logo

అందని సాయం.. అన్నదాతల అయోమయం

కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్‌ యోజనలో ఏటా లబ్ధిదారుల సంఖ్య తగ్గుతోంది. పట్టా పాసుపుస్తకం పొందిన రైతుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో చేర్చకపోవడం, నిబంధనల మేరకు కొంత మంది రైతుల పేర్లను తొలగించడంతో పీఎం కిసాన్‌ యోజన కింద సాయం పొందే రైతుల సంఖ్య తగ్గిపోతోంది.

Updated : 23 Mar 2023 06:31 IST

ఏటా తగ్గుతున్న పీఎం కిసాన్‌ లబ్ధిదారుల సంఖ్య
న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ వ్యవసాయం

కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్‌ యోజనలో ఏటా లబ్ధిదారుల సంఖ్య తగ్గుతోంది. పట్టా పాసుపుస్తకం పొందిన రైతుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో చేర్చకపోవడం, నిబంధనల మేరకు కొంత మంది రైతుల పేర్లను తొలగించడంతో పీఎం కిసాన్‌ యోజన కింద సాయం పొందే రైతుల సంఖ్య తగ్గిపోతోంది. రైతుబంధు పథకం మాదిరిగానే.. కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి సాయంగా ఏటా ఎకరానికి రూ.2 వేల చొప్పున మూడు విడతల్లో రూ.6 వేలు పెట్టుబడి సాయంగా రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. జిల్లాలో చాలా మంది రైతులకు పీఎం కిసాన్‌ యోజన కింద రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావడం లేదు. ఎందుకు రావడం లేదనే వివరాలను మండల, జిల్లా స్థాయిలో చెప్పేవారే లేరు. ఇలా చాలా మంది రైతులు డబ్బులు జవకాక ఆందోళన చెందుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం 2018 ఫిబ్రవరి 1న పీఎం కిసాన్‌ యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 13 దఫాలుగా రైతులకు సాయం అందింది. రాష్ట్ర ప్రభుత్వం మాదిరిగా పట్టా పాసు పుస్తకం ఉన్న ప్రతి రైతుకు కాకుండా కొన్ని నిబంధనల మేరకు పీఎం కిసాన్‌ నిధులు జమ అవుతున్నాయి. గతేడాది కొత్తగా పథకం కింద నగదు పొందాలంటే ప్రతి రైతు ఈకేవైసీని చేసుకోవాలని సూచించింది. ఇందుకు మూడు నెలలు గడువు ఇచ్చింది. అవగాహన లేని రైతులు కొంత మంది ఇప్పటి వరకు ఈకేవైసీని సమర్పించలేదు. 90 శాతం పూర్తి చేసుకున్నా.. కొంత మంది రైతుల ఖాతాల్లో నిధులు జమ కాకపోవడం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతుల ఖాతాల్లో కాకుండా కుటుంబీకుల ఖాతాల్లో జమ కాగా, మరి కొంతమందికి జమ చేసినట్లుగా సంక్షిప్త సందేశం వచ్చినా బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ కాలేదు. ఈ విషయమై ఎవరిని సంప్రదించాలో తెలియని పరిస్థితి ఉంది.

నిరాశే ఎదురవుతోంది..

కొత్తగా పట్టాపాసు పుస్తకాలను తీసుకున్న రైతులు 10 వేల మందికి పైగా ఉన్నారని అధికారులు అంటున్నారు. ప్రజాప్రతినిధులు ఈ విషయంపై దృష్టి సారించి, సమస్యను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళితే మేలు జరుగుతుందనే అభిప్రాయాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు. ఈకేవైసీ చేసుకోవడంతో నిబంధనల ప్రకారంగా అనర్హుల సంఖ్య మాత్రమే తగ్గిందని అధికారులు అంటున్నారు.

నిబంధనలే కారణమా?

కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే పీఎం కిసాన్‌ నిధులు జమ చేయడంలో ప్రభుత్వం కొన్ని నిబంధనలు అమలు చేస్తోంది. బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ అనుసంధానం లేని రైతుల ఖాతాల్లో నిధులు జమ కాలేదు. ఆదాయం పన్ను చెల్లించే వారిని పథకంలో నుంచి తొలగించారు. రేషన్‌కార్డుల ప్రకారంగా కుటుంబంలో ఒక్కరికే పథకాన్ని అమలు చేయడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, నెలకు రూ.10 వేల కంటే అధికంగా పింఛను తీసుకునేవాళ్లని క్రమంగా తొలగిస్తున్నారు. నిబంధనల మేరకు అనర్హులను గుర్తిస్తూ పథకం నుంచి తొలగిస్తుండటంతో లబ్ధిదారుల సంఖ్య తగ్గుతోందని అధికారులు అంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని