logo

కలిసికట్టుగా.. కష్టాల్లో తోడుగా

వారిది ముందుచూపుతో కూడిన లక్ష్యం. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చాలు మేమున్నామంటూ ముందుకొస్తారు. ఉడతాభక్తిగా చేతనైనంత సాయం అందించి ఆపదలో ఉన్నవారికి చేదోడుగా నిలుస్తారు.

Published : 24 Mar 2023 02:58 IST

ప్రశంసలు అందుకుంటున్న గ్రామీణ సపోర్ట్‌ ఫౌండేషన్‌

కుభీరు, న్యూస్‌టుడే: వారిది ముందుచూపుతో కూడిన లక్ష్యం. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చాలు మేమున్నామంటూ ముందుకొస్తారు. ఉడతాభక్తిగా చేతనైనంత సాయం అందించి ఆపదలో ఉన్నవారికి చేదోడుగా నిలుస్తారు. విద్య, వైద్యం, ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్న గ్రామీణ సపోర్ట్‌ ఫౌండేషన్‌ కార్యక్రమాలు ప్రజల్లో స్ఫూర్తిని నింపుతున్నాయి.

నిర్మల్‌కు చెందిన యువ ఇంజినీరు కడారి నరేశ్‌ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు లేక భావితరం పడుతున్న కష్టాలను చూశారు. అప్పట్లోనే ఓ లక్ష్యాన్ని ఎంచుకున్నారు. ఉన్నత విద్యను పూర్తిచేసి ఇంజినీరుగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సమాజంలో కష్టాలు అనుభవిస్తున్నవారికి తోడుగా నిలవాలనే సంకల్పంతో మిత్రులతో కలిసి 2014లో గ్రామీణ సపోర్ట్‌ ఫౌండేషన్‌ స్థాపించారు. అప్పటినుంచి సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారు. జీఎస్‌ఎఫ్‌ కు కాడారి నరేశ్‌ అధ్యక్షుడిగా రవీంద్రవర్మ,ఉద్ద రాజు (భీమవరం), జమ్ముల అంబిక(అమెరికా)శ్రీవ్యాల్‌(స్ఫూర్తిఫౌండేషన్‌), ప్రదీప్‌వర్మ(సాప్ట్వేర్‌ ఇంజినీరు), ఉమేష్‌(హైదరాబాదు), సుష్మ చకిలం(అమెరికా), రవీందర్‌ బుర్గుల(అమెరికా) బల్ల స్వరూప్‌(సాప్ట్వేర్‌ ఇంజినీరు) సభ్యులుగా కొనసాగుతున్నారు. నెలల వేతనంలో 30శాతం ఫౌండేషన్‌ ఖాతాల్లో జమచేస్తారు.. వృద్ధులు, అనారోగ్య బాధితులు, ప్రతిభ ఉండి ఉన్నత విద్యను చదువుకోలేని విద్యార్థులకు తామునాన్నమంటూ ఆర్థిక సాయం అందిస్తున్నారు. సందర్భానుసారంగా వివిధ రకాల కార్యక్రమాలు చేపడుతూ సమాజసేవలో పేరు తెచ్చుకుంటున్నారు.


వైద్యాధికారిణిగా పేదప్రజలకు సేవలు అందించాలి

ఈచిత్రంలో జీఎస్‌ఎఫ్‌ ఆర్థిక సాయం అందుకుంటున్న వైద్యవిద్యార్థిని గాడేకర్‌ సంకీర్తన. ఆమెది నిరుపేద కుటుంబం. వైద్యవిద్యను చదువుకోటటానికి ఆర్థికసాయం లేక ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్న సమయంలో ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన ఫౌండేషన్‌ ప్రతినిధులు స్పందించారు. రూ.10వేలు ఆర్థికసాయం అందించారు.


కరోనా కష్టం సరుకులతో ఉపశమనం

ప్రైవేటు ఉపాధ్యాయులకు సరుకులు అందజేస్తున్న జీఎస్‌ఎఫ్‌ ప్రతినిధులు

రెండేళ్లకిందట కరోనా కష్టకాలంలో పైవేటు ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్లలేక ఇంటివద్దనే కాలం గడిపారు. వేతనాలు లేక నిత్యావసరాలు కొనలేని పరిస్థితి అలాంటి సందర్భంలో ఫౌండేషన్‌ ప్రతినిధులు కుభీరు, భైంసా మండలాలకు చెందిన ప్రైవేటు ఉపాధ్యాయులకు మూడు నెలలకు సరిపడా సరకులు, శానిటైజర్లు పంపిణీ చేసి ఉదారతను చూటుకున్నారు.


తెర పాఠం భావితరం ఆనందం

ఈచిత్రంలో కుభీరు మండలం మాలేగామ్‌ ప్రాథమిక పాఠశాల  ఉపాధ్యాయులకు ఎల్‌ఈడీ అందిస్తున్న ఫౌండేషన్‌ ప్రతినిధులు. విద్యార్థులు సాంకేతికతను అందిపుచ్చుకొని ప్రతిభవంతులుగా మారాలనే లక్ష్యంతో టీవీలు అందించినట్లు పేర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 54 పాఠశాలలకు రూ.1.80లక్షలు ఖర్చుచేసి ఎల్‌ఈడీ టీవీలు పంపిణీ చేశారు.


సేవా కార్యక్రమాలతోనే సంతృప్తి
-కడారినరేశ్‌ జీఎస్‌ఎఫ్‌ అధ్యక్షుడు

తొమ్మిదేళ్లుగా వృద్ధులకు దుప్పట్లు, విద్యార్థులకు చరవాణులు, పాఠశాలలకు కంప్యూటర్లు, పలువురికి చిరువ్యాపారాల కోసం ఆర్థికసాయం అందించాం. రానున్న రోజుల్లో మంచిర్యాంకులు సాధించి చదువుకోలేని విద్యార్థులకు చేయూత నిస్తాం. ఆటల్లో ప్రతిభకనబరిచిన పిల్లలకు ఆపన్నహస్తం అందిస్తాం. ఫౌండేషన్‌ సభ్యులందరం కలిసికట్టుగా నిధులు పొగుచేసి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అవి సంతృప్తి ఇస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని