేస్తోంది. గిరిజన ప్రాంత బాధితులకు చికిత్స అనంతరం అదనంగా రూ.750 చెల్లిస్తున్నారు. ఇన్ని చర్యలు తీసుకున్నా.. వ్యాధి విస్తరిస్తూనే ఉంది. గతంలో అనుమానితులు టీబీ నిర్ధారణ కోసం ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం గ్రామాల్లోనూ శిబిరాలు ఏర్పాటు చేసి రోగులను గుర్తిస్తున్నారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తెమడ పరీక్ష చేస్తున్నారు.

ఆరోగ్య మేళాలు  

ప్రతి నెల 14వ తేదీన అన్ని ఆరోగ్య ఉపకేంద్రాలు, వెల్‌నెస్‌ సెంటర్లలో ఆరోగ్య మేళాలను నిర్వహిస్తున్నారు. వీటిలో టీబీ నివారణపై అవగాహన కల్పించటంతోపాటు అనుమానితులను గుర్తించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. నిర్ధారణ అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ, వారికి మందులను అందజేస్తున్నారు.


అందుబాటులో చికిత్సలు  
మిట్పల్లివార్‌ శ్రీకాంత్‌, క్షయ నివారణ కార్యక్రమ అధికారి

క్షయ వ్యాధికి ప్రస్తుతం చికిత్స అందుబాటులో ఉంది. ఏ మాత్రం అనుమానం ఉన్నా పరీక్షలు చేయించుకోవాలి. ఆరు నెలలపాటు మందులు వాడితే పూర్తిగా నయమవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని