logo

భారాస బలోపేతం దిశగా..

ఈ ఏడాదిలోనే శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార భారాసను మరింత బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది.

Published : 23 Mar 2023 06:46 IST

 నేటి నుంచి ఆత్మీయ సమ్మేళనాలు

సోన్‌ వద్ద  సభా ఏర్పాట్లపై చర్చిస్తున్న భారాస జిల్లా నాయకులు  

నిర్మల్‌, న్యూస్‌టుడే : ఈ ఏడాదిలోనే శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార భారాసను మరింత బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు పార్టీ శ్రేణులందరినీ ఏకం చేయడానికి నిర్వహిస్తున్న ఈ సమ్మేళనాలతో రాజకీయ వేడి మొదలుకానుంది. రానున్న ఎన్నికల కోసం పార్టీ కార్యకర్తలను సన్నద్ధం చేయడంతో భాగంగా పట్టణాల్లోని వార్డుల్లో, మండలాల వారీగా చేపట్టనున్న ఈ సమ్మేళనాలు ప్రాధాన్యం సంతరించుకోనున్నాయి. నిర్మల్‌ నియోజకవర్గంలో తొలి ఆత్మీయ సమ్మేళనం నర్సాపూర్‌(జి) మండల కేంద్రంలో నిర్వహించనున్నారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితోపాటు పార్టీ జిల్లా ఇన్‌ఛార్జి గంగాధర్‌గౌడ్‌, పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరుకానున్నారు. 24న దిలావర్‌పూర్‌, 25న సోన్‌, 26న లక్ష్మణచాంద, 27, 28లలో మామడ, ఏప్రిల్‌ 2, 3న నిర్మల్‌ గ్రామీణ మండలం, 4, 5న సారంగాపూర్‌లలో, 6 నుంచి 12 వరకు నిర్మల్‌ పట్టణంలో ఈ ఆత్మీయ సమ్మేళనాలు చేపట్టాలని నిర్ణయించారు.

ప్రతిపక్ష పార్టీల దూకుడుకు అడ్డుకట్ట

ఎన్నికల సమీపిస్తున్న క్రమంలో ప్రతిపక్ష పార్టీల దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి భారాస పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నట్లు ఆ పార్టీ శ్రేణులు స్పష్టం చేశారు. భారాస పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా తిప్పికొట్టడానికి తీసుకునే చర్యలపై చర్చించనున్నారు. పకడ్బందీ కార్యాచరణతో ప్రజలను ఆత్మీయంగా దగ్గర తీసుకుని పార్టీని మరింత పటిష్ఠం చేయడానికి ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టారు. నియోజకవర్గంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నేతృత్వంలో ఈ కార్యాచరణను పకడ్బందీగా అమలు చేయనున్నారు. ఆత్మీయ సమ్మేళనాలతో పార్టీ సీనియర్‌ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుని అధిష్ఠానానికి వివరించనున్నారు.

అసంతృప్తిని చల్లార్చేందుకు..

భారాస పార్టీ కొంతమంది ప్రజాప్రతినిధులు, బడా నాయకులే పెత్తనం చేస్తుండటంతో సాధారణ కార్యకర్తల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. గతంలో గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి పనులను నామినేషన్‌ ప్రాతిపదికన అప్పగించడంతో రెట్టించిన ఉత్సాహంతో పార్టీ కోసం కష్టపడి పనిచేశారు. ఎన్నికల్లోనూ అన్నింట్లోనూ ముందుండి అభ్యర్థుల గెలుపునకు తీవ్రంగా కృషి చేశారు. భారాస రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కార్యకర్తలను పట్టించుకునే వారు కరవయ్యారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. శాసనసభ ఎన్నికలు దగ్గర్లోనే ఉన్న క్రమంలో అసంతృప్తితో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు దగ్గర తీయడానికి ఈ ఆత్మీయ సమ్మేళనాలు వేదికలు కానున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పార్టీలో అసంతృప్తితో ఉన్న వారిని తిరిగి క్రియాశీలకం చేయనున్నట్లు తెలిసింది. ఎమ్మెల్యేలుగా మూడోసారి గెలుపొందడానికి ఈ ఆత్మీయ సమ్మేళనాలు ఎన్నికల వేదికలు కానున్నట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నారు. గురువారం నుంచి నిర్మల్‌ నియోజకవర్గంలో ఈ సమ్మేళనాలు మొదలుకానుండగా.. వారం రోజుల వ్యవధిలో ముథోల్‌, ఖానాపూర్‌ నియోజకవర్గాల్లోనూ చేపట్టడానికి ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, రేఖానాయక్‌లు పార్టీ నాయకులతో కలిసి కసరత్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని