logo

సాంకేతిక వినియోగంలో వెనుకబాటు

కరోనా ప్రభావంతో నిత్య జీవితంలో సాంకేతిక వినియోగం బాగా పెరిగింది. కానీ జిల్లాలో అవగాహన లేక చాలామంది ఆ సౌకర్యాలు వాడుకోవడం లేదు.

Published : 23 Mar 2023 06:09 IST

ఇంటి వద్ద సెల్ఫ్‌ మీటర్‌ రీడింగ్‌ తీస్తున్న యువతి

విద్యుత్తు బిల్లులపై కరవైన అవగాహనఆసిఫాబాద్‌, న్యూస్‌టుడే: కరోనా ప్రభావంతో నిత్య జీవితంలో సాంకేతిక వినియోగం బాగా పెరిగింది. కానీ జిల్లాలో అవగాహన లేక చాలామంది ఆ సౌకర్యాలు వాడుకోవడం లేదు. దీంతో వ్యయప్రయాసలు తప్పడం లేదు. విద్యుత్తు బిల్లుల విషయంలో డిజిటల్‌ విధానంలో చెల్లింపులు జరుగుతున్నా.. సెల్ఫ్‌ మీటర్‌ రీడింగ్‌ తీసుకోవడంలో ఇంకా చాలామందికి అవగాహన కరవైంది.

ప్రతినెలా విద్యుత్తుబిల్లులను ఆ శాఖ ఏర్పాటు చేసిన కౌంటర్‌ వద్దకు వెళ్లి బిల్లు చెల్లిస్తుంటారు. ఇంటినుంచే చరవాణి ద్వారా బిల్లు చెల్లించడం, మీటర్‌ రీడింగ్‌ సొంతంగా(సెల్ఫ్‌) తీయడం కోసం ఆ శాఖ ప్రత్యేక యాప్‌లను అమలులోకి తెచ్చింది. ఫోన్‌ పే, గుగూల్‌ పే, పేటీఎం వంటివే కాకుండా టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌ ప్రత్యేక యాప్‌ ద్వారాను డిజిటల్‌ విధానంలో బిల్లు చెల్లించవచ్చు. జిల్లాలో ఈ విధానంలో చెల్లింపులు పదుల సంఖ్యలో మాత్రమే జరుగుతున్నాయి.

ఆసిఫాబాద్‌లో ఆరుగురే..

జిల్లాలో గృహవిద్యుత్తు కనెక్షన్లు 86 వేల వరకు ఉండగా.. ఫిబ్రవరి నెల డిమాండ్‌ రూ.2.47 కోట్లు. వారిలో 10,071 మంది డిజిటల్‌ విధానంలో రూ.1.08 కోట్లు బిల్లు చెల్లించారు. మిగతా వారు కౌంటర్ల వద్దకు నేరుగా వెళ్లి చెల్లించారు. మార్చిలో ఇప్పటి వరకు కాగజ్‌నగర్‌ డివిజన్‌లో 30 మంది, ఆసిఫాబాద్‌ డివిజన్‌లో ఆరుగురు మాత్రమే సెల్ఫ్‌ మీటర్‌ రీడింగ్‌ తీసినట్లు విద్యుత్తు అధికారులు చెబుతున్నారు.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..

గుగూల్‌ ప్లే స్టోర్‌ నుంచి టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌ ఐటీ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. దానిని క్లిక్‌ చేస్తే డాష్‌బోర్డుపై కనిపించే వాటిలో ‘సెల్ఫ్‌ రీడింగ్‌’పై నొక్కాలి. నిర్ధారించుకోవడానికి మళ్లీ సబ్‌మిట్‌ చేసి.. ఎనిమిది సంఖ్యల యూనిక్‌ సర్వీస్‌ నంబర్‌(యూఎస్‌సీ)ను నమోదు చేయాలి. సర్వీస్‌ వివరాలు సరిచూసుకోవాలి. స్కాన్‌ కేడబ్ల్యూహెచ్‌పై క్లిక్‌ చేస్తే వెంటనే భారత్‌ స్మార్ట్‌ సర్వీసెస్‌ యాప్‌లోకి వెళతారు. దీనిని ఇన్‌స్టాల్‌ చేసి స్వయంగా మీటర్‌ రీడింగ్‌ తీసుకోవచ్చు. రీడింగ్‌ తీసుకొని సబ్‌మిట్‌పై క్లిక్‌ చేసి చరవాణి సంఖ్య నమోదు చేయాలి. దానికి బిల్లు ఎస్‌ఎంఎస్‌ రూపంలో వస్తుంది. అనంతరం అంతర్జాలం ద్వారా బిల్లు చెల్లించవచ్చు.


సమయం ఆదా అవుతుంది..

వి.వాసుదేవ్‌, జిల్లా విద్యుత్తు శాఖ ఎస్‌ఈ

డిజిటల్‌ విధానంతో అన్నివిధాలా మేలు జరుగుతోంది. విద్యుత్తు బిల్లుల చెల్లింపు, మీటర్‌ రీడింగ్‌ తీసుకోవడం వంటివి చరవాణి ద్వారానే చేయవచ్చు. సమయం ఆదా అవుతుంది.


స్లాబు మారకుండా చక్కని ఉపాయం..

మీటర్‌ రీడింగ్‌ తీసేందుకు విద్యుత్తు సిబ్బంది వచ్చే వరకు ఎదురుచూడాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి సిబ్బంది 5 నుంచి 10 రోజులు ఆలస్యంగా వస్తే యూనిట్లు పెరిగి స్లాబు మారి బిల్లు పెరుగుతుందని కొందరు ఆందోళన చెందుతుంటారు. అలాంటి వాటికి తావులేకుండా వినియోగదారులే చరవాణి ద్వారా స్వతహాగా (సెల్ఫ్‌) రీడింగ్‌ తీసుకోవచ్చు. ప్రతినెలా ఏ తేదీన తీస్తారో.. తదుపరి నెలలో ఆ తేదీకి రెండురోజుల ముందు, తరువాత రెండురోజుల వరకే సెల్ఫ్‌ రీడింగ్‌ తీసుకునే అవకాశం ఉంటుంది. ఉదా. ఫిబ్రవరిలో 5వ తేదీన సెల్ఫ్‌ రీడింగ్‌ తీశారు అనుకుందాం. మార్చిలో 3, 4, 6, 7 ఈ తేదీల్లోనే మళ్లీ తీయాల్సి ఉంటుంది.


మధ్యవర్తికి ఇచ్చి పరేషాన్‌..

తిర్యాణి మండలం గంభీరావుపేటలో గతేడాది ఓ విద్యుత్తు వినియోగదారుడు బిల్లు చెల్లించమని మధ్యవర్తికి రూ.2 వేలు ఇచ్చాడు. కానీ ఆయన చెల్లించకుండా సొంత పనులకు వాడుకున్నాడని ఆలస్యంగా తెలిసింది. కొన్నిరోజుల తర్వాత విద్యుత్తు సిబ్బంది వచ్చి బిల్లు చెల్లించాలని ఇంటికి రావడంతో సదరు వినియోగదారుడు ఆందోళన చెందాడు. వారం క్రితమే రూ.రెండు వేలు చెల్లించానని.. మళ్లీ ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు. అధికారులు ఆన్‌లైన్‌ వివరాలు చూపించడంతో తప్పు జరిగిందని గ్రహించాడు. అదే అంతర్జాలం ద్వారా చెల్లిస్తే.. ఇలాంటి ఇబ్బందులు ఉండవు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని